twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    సెట్‌లో బాపు అథారిటీ: దర్శకుడంటే అలా...

    By Srikanya
    |

    నాకు బాపు గారు మా గురువు గారు బ్నిం(బాపు రమణలకు ఆప్తుడు) గారి ద్వారా ఉషాకిరణ్ గెస్ట్ హౌస్ లో పరిచయం(సినిమాల ద్వారా కాకుండా వ్యక్తిగతంగా)..తొలిసారి ఆయన్ను కలిసిన క్షణాలు నాకు ఇప్పటికీ గుర్తే. అప్పుడాయన రస్నా పాకెట్ తాగటానికి ఇచ్చారు. ఏదో ప్రేయసి తాకి ఇచ్చిన వస్తువులను దాచేవాడిలా... నేను దాన్ని చాలా కాలం దాచుకున్నాను. అఫ్ కోర్స్ తర్వాత ఆయన చేతి రాతతో రాసిన కవర్, మరొకటి మరొకటి సేకరించి, తస్కరించి దాచుకున్నాను లెండి. అలా ఆయనంటే ఓ కార్టూనిస్ట్ గానో, లేక ఓ చిత్రకారుడుగానో లేకుండా ఓ సినిమా దర్శకుడుగానో కాకుండా ఓ గొప్ప వ్యక్తిగా అభిమానం, ప్రేమాను...నాలాంటి ఎందరికో.

    ఆ తర్వాత రాధాగోపాలం (స్నేహ, శ్రీకాంత్) షూటింగ్ కు తరుచూ వెళ్తూండేవాడిని. సారథి స్టూడియోస్‌లో వేసిన సెట్‌లో ఆయన షూట్ చేస్తూండేవారు. డైరక్షన్ డిపార్టమెంట్ లో చేరుదామంటే అప్పటికే హౌస్ ఫుల్ బోర్డ్ పెట్టేసారని, బ్లాక్‌లో (అంటే మా బ్నిం గారి) రికమండేషన్ కూడా చెల్లదని చెప్పేశారు. సర్లే చేసేదేముంది... ఆ కొద్ది పాటి పరిచయం కదా అనే ధైర్యంతో సారధి కి వెళ్లి వస్తూండేవాడిని. అబ్జర్వ్ చేస్తూండేవాడిని..కాకపోతే సినిమా తీసే విధానం కన్నా బాపు గారు ఏం మాట్లాడుతున్నారు..ఆయన ఏం చేస్తున్నారో చూడటం మీదే నా దృష్టంతా.

    Bapu

    నా కళ్ల ముందు ఇప్పటికీ ఆ షూటింగ్‌లో జరిగిన చాలా సీన్స్ తీసిన విధానం కళ్ల ముందు ఉండిపోయింది. తర్వాత రామ్ గోపాల్ వర్మ లాంటి పెద్ద దర్శకుల షూటింగ్‌లు చూసినా ఆ తొలి ముద్రలు నాలో అలాగే కదలాడటం మానలేదు. ముఖ్యంగా బాపు గారు సీన్స్ ను ఆర్టిస్టులుకు చెప్పి వారి నుంచి నటన రాబట్టే స్టైల్ గమ్మత్తుగా అనిపించేది. రీ టేక్ లు చేయటానికి ఏ ఆర్టిస్టుకు ఇబ్బంది అనిపించనంత సరదాగా ఉండేవి.

    ఆయన వేసుకొచ్చిన స్టోరీ బోర్డ్ ప్రకారం... ఆ ఆర్టిస్టులను సీన్‌లో సర్దేవారు. తర్వాత ఆ బొమ్మలలో వారికి ప్రాణం పోసేవారు. ముఖ్యంగా స్నేహ తో సీన్స్ చేసేటప్పుడు ఆమె నవ్వుకు ఆయన చాలా ముచ్చటపడి.. దాన్ని కాప్చర్ చేయటానికి అదే పనిగా ప్రయత్నించేవారు. అది గమనించి ఆమె ఇంకా అద్బుతంగా నవ్వేసేది. అలాగే ఆ సీన్స్‌లో ఫన్‌కు ఆర్టిస్టులు కూడా ఒక్కోసారి సీరియస్‌గా నటించటం మానేసి నవ్వేస్తే ఆయన సీరియస్‌గా చూసే చూపులో దర్శకుడు ఎలా సెట్‌లో అథారిటీగా ఉండాలో అది కనిపించేది... లేదా నాకు అలా అనిపించేది.

    ఓ రోజు హిచ్ కాక్ గురించిన పుస్తకం ఒకటి నా స్నేహితుడు దగ్గర నుంచి తీసుకుని బిల్డప్ కోసం చేత్తో పట్టుకుని (మనం చదివేదా చచ్చేదా..అంత లావు ఇంగ్లీష్ పుస్తకాలు) .. సెట్ కి వెళితే...అక్కడ ఆ పుస్తకం చూసి బాపు గారు చదవటానికి తీసుకున్నారు. బాపు గారు నా దగ్గర పుస్తకం తీసుకున్నారు... అని ... మొదట కాలరెగరేశాను... తర్వాత... నాకు టెన్షన్ పట్టుకుంది. ఎందుకంటే ఆయనా ... అంత పెద్ద డైరక్టర్.. సార్ చదివారా.. అని అడగలేం.. ఓ ప్రక్కన షూటింగ్ జరుగుతోంది. షూటింగ్ అయ్యాక చెన్నై వెళ్లిపోతారు.. ఆ పుస్తకం చదవకుండా తీసుకోలేం.. అడిగాలంటే బిడియం... అడగకపోతే .. ఆ పుస్తకం ఇచ్చినవాడికి ఏం సమాధానం చెప్పాలి. అప్పటికీ ఆ పుస్తకం ఇచ్చిన వ్యక్తికి... బాపు గారు పుస్తకం తీసుకున్నారు... నువ్వు అదృష్టవంతుడువి అన్నాను. పుస్తకం ఇచ్చిన వ్యక్తి మహా ముదురు... సర్లే .. దాన్దేముంది...ఆయన సంతకం దాని మీద పెట్టించి పట్టుకురా..అన్నాడు..ట్విస్ట్ ఇస్తూ... ఇదెక్కడ గొడవరా దేముడా ఇలా ఇరుక్కుపోయాను... ఆయన్ను ఎలా అడుగుతాం.. మనమా వేరే వాళ్ల దగ్గర అడిగి తెచ్చుకున్నాం... చాలా ఎక్కువ రేటు పుస్తకం ... ఎలాగరా దేముడా... ఈ కొత్త టెన్షన్ పెట్టావు... అని మథన పడుతూంటే.. ఆయన ఓ రోజు ఉదయం షూటింగ్‌లో పిలిచి చదివేశాను.. మంచి పుస్తకం ...నువ్వూ చదువు అని చెప్తూ చేతిలో పుస్తకం పెట్టేశారు... అప్పుడు... సార్...కాస్త మీ సంతంకం పెట్టరా...అని అడగలేక అడిగితే... పాపం పెద్దాయన ఏమనుకున్నారో.. ఓ సంతకం అలా అలవోకగా .. గీసేసారు. హమ్మయ్య అని ఊపిరి పీల్చుకున్నాను.

    ఇక తర్వాత కాలంలో డైరక్టర్ అయితే కనుక చేస్తే ఆయనలా డైరక్ట్ చేయాలి... అన్నది మైండ్ లో ఫిక్స్ అయ్యా... కానీ ఆయనలా స్టోరీ బోర్డ్ వేసుకోవటం రాదే ..అని మరుక్షణమే బెంగ పట్టుకునేది. తర్వాత మెల్లిగా బ్నిం గారిని బ్రతిమిలాడుకుని... పెళ్లి పుస్తకం స్టోరీ బోర్డ్ సంపాదించి దాన్ని జెరాక్స్ తీసుకోవాలని ప్రయత్నం చేశాను. అంతటితో సరిపెట్టుకున్నాను.

    మళ్లీ కొంత కాలానికి ఓ బుద్ది పుట్టింది. బాపు గారి సినిమాల అన్నిటిని కలిపి విశ్లేషణలతో ఓ పుస్తకం వేయాలని. ఆ ప్రపోజల్ ..రమణ గారి ముందు పెడితే.. మా గురువు బ్నిం గారి సాయంతో ... ఆయన ఓ నెల రోజులు చెన్నై వచ్చి ఉండమన్నారు. కానీ ఎందుకనో అది నాకు సాధ్యం కాలేదు. ఇప్పడనిపిస్తుంది... జీవింతంలో కొన్ని మిస్ అవ్వకూడదని... ఏదైమైనా ఇలా నాలాంటి కొద్ది పాటి జ్ఞాపకాలు ఉన్నవాళ్లకు పెద్ద ఇబ్బంది లేదు...మా బ్నిం గారు... ఎంత అనుబంధం వారితో...వారికి ఫోన్ చెయ్యటానికి కూడా ధైర్యం చాలటం లేదు.. ఈ సమయంలో...

    ఇదే సమయంలో ఎప్పుడూ బాపు గురించే మాట్లాడుతూ.. బాపు కన్నా ముందే పైకి వెళ్లిపోయిన మా తాతగారు జి.ఎన్. భూషణ్ (స్టిల్ ఫొటో గ్రాఫర్)గారు గురించి కూడా చెప్పుకోవాలి... బాపు గారిని ఏం బాపూ అనే చనువు ఉన్న అతి కొద్ది మందిలో ఆయన ఒకరు. ఆయన బాపు గారు గురించి చెప్పిన ఓ చిన్న సెటైర్ తో ముగిస్తా...

    భూషణ్ గారు ఓ రోజు... బజారుకు వెళ్తూ... "బాపూ..బయటకు వెళ్తున్నా... నీకు ఏమన్నా కావాలా?" అని అడిగారట.

    వెంటనే బాపు తడుముకోకుండా... "అదే కావాలి" అన్నారట

    ఇలాంటివి ఎన్నో బాపు గారి గురించి భూషణ్ తాతగారు చాలా ముచ్చటగా చెప్పేవారు.

    అందరికి ఆప్తుడిగా మెలిగి.. ఈ ప్రపంచంలో తనకు పని పూర్తైందనుకున్నారో ఏమో... పైనున్న తన స్నేహితుడు రమణకి కంపెనీ ఇవ్వటానికి వెళ్ళారో.. మనకు ఆయన చిత్రాలను, కార్టూన్‌లను, సినిమాలను ఆస్తులుగా వదిలి నిష్క్రమించారు.

    - సూర్య ప్రకాష్ జోశ్యుల

    English summary
    Paying tribute to an eminent film director Bapu, Surya Prakash Josyula recollecting his acquintance with him, says a director with essence and authority.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X