twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    నష్టాల ‘రుద్రవీణ’-చిరంజీవి గొప్ప సినిమా ఎలా?(స్పెషల్ స్టోరీ)

    By Bojja Kumar
    |

    హైదరాబాద్ : మాస్ హీరోగా దూసుకుపోతున్న రోజుల్లో చిరంజీవి తన స్టార్ ఇమేజ్‌ను పక్కన పెట్టి ఒక సామాన్య పాత్రలో అసామాన్య చిత్రం చేసారు. అదే ప్రముఖ దర్శకుడు బాలచందర్ దర్శకత్వంలో వచ్చిన 'రుద్రవీణ'. ఈచిత్రానికి కలెక్షన్ల వర్షం కురవక పోయినా....సినీ విమర్శకుల నుంచి ప్రశంసలు, ప్రభుత్వం నుంచి అవార్డులు కుప్పలు తెప్పలుగా వచ్చి పడ్డాయి.

    చిరంజీవికి నటన పరంగా ఎనలేని కీర్తిని తెచ్చి పెట్టిన 'రుద్రవీణ' చిత్రం ఆయన సీని కెరీర్లో ఆణిముత్యాల్లాంటి చిత్రాల్లో ఒకటిగా, కలికితు రాయిగా నిలిచింది. ఈ సినిమాకున్న మరో ప్రత్యేకత చిరంజీవి సోదరుడు నాగబాబు ఈ చిత్రం ద్వారానే నిర్మాతగా పరిచయం అయ్యారు. చిరంజీవి సూచన మేరకు వారి తల్లిగారి పేరు మీదన అంజని ప్రొడక్షన్ పతాకం స్థాపించి నిర్మాతగా మారారు. 1988 మార్చి 4 తేదీన విడుదలైన ఈచిత్రం నేటితో పాతికేళ్లు పూర్తి చేసుకుంది.

    సమాజంలో కులజాఢ్యం బాగా ఎక్కువగా ఉన్న ఆ రోజుల్లో.....దాన్ని తెగనరుకుతూ రూపొందిన ఈ చిత్రం ఒక మంచి సామాజిక చిత్రంగా పేరు తెచ్చుకుంది. అయితే నిర్మాతగా మాత్రం నాగబాబుకు నష్టాలనే మిగిల్చింది. అప్పట్లో దాదాపు రూ. 80 లక్షలు ఖర్చు పెట్టిన ఈచిత్రం నాగబాబుకు రూ. 6 లక్షల నష్టాన్ని మిగిల్చింది. ఈచిత్రం వల్ల నష్టపోయానని కొంత నిరాశ పడ్డప్పటికీ ఓ గొప్ప సినిమాను తీసాననే ఆత్మసంతృప్తి, గర్వం ఇప్పటికీ ఉంటుందని చెబుతుంటారు నాగబాబు.

    'రుద్రవీణ' టైటిల్‌ పెట్టడానికి ముందు మొదట్లో 'బిలహరి' అనుకున్నారట. ఈ చిత్రంలో ప్రధాన పాత్రధారి గణపతి శాస్త్రి బిలహరి రాగంలో నిష్ణాతుడు. ఆ రోజుల్లో రాగాల పేర్లతో 'శివరంజని, శంకరా భరణం, ఆనందభైరవి' లాంటి సినిమాలు వచ్చాయి. దీంతో ఆ టైటిల్ వద్దనుకున్నారు. గణపతి శాస్త్రి స్వభావ రీత్యా రుద్రావతారమే. కాబట్టి రుద్రవీణ టైటిల్ ఖరారు చేసారు.

    సూర్యం(చిరంజీవి), లలిత(శోభన), గణపతి శాస్త్రి(జెమినీ గణశన్) పాత్రల చుట్టే సినిమా మొత్తం తిరుగుతుంది. అడవిలో గొడ్డలి చప్పుళ్ల శ్రుతిలయలు విన్న సూర్యం శ్రామికుల వినోదం కోసం ఒక జానపద గీతం పాడాడు. గణపతిశాస్త్రి విని అది ఏ రాగం అని అడిగితే హంసధ్వని అని సూర్యం అనగా కాదు 'హింసధ్వని' అంటారాయన కోపంగా. అలా తండ్రి కొడుకుల మధ్య విభేదాలు మొదలవుతాయి.

    నువ్వు నా కొడుకువని ఎప్పుడూ చెప్పుకోకూడదని శాసిస్తాడు తండ్రి. నేను నీ తండ్రినని చెప్పాల్సిన గర్వపడే రోజు వస్తే అప్పుడు నేను నిన్ను వెతుక్కుంటూ వస్తాను, పుత్రగాత్ర (శరీరం) పరిష్యంగ సుఖాన్ని అనుభవిస్తానని ఒక రకమైన సవాలు చేసాడు గణపతిశాస్త్రి. ఆ సవాలుకు సూర్యం జవాబే, మిగిలిన కథాంశం. ఈ సినిమాలో తండ్రీ కొడుకుల మధ్య సంఘర్షణ వచ్చినప్పుడు దాన్ని సంగీతంతో చల్లబరిచే చికిత్స చాలా గొప్ప ఆలోచన.

    సంగీతం విషయంలో తండ్రికి శిష్యుడే అయినా, కులాలు అస్పృశ్యత వంటివి పట్టించుకోకుండా, ఆర్తులను ఆదుకోవడానికే పెద్దపీట వేస్తూ, ఈ అంశంలో తండ్రిని ధిక్కరించినవాడిగా, కుటుంబంలో పరాయివాడుగా వుండాల్సిన పరిస్థితిలోను, నిమ్నజాతి వారితో కలిసిపోయిన వాడుగా, తాగుబోతుల మాటలకు ప్రేమను పెళ్లిని త్యాగం చేసి, సమాజసేవపైనే దృష్టి పెట్టినవానిగా, సూర్యనారాయణ (సూర్యం) పాత్రలోను, పాటలున్న సన్నివేశాల్లోనూ మంచినటన ప్రదర్శించారు చిరంజీవి.

    జాతీయస్థాయిలో జాతీయ సమైక్యతను ప్రభోదించే ఉత్తమ చిత్రంగా నర్గీస్‌దత్‌ అవార్డ్‌ని, ఇళయరాజాకు ఉత్తమ సంగీత దర్శకుడు, ఎస్‌.పి. బాలసుబ్రహ్మణ్యంకి ఉత్తమ గాయకుడు అవార్డును దక్కించు కుంది. రాష్ట్రస్థాయిలో నంది అవార్డులలో ఉత్తమ నటుడుగా జ్యూరీ అవార్డు మాత్రమే దక్కించుకోగలిగింది. గణేశ్‌ పాత్రోకి మాటల రచయితగా నంది అవార్డ్‌ తీసుకొచ్చింది. అంజనా ప్రొడక్షన్స్‌ పతాకాన చిరంజీవి నాగబాబు నిర్మించిన ఈ చిత్రంలోని పలు అంశాలు ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వంకి, ముఖ్యమంత్రులకు స్ఫూర్తినిచ్చి, ఆ చిత్రంలోని అంశాలను తమ పథకాలుగా ప్రవేశపెట్టారంటే...ఈ సినిమా గొప్పతనం ఏమిటో అర్థం చేసుకోవచ్చు.

    English summary
    "Rudraveena" movie completes 25 years. Rudraveena is a 1988 Telugu film starring Chiranjeevi and Shobana. Produced by Anjana Productions, the film was directed by K. Balachander with music by maestro Ilaiyaraaja. Songs were sung by S. P. Balasubrahmanyam, K. J. Yesudas and K. S. Chithra. The lyrics, penned by Sirivennela Sitarama Sastry.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X