»   » "బాహుబలి": పవన్ కళ్యాణ్ చూసి ఇలా...

"బాహుబలి": పవన్ కళ్యాణ్ చూసి ఇలా...

Posted by:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : ఇప్పుడు ఎక్కడ ఏ సెలబ్రెటీ నోట విన్నా "బాహుబలి" కబుర్లే. చూసిన ప్రతీ ఒక్కరూ అభినందిస్తూంటే...అంతా ఉబ్బితబ్బిబ్బు అవుతున్నారు. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం పవన్ కళ్యాణ్ సైతం ఈ చిత్రాన్ని రీసెంట్ గా చూసారు.

ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు


ఈ చిత్రం చూసిన వెంటనే పవన్ కళ్యాణ్..రానా ని పిలిచి..అబినందనలతో ముంచెత్తినట్లు సమాచారం. ఇంత ఘన విజయం సాధించినందుకు టీంకు కూడా అభినందనలు తెలియచేసినట్లు తెలుస్తోంది. పవన్ పొగడ్తలతో రానా ఆనందంలో మునిగి తేలుతున్నట్లు చెప్పుకుంటున్నారు.


రానా మాట్లాడుతూ... నా దృష్టిలో 'బాహుబలి' ఓ సినిమా కాదు. అదో అనుభూతి. తొలి ట్రైలర్‌ కట్‌ చేసిన తరవాత.. ఐమాక్స్‌లోని బిగ్‌ స్క్రీన్‌లో చూశాం. చూడగానే థ్రిల్లయిపోయా. ఆ తెరపై 'అవతార్‌', 'ట్రాయ్‌'లాంటి సినిమాలు చూసినవాణ్ని.నాకు 'బాహుబలి' కథ తెలుసు. అందులో సన్నివేశాలు తెలుసు. ఆ ఎమోషన్స్‌ తెలుసు. అయినా సరే.. 'బాహుబలి'ని చూడగానే ఓ మైకంలోకి వెళ్లిపోయాను. ఈ రోజున .. ప్రతి ప్రేక్షకుడూ అదే అనుభూతికి గురవుతున్నాడు అని అన్నారు.


'భళ్లాలదేవ' పాత్ర గురించి రానా ఏమన్నారంటే..


ఈ పాత్ర గురించి రచయిత విజయేంద్రప్రసాద్‌గారు నాతో 'భళ్లాలదేవ ఓ రాజు. తనకు దేవుడిపై నమ్మకం ఉండదు. కానీ జనం.. దేవుణ్ని కొలవడం ఇష్టం. ఆ దేవుడి స్థానంలో తాను ఉండడం ఇష్టం..' అన్నారు. అదీ.. భళ్లాలదేవ స్వభావం. ఆ మాట వినగానే 'అమ్మో వీడేం మనిషిరా బాబు..' అనుకొన్నా. రాజమౌళి సినిమాలో నటించే అవకాశం వస్తే ఎవ్వరూ 'నో' చెప్పరు.


రాజమౌళి, ప్రభాస్‌ కలసి 'బాహుబలి' అనే ఓ సినిమా చేస్తున్నారని చూచాయిగా నాకు తెలుసు. 'బాహుబలి'లో ప్రతినాయకుడి పాత్ర ఉంది. అది ఓ కథానాయకుడు చేస్తేనే బాగుంటుంది. నువ్వు చేయగలవా' అని శోభు యార్లగడ్డ అడిగారు. నాకు ప్రతినాయకుడి పాత్రలంటే ఇష్టం. శక్తిమంతంగా ఉండే పాత్ర కోసం నేనూ ఎదురుచూస్తున్నా. అందుకే కథ వింటానన్నాను.రాజమౌళి గారు కథ చెప్పడం కంటే ముందు ఓ మ్యాప్‌ చూపించారు. అది మహిష్మతి రాజ్యం అన్నమాట. 'ఇదిగో ఇది రాజుగారి కోట.. ఇది నీ అంతఃపురం' అంటూ నన్ను మహిష్మతి రాజ్యంలోని, ఆ కథలోకి తీసుకెళ్లే ప్రయత్నం చేశారు. ఆ తరవాత ఓ గంటన్నర పాటు 'బాహుబలి' కథ చెప్పారు.


కథ పూర్తవ్వగానే.. 'సార్‌... ఈ ఉత్సాహంలో ఎక్కడ ఓకే చెప్పేస్తానో అనే భయం ఉంది. కాస్త ఆలోచించుకొంటా' అని చెప్పి వచ్చేశా. నేను ఇప్పుడిప్పుడే పరిశ్రమలోకి అడుగుపెట్టా. తొలినాళ్లలోనే ఇంత బరువైన పాత్ర చేయగలనా? చేయడం సరైనదేనా? అనే సందేహం వెంటాడింది. పైగా ఈ సినిమా కోసం మూడేళ్లు ఇచ్చేయాలని నాకు ముందే తెలుసు. మూడేళ్ల కెరీర్‌ ఏంటి? అని కూడా ఆలోచించా.


చివరికి 'ఈ అవకాశం వదులుకొంటే మళ్లీ రాదు.. ఇలాంటి పాత్ర జీవితంలో మళ్లీ దక్కదు' అనిపించింది. అందుకే మళ్లీ రాజమౌళి గారి దగ్గరకే వెళ్లా. 'సార్‌.. నేను ఈ సినిమా చేస్తా. కానీ చేయడం మంచిదేనా, కాదా అనేది మీరే చెప్పాలి' అన్నా. 'ఈ నిర్ణయం నువ్వే తీసుకో' అని ఆయన అన్నారు. చివరికి నేను.. 'యస్‌..' అనేశా.


ఇక ఇప్పటికే అత్యంత ప్రతిష్ఠాత్మక 'బాహుబలి' చిత్రానికి సంబంధించిన రెండో ట్రైలర్‌ని చిత్ర యూనిట్ విడుదల చేసింది. ఈ ట్రైలర్లో భారీ జలపాతాలు, మహిష్మతి రాజ్యంలోని వివిధ దృశ్యాలను, భారీ యుద్ధ సన్నివేశాలను చూపించారు. దీంతో ఇప్పటికే భారీ స్థాయిలో ఉన్న అంచనాలను తారాస్థాయికి చేర్చారు.


ఈ చిత్రంలో ప్రభాస్‌, అనుష్క, తమన్నా, రానా ఇతర ముఖ్య పాత్రధారులు. ప్రసాద్‌ దేవినేని, శోభు యార్లగడ్డ నిర్మాతలు. కె.రాఘవేంద్రరావు సమర్పకుడు. ఇప్పటికే విడుదలైన సినిమాకు ప్రపంచవ్యాప్తంగా మంచి స్పందన వస్తోంది.

English summary
Pawan Kalyan watched Baahubali movie and he appreciated actor Rana (Bhallaladeva) in the film.
Please Wait while comments are loading...