twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    'బాహుబలి' : మీరు వినని కొత్త సంగతులు(కొత్త ఫొటోలతో)

    By Srikanya
    |

    హైదరాబాద్ : నాన్నగారు అప్పుడెప్పుడో 'శివగామి' అనే పాత్ర గురించి చెప్పారు. నాకు భలే నచ్చేసింది. ఆయన చెప్పింది పాత్ర మాత్రమే. కథ లేదు.. సన్నివేశాలేం లేవు. ఆ తరవాత.. భళ్లాలదేవ గురించి చెప్పారు. కొన్నేళ్లకు కట్టప్ప గురించి చెప్పారు. మా దగ్గర క్యారెక్టరైజేషన్లు మాత్రమే ఉన్నాయి. కథేం లేదు. ఈ పాత్రలన్నింటినీ కలుపుకొంటూ కథ రాస్తే బాగుంటుంది కదా.. అనిపించింది.

    అలా అనుకొన్న తరవాత రెండున్నర నెలల్లో 'బాహుబలి' కథ రెడీ అయిపోయింది. సినిమాలో ఏడెనిమిది పాత్రలు చాలా కీలకం. ప్రతి పాత్రకీ 'బాహుబలి' పాత్రతో సంబంధం ఉంటుంది. అలా కొన్ని పాత్రల నుంచి.. 'బాహుబలి' ఆలోచన, ఆ ఆలోచనల నుంచి కథ పుట్టుకొచ్చింది అంటూ రాజమౌళి చెప్పుకొచ్చారు. అసలు 'బాహుబలి' అనే ఆలోచన మొదలైన విషయం ఆయన ఇలా పంచుకున్నారు.

    ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు

    జులై 10న రాజమౌళి కలల చిత్రం 'బాహుబలి' సినిమా ప్రేక్షకుల ముందుకొస్తోంది. ఈ సందర్భంగా మీడియాతో రాజమౌళి ప్రత్యేకంగా మాట్లాడారు. ఆ 'బాహుబలి' కబుర్లన్నీ.. మీ కోసం స్లైడ్ షో లో...

    సోషల్ మీడియా హెల్ప్ అయ్యింది

    సోషల్ మీడియా హెల్ప్ అయ్యింది

    ఇంతవరకూ ఒక్క పేపర్ యాడ్ లేకుండా, సోషల్ మీడియా పబ్లిసిటీతో ఇండస్ట్రీలో కొత్త దోవ తొక్కాం. దానికీ శోభూ ముందు చూపే కారణం. 'ఈగ' టైమ్‌లోనే సోషల్ మీడియా పవర్ గురించి శోభు చెప్పేవారు. ఇవాళ సెట్స్‌లో లైట్‌బాయ్ చేతిలో కూడా స్మార్ట్‌ఫోన్, ఫేస్‌బుక్‌లో ఎకౌంట్ ఉన్నాయి. హిందీలో కరణ్ జోహార్ ముందుకు రావడానికీ, ఇతర భాషల్లో మా గురించి తెలియడానికీ కూడా సోషల్ మీడియానే హెల్పయింది.

    ఆ క్రెడిట్ ఈ సినిమాదే...

    ఆ క్రెడిట్ ఈ సినిమాదే...

    ఈ సినిమాకు అంతర్జాతీయంగానూ అంత స్పాన్, స్కోప్ ఉన్నాయని గుర్తించింది శోభూనే! 'ఈగ' టైమ్ నుంచే కాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌కు వెళ్ళి, మన సినిమా గురించి వాళ్ళకు తెలిసేలా చేశారు. 'బాహుబలి' కాన్సెప్ట్ ఆర్ట్స్, సినాప్సిస్ సహా మూడేళ్ళ క్రితమే వాళ్ళకు చూపించారు. అందుకే, వాళ్ళు 'బాహుబలి' గురించి రాశారు. నాకు తెలిసి ఈ మధ్య కాలంలో ఏ భారతీయ సినిమా గురించీ ఈ ఇంటర్నేషనల్ మ్యాగజైన్స్‌లో రాలేదు. సౌతిండియన్ సినిమా గురించైతే, వాటిలో ఇంతకు ముందెప్పుడూ రాలేదు. ఆ క్రెడిట్ 'బాహుబలి'కి దక్కింది.

    ఓ రేంజిలో ఒత్తిడి

    ఓ రేంజిలో ఒత్తిడి

    ఒత్తిడి ఓ రేంజ్‌లో ఉంది. విడుదల తేదీ దగ్గర పడుతున్నకొద్దీ అది పెరుగుతూనే ఉంది. ఇప్పుడు ఎవరు ఎంత పొగుడుతున్నా, ఎంత గొప్పగా మాట్లాడుతున్నా అవేం బుర్రకెక్కవు. అనుకొన్న షాట్‌ అనుకొన్నట్టు వచ్చిందా, లేదా? అనుకొన్న సమయానికి సినిమాని విడుదల చేయగలమా లేదా? అనే సందేహాలే బుర్రలో తిరుగుతున్నాయి.

    రిస్కే కానీ...

    రిస్కే కానీ...

    మూడేళ్ళ లైఫ్, కెరీర్ పణంగా పెట్టడం రిస్క్ అనిపించలేదు. ఎందుకంటే, ఏదో ఒక పాయింట్‌లో వచ్చిన ఆలోచనలతో కథ తయారవుతుంది. అలా తయారైన కథ బెత్తం పట్టుకొని, మన ముందే కూర్చుంటుంది. ఆ కథకు న్యాయం చేయడం కోసం మన ప్రయాణం మొదలవుతుంది. ఆ క్రమంలో జరిగే ప్రయాణమే సినిమా. ఆ జర్నీ ఎన్నాళ్ళు పట్టినా, మనకు కావాల్సిన శక్తిని ఆ స్టోరీయే ఇస్తుంది. ఏటా వంద సినిమాలోస్తే పదే ఆడుతున్నాయి. కాబట్టి, చిన్న రిస్కా, పెద్ద రిస్కా అని కాకుండా మనకు నచ్చిన సినిమా, నచ్చినట్లుగా చేస్తే బెటర్ కదా.

    ఆశ...అంచనాలు

    ఆశ...అంచనాలు

    ఆశైతే అందరికీ ఉంటుందండీ. తమ సినిమా గురించి మాట్లాడుకోవాలని, అంతర్జాతీయ గుర్తింపు రావాలని, దేశమంతా సినిమా కోసం ఎదురుచూడాలని అందరూ అనుకొంటారు. కానీ ఈ స్థాయిలో మాత్రం మేం ఊహించలేదు. విడుదలకు ముందే విపరీతమైన అంచనాలతో 'బాహుబలి' ఓ అంతర్జాతీయ ప్రాజెక్ట్‌గా మారిపోయింది. ప్రభాస్‌ వరుస విజయాలతో మంచి జోరుగా ఉన్నాడు. నా వెనుకా కొన్ని విజయాలున్నాయి. పైగా పెద్ద బడ్జెట్‌.. స్టార్లున్నారు. దాంతో సాధారణంగానే ఎంతో కొంత హైప్‌ వస్తుందనుకొంటాం. కానీ.. మా అంచనాలకు మించిన అంచనాలు పెట్టుకున్నారు జనాలు.

    క్రాస్ చెకింగ్ ఉంది..

    క్రాస్ చెకింగ్ ఉంది..

    క్రాస్‌ చెకింగ్‌ అనేది ఎప్పుడూ ఉండేదే. ఒక సన్నివేశం తీశామంటే ఒకటికి వందసార్లు సరిచూసుకొంటా. నేనే నా తప్పుల్ని భూతద్దంలో పెట్టుకొని చూసుకొంటా. ఏదో పెద్ద సినిమా తీస్తున్నామని కాదు.. ఏ సినిమాకైనా నేను పాటించే ప్రాథమిక సూత్రం ఇదే. కాకపోతే నేనెప్పుడూ ఇదేదో ఒత్తిడి అనుకోలేదు. అలా ఆలోచించడం మొదలెడితే పూర్తిగా అందులోనే కూరుకుపోతాం. నాతో పని చేసిన ప్రతి సాంకేతిక నిపుణుడికీ అపారమైన అనుభవం ఉంది. నా సినిమా కోసం రెండేళ్ల సమయం కేటాయించారంటే.. వాళ్లకు తెలుసు, 'బాహుబలి' ఏమిటో!

    నూరు శాతం వచ్చిందా

    నూరు శాతం వచ్చిందా

    నా కలల్లోని 'బాహుబలి'ని నూటికి నూరుశాతం తెరపై తీసుకొచ్చినట్టేనా అంటే... అలా అనుకొన్నది అనుకొన్నట్టు ఎప్పటికీ తీయలేం. నేనే కాదు, ఏ దర్శకుడూ తీయలేడు. వూహకి హద్దులు ఉండవు. కానీ.. సినిమాకి హద్దులుంటాయి. ఎంత కష్టపడినా వందకి వంద శాతం తెరపై తీసుకురాలేం. మా వూహలకు ఎంత దగ్గరగా వెళ్లడానికి వీలవుతుందో, అంత దగ్గరగా వెళ్లాం. మా స్వప్నం, మా నమ్మకం.. మా కష్టం.. 'బాహుబలి' రూపంలో ఆవిష్కరించాం.

    మోస్ట్ డిఫికల్ట్ షూటింగ్ డే

    మోస్ట్ డిఫికల్ట్ షూటింగ్ డే

    కేరళలో జలపాతాల దగ్గర చేశాం. బల్గేరియాలో ఎముకలు కొరికే చలిలో చిత్రీకరించాం. అవన్నీ ఒక ఎత్తయితే, ఈ సినిమా కోసం ఆర్.ఎఫ్.సి.లో 4 నెలల పాటు తీసిన యుద్ధం సీన్లు మరో ఎత్తు. నా కెరీర్‌లోనే మోస్ట్ ఛాలెంజింగ్ షూటింగ్. అందరికీ అది మరపురాని అనుభవం.

    నాన్నగారు, అన్నయ్య ఎడిటింగ్

    నాన్నగారు, అన్నయ్య ఎడిటింగ్

    మీ నాన్న గారు, పెద్దన్న కీరవాణి ఎడిటింగ్ కూడా చేశారు. నాన్నగారికి విజువల్స్, గ్రాండియర్ మీద దృష్టి ఉంటే, పెద్దన్న వాటికన్నా పాత్రల మధ్య ఎమోషన్ క్యారీ అయిందా లేదా చూస్తాడు. మిగతా కథల కన్నా ఈ కథ మీద నాన్న గారు విపరీతమైన ఎటాచ్‌మెంట్ పెంచుకున్నారు. రషెస్ కూడా ఎప్పటికప్పుడు చూస్తూ వచ్చారు. నా ఎడిటింగ్ చూసి, తనదైన ఆలోచనతో మరో రకంగా కూడా ఎడిట్ చేసి చూపించేవారు. మరొక దర్శక - రచయిత దృష్టి కోణంలో మనకు తట్టనిది తట్టవచ్చు కదా! అలా నాన్న గారు, 230 సినిమాలకు మ్యూజిక్ అందించి, రీరికార్డింగ్ చేసిన పెద్దన్న (కీరవాణి) చెప్పిన కొన్ని సలహాలు, సూచనలు బాగా ఉపయోగపడ్డాయి.

    టెక్నీషియన్స్ తో నే...

    టెక్నీషియన్స్ తో నే...

    సాంకేతిక నిపుణులు, నటీనటులు అంతా.. అనుభవజ్ఞులే. అపార ప్రతిభావంతులే. వాళ్ల ఆలోచనలు, అభిప్రాయాలూ, అనుభవం 'బాహుబలి'కి చాలా వరకూ కలిసొచ్చింది. మాలో ఒకరిపైఒకరికి నమ్మకం ఉంటేనే ఈ ప్రయాణం సాధ్యమవుతుంది. ఇక్కడ మా అభిరుచులేం ఒక్కటి కావు. సెంథిల్‌కు నచ్చిన పాట నాకు నచ్చదు. నాకు నచ్చిన వంట సాబుసిరిల్‌కి నచ్చకపోవచ్చు. పెద్దన్న కీరవాణి ఇష్టాలూ నా ఇష్టాలూ మ్యాచ్‌ కాకపోవచ్చు. కానీ మా అందరినీ కలిపిన బంధం సినిమా.

    వాట్సప్ లో వచ్చిన కథ గురించి

    వాట్సప్ లో వచ్చిన కథ గురించి

    ఇంతకీ వాట్సప్‌లో వచ్చిన కథ ఈ సినిమాదేనా అంటే కాదనే చెప్పాలి. 'బాహుబలి' కథ అంటూ, చాలా కథలే వచ్చాయి. కానీ, ఈ సినిమా అసలు కథ మాత్రం వేరు.

    '300', 'ట్రాయ్' వచ్చినా

    '300', 'ట్రాయ్' వచ్చినా

    '300', 'ట్రాయ్' లాంటి హాలీవుడ్ సినిమాలొచ్చాయి. డబ్ అయ్యాయి. అయినా 'బాహుబలి' కొత్త అనుభూతవుతుంది. 'బాహుబలి' అంటే కేవలం విజువల్ గ్రాండియర్, పెద్ద సంఖ్యలో జనం, యుద్ధాలే కాదు. అది కేవలం ఆడియన్స్‌ను థియేటర్‌కు రప్పించడానికి ట్రైలర్‌లో చూపిస్తున్నాం. ఒక రకంగా పబ్లిసిటీ స్టంట్ అనుకోండి. కానీ, అంతకు మించిన భావోద్వేగాలు ఈ సినిమాలో ఉన్నాయి. జనం ఒకసారి థియేటర్‌కు వచ్చాక, ఆ ఎమోషనల్ కంటెంట్‌తో కట్టిపడేస్తాం. ఆ నమ్మకం మాకుంది.

    రెండు భాగాల ఆలోచన?

    రెండు భాగాల ఆలోచన?

    ఏడెనిమిది పాత్రల్నీ జోడించుకొంటూ కథైతే రాసేశాం. తీరా చూస్తే చాలా పెద్ద కథైపోయింది. మన లెక్కలో సినిమా అంటే రెండున్నర గంటలే. అందుకే రాసిన సన్నివేశాలు కుదించుకొంటూ వచ్చాం. మేం అనుకొన్నది అనుకొన్నట్టు తీయాలంటే రెండు భాగాలుగా చూపించాల్సిందే అని అప్పుడే భావించాం.

    వందకు వంద శాతం

    వందకు వంద శాతం


    ప్రతి సినిమాకీ ఓ ముగింపు ఉండాలి. మనం అలా అలవాటు పడిపోయాం. హాలీవుడ్‌ సినిమాల్ని చూడండి. ఏడాదికో భాగం విడుదల చేస్తుంటారు. ఆ సినిమాల్ని మన తెలుగు జనాలు చూసేస్తున్నారు. 'బాహుబలి' ఏ భాగం చూసినా ప్రేక్షకుడు నూటికి నూరుశాతం సంతృప్తిపడతాడు.

     హిందీలో 'మఖ్ఖీ' ('ఈగ' సినిమా హిందీ పేరు) ఫ్లాఫ్ మరి, 'బాహుబలి'

    హిందీలో 'మఖ్ఖీ' ('ఈగ' సినిమా హిందీ పేరు) ఫ్లాఫ్ మరి, 'బాహుబలి'

    'ఈగ' హిందీ డబ్బింగ్‌ను మార్కెట్ చేసినవాళ్ళతో వియ్ ఆర్ నాట్ వెరీ హ్యాపీ. పాపం... వాళ్ళు అనుకున్నంత ప్రొఫెషనల్‌గా, ఎఫిషియెంట్‌గా చేయలేకపోయారు. దాంతో, 'మఖ్ఖీ' థియేటర్లలో కన్నా అక్కడ శాటిలైట్ టీవీ చానల్స్‌లో అది బాగా పేరు తెచ్చుకుంది. 'బాహుబలి' విషయంలో కరణ్ జోహార్ రంగంలోకి దిగారు. అన్ని జాగ్రత్తలూ తీసుకొని, ప్లానింగ్‌తో ప్రమోట్ చేస్తున్నారు. కచ్చితంగా, అందరినీ ఈ సినిమా ఆకట్టుకుంటుంది.

    వాళ్లనే తీసుకున్నాం

    వాళ్లనే తీసుకున్నాం

    పాత్రలు రాసుకొనేటప్పుడు.. ఫలానా పాత్రకు ఫలానావాళ్లయితే బాగుంటుంది అనిపిస్తుంది. ఓ పాత్ర గురించి వూహించుకొనేటప్పుడు.. ఆ వూహ కళ్ల ముందు కనిపించాలి అంటే ఆ పాత్రధారి ఎవరో తెలిసుండాలి. శివగామి, భళ్లాలదేవుడు, ఇలా అన్ని పాత్రలకూ ముందు నుంచీ ఎవరినైతే అనుకొన్నామో వాళ్లనే తీసుకొన్నాం.

    శ్రీదేవి అనుకున్నాం కానీ...

    శ్రీదేవి అనుకున్నాం కానీ...

    ఈ సినిమాని వివిధ భాషల్లో విడుదల చేయాలనుకొన్నాం. మార్కెట్‌ని దృష్టిలో ఉంచుకొని శ్రీదేవి, సుస్మితాసేన్‌, టబు.. ఇలా చాలా మందిని పరిశీలించాం. డేట్స్‌ కోసం అడిగాం. అయితే వాళ్లలో ఎవ్వరూ దొరకలేదు. మా అదృష్టం కొద్దీ.. రమ్యకృష్ణగారు దొరికారు. ఆవిడ గురించి ఒకే ఒక్క మాట... చింపేశారు. శివగామిగా ఆమె నటన.. అంత త్వరగా మర్చిపోలేం.

    అవన్నీ కుదరలేదు

    అవన్నీ కుదరలేదు

    'బాహుబలి' మేకింగ్ గురించి ఏదైనా బుక్కే రాయచ్చు. చాలా ఆలోచనలున్నాయి. కామిక్స్, బొమ్మలు - ఇలా చాలా. ఇప్పుడు కుదరలేదు. ఫస్ట్‌పార్ట్‌కీ, సెకండ్ పార్ట్‌కీ మధ్య గ్యాప్‌లో అవన్నీ చేస్తాం.

    ప్రభాస్‌ కోమాలోకి వెళ్లిపోయాడన్న వార్తలు

    ప్రభాస్‌ కోమాలోకి వెళ్లిపోయాడన్న వార్తలు



    ఇలాంటివి విన్నప్పుడు ముందు చాలా ఆవేశపడిపోయేవాణ్ని. 'ఎవరు రాశారు, ఎందుకు రాశారు, ఏ ఆధారాలతో రాశారు?' అంటూ వూగిపోయేవాణ్ని. టీమ్‌ అంతా ఎమోషన్‌గా ఫీలయ్యేవాళ్లం. ఎప్పుడైతే ప్రభాస్‌ కోమాలో ఉన్నాడన్నారో (నవ్వుతూ) అప్పట్నుంచి మనమేం చేయలేం ఇలాంటివి వస్తూనే ఉంటాయని లైట్‌ తీసుకోవడం మొదలెట్టాం.

    నమ్మాల్సిందే..తాళాలు వేసుకోలేం

    నమ్మాల్సిందే..తాళాలు వేసుకోలేం

    లీక్ అయినప్పుడు చాలా బాధ పడేవాళ్లం. చిన్న పిల్లలం కాదు కాబట్టి కన్నీళ్లు పెట్టుకోం గానీ, అంతే బాధ. ఎందుకంటే.. అంతమంది ఇన్ని సంవత్సరాల కష్టం. ఇదంతా వృథా అయిపోతుందే అన్న బాధ. సినిమా అనేది నమ్మకం మీద జరుగుతుంది. అందర్నీ నమ్మాల్సిందే. ఎక్కడికక్కడ తాళాలు వేసుకొని పనిచేయలేం. మనం పూర్తిగా నమ్మిన వ్యక్తే మోసం చేస్తే ఆ బాధ తట్టుకోగలమా? లీక్‌ అయ్యాక మనం చేయగలిగిందేం ఉండదు. బాధపడడం తప్ప. ఆ నష్టానికి వెలకట్టలేం. తిరిగి లాక్కోలేం. ఇలాంటివి జరిగినప్పుడు బాధ, కోపం అన్నీ వస్తాయి. కానీ ఏం జరిగినా మన మంచికే అనుకోవాలి.

    ప్లస్...మైనస్

    ప్లస్...మైనస్

    ఈ సినిమా గురించి.. ఇప్పటికే అన్ని చోట్లా దీన్ని భూతద్దంలో చూస్తున్నారు. ఇది ఒక రకంగా సినిమాకు ఎడ్వాంటేజ్. మరోరకంగా డిజ్ ఎడ్వాంటేజ్. ఆశించినదానికన్నా ఏ మాత్రం ఎక్కువున్నా జనం బ్రహ్మాండం అంటారు. కొద్దిగా తేడా వచ్చినా, కష్టమే. అందుకే, మా అంతట మేము మరీ పబ్లిసిటీ లేదు.

    జోకులు వేసుకున్నాం

    జోకులు వేసుకున్నాం

    మూడేళ్ల పాటు సెట్లో బోల్డన్ని పుట్టిన రోజులు, మా టీమ్‌లో ఉన్న అరవై డెభ్భైమందికి పెళ్లిళ్లయ్యాయి.. ఆడియో వేడుకలో కూడా మాపై మేం జోకులు వేసుకొన్నాం..

    అదే నమ్మకం

    అదే నమ్మకం

    మన మార్కెట్‌ స్థాయికి తగిన సినిమాల్ని మనం ఇంకా తీయడం లేదనిపిస్తోంది. ఇంకా మనం గొప్ప గొప్ప వసూళ్లు సాధించగలం. అందర్నీ థియేటర్లకు తీసుకురాలేకపోతున్నాం. అలా తీసుకొస్తే.. అద్భుతాలు సృష్టించొచ్చన్నది మా ప్రగాఢమైన నమ్మకం. ఆ నమ్మకంతోనే 'బాహుబలి' తీశాం. ఇన్ని కోట్లు తీసుకురాగలమా, లేదా? అనేది తెలియాలంటే ముందు పెట్టుబడి పెట్టాలిగా?

    ఎన్ని భాషల్లో 'బాహుబలి' ?

    ఎన్ని భాషల్లో 'బాహుబలి' ?

    తెలుగు, తమిళంలో నేరుగా విడుదల చేస్తున్నాం. హిందీ, మలయాళం డబ్బింగ్‌ వెర్షన్లు. రెండు మూడు నెలలు సమయం తీసుకొని విదేశీ భాషల్లో విడుదల చేస్తాం.

     మహాభారత గాథని సినిమాగా ఎప్పుడు?

    మహాభారత గాథని సినిమాగా ఎప్పుడు?

    'బాహుబలి' కంటే.. వంద రెట్ల గొప్ప ప్రాజెక్ట్‌ అది. ఆ సినిమా తీయాలంటే... నాకున్న జ్ఞానం, ఇప్పుడున్న సాంకేతిక పరిజ్ఞానం కూడా సరిపోదు.

     ఆమీర్‌ ఖాన్‌తో సినిమా గురించి?

    ఆమీర్‌ ఖాన్‌తో సినిమా గురించి?

    ఏమోనండీ. మేమిద్దరం సినిమా తీయాలి అని మాట్లాడుకోలేదు. ఆయనకు మగధీర నచ్చింది. ఆ సినిమా చూశాక.. 'కలుద్దాం' అన్నారు. మేం కలసినప్పుడు మహాభారతం గురించి ఇద్దరం మాట్లాడుకొన్నాం. ఆయనకూ మహాభారతం అంటే చాలా ఇష్టం.

    త్వరలో వీడియో చేస్తాం

    త్వరలో వీడియో చేస్తాం

    'బాహుబలి' గురించి అమితాబ్‌ బచ్చన్‌ గొప్పగా మాట్లాడారు... ఆ మాటలు విని.. ఆకాశంలో ఎగిరినంత సంబరపడ్డాం. రానా అమితాబ్‌కు ట్రైలర్‌ చూపించాడు. ఆయనకు బాగా నచ్చిందట. 'ఈ సినిమా గురించి మాట్లాడతా.. కెమెరా తీసుకురండి..' అన్నారట. ఆ వీడియో త్వరలో విడుదల చేస్తాం.

    రజనీకాంత్‌ మీ సెట్‌కి వస్తానన్నారు..

    రజనీకాంత్‌ మీ సెట్‌కి వస్తానన్నారు..

    రజనీకాంత్‌గారికి 'మగధీర', 'ఈగ' చాలా బాగా నచ్చాయి. 'నన్ను సెట్‌కి ఎప్పుడు పిలుస్తారు?' అని అడిగేవారు రజనీ. అయితే ఆయన మా సెట్‌కు రావడం కుదర్లేదు.

    సూర్య అడిగారు కానీ..

    సూర్య అడిగారు కానీ..

    'బాహుబలి'లో నటించాలనుందని సూర్య అడిగారు... అదంతా వాళ్లకు నామీద, నా సినిమాపైనా ఉన్న ఇష్టమే. సూర్యలాంటి నటుడికి చిన్న పాత్ర ఎలా ఇస్తామండీ?

    టెక్నీషియన్స్ లో ది బెస్ట్

    టెక్నీషియన్స్ లో ది బెస్ట్

    ఈ సినిమాకి పనిచేసిన సాంకేతిక నిపుణుల్లో.. ది బెస్ట్‌ ఎవరు అంటే అందరూ బెస్టే. అందుకే ఈ సినిమాకి పెట్టుకొన్నాం. ముందు నుంచీ చివరి వరకూ ఏకాగ్రత సడలకుండా పనిచేసినవాళ్లు ది బెస్ట్‌ అని చెప్పొచ్చు. అలా చాలా మంది ఉన్నారు. అడిగిన వెంటనే గుర్తొచ్చే పేర్లు.. శ్రీనివాసమోహన్‌, సాబు సిరిల్‌, సెంథిల్‌, శ్రీవల్లి.

    'బాహుబలి'ని ఆస్కార్‌కి ?

    'బాహుబలి'ని ఆస్కార్‌కి ?

    ఎవరైనా ఈ సినిమాని అవతార్‌తో పోలుస్తుంటే.. అదంతా వాళ్ల ఆనందం అనుకొంటానంతే. నా సినిమా వాళ్లకు అంత బాగా నచ్చిందని భావిస్తా. అవన్నీ వాళ్ల దీవెనలు. అంతే తప్ప.. నేను నిజంగా అవతార్‌ లాంటి సినిమా తీశానని అనుకోను.


    ‘బాహుబలి గురించి ఒక్క మాటలో చెప్పాలంటే రాజ్యం కోసం ఇద్దరు అన్నాదమ్ముల మధ్య జరిగే పోరాటమే బాహుబలి' . ఈ చిత్రంలో ప్రభాస్‌, అనుష్క, తమన్నా ప్రధాన పాత్రధారులు. రానా ముఖ్య భూమిక పోషిస్తున్నారు. ఆర్కా మీడియా పతాకంపై శోభు యార్లగడ్డ, ప్రసాద్‌ దేవినేని నిర్మిస్తున్నారు. కె.రాఘవేంద్రరావు సమర్పకులు.

    పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమా త్వరలోనే సెన్సార్ కి వెళ్లనుంది. ఆర్కా మీడియా నిర్మించిన ఈ భారీ బడ్జెట్ మూవీకి ఎంఎం కీరవాణి సంగీతం అందించాడు. ఒకేసారి తెలుగు, తమిళ, హిందీ, మలయాళ భాషల్లో రిలీజ్ కానున్న ఈ పీరియాడికల్ ఫిల్మ్ పై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి.

    English summary
    SS Rajamouli’s Baahubali is one of the most awaited films of 2015. This movie is hitting the headlines ever since the shooting was started.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X