twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    టీచర్స్‌డే స్పెషల్: ఎన్టీఆర్ టు చిరంజీవి (ఫోటో ఫీచర్)

    By Bojja Kumar
    |

    హైదరాబాద్ : సిని ప్రపంచంలో గురు, శిష్యులు అనే సంప్రదాయానికి చాలా విలువ ఉంది. సినిమా రంగంలోని ఆయా డిపార్టుమెంట్లలోకి ఎంటరైన వారు ఎవరో ఒకరి వద్ద శిష్యుడిగా జాయిన్ అయ్యి... గురువుని మించిన లేక గురువుతో పోటిగానే సినిమాలు తీస్తూంటారు. అలాగే ఈ గురు -శిష్య పవిత్రబంధం నేపథ్యంతో సాగిన ఏ సినిమాను అయినా అన్నిరకాల ప్రేక్షక వర్గాలు ఆదరించాయి. ఆదరిస్తాయి కూడా.

    పవిత్రమైన గురుశిష్యుల బంధాన్ని ఆవిష్కరించే దిశగా ఎన్నో సినిమాలు వివిధ భాషల్లో వచ్చాయి. సినిమా అంతా గురుశిష్యుల బంధం మీదే నడవకపోయినా గురువు పాత్రలోనో, శిష్యుల పాత్రలోనో హీరోహీరోయిన్లు కనిపించి ఆ పాత్రల ఔచిత్యాన్ని ప్రేక్షకులకు తెలియజేయడం జరుగుతుంది.

    అల్లరిచిల్లరిగా తిరిగే ఆకతాయి విద్యార్థులను లక్ష్యంవైపు నడిపించే పాత్రల్లో సీనియర్‌ తారాగణం అద్భుత నటనను కనబరిచి ప్రేక్షకుల గుండెల్లో గురువులకు నిదర్శనంగా నిలిచిపోయింది. గురువు పాత్రలకు హీరోలే కాదు క్యారెక్టర్‌ ఆర్టిస్టులుగా పేరొందిన అనేకమంది నటీనటులతో పాటు హాస్యపాత్రలను పోషించే నటులు కూడా ప్రాణం పోసేవారు.

    కాంతారావు, గుమ్మడి, మిక్కిలినేని వంటి సీనియర్‌ నటులతో పాటు అల్లు రామలింగయ్య, సూర్యకాంతం వంటివారు సైతం గురువు పాత్రలు చేసి శభాష్‌ అనిపించుకున్నవారే. ఎన్టీఆర్‌, ఎఎన్‌ఆర్‌, కృష్ణ, శోభన్‌బాబు, కృష్టంరాజు వంటి అలనాటి అగ్రహీరోలందరూ గురువు పాత్రల్లో నటించి మెప్పించినవారే. అగ్రహీరోలు గురువు పాత్రలు వేస్తే హీరోయిన్లు శిష్యపాత్రలు వేయడం కామన్‌గా కనిపించేది.

    ఏన్నో ఏళ్లుగా టాలీవుడ్ వెండితెరపై గురుశిష్యుల బంధాన్ని ఎంతో భావోద్వేగంగా చిత్రీకరిస్తోంది. ఏది నేర్చుకోవాలన్నా గురువు తప్పనిసరి. అలాంటి గురువు కొన్నికొన్ని విషయాల్లో కఠినంగా వ్యవహరించొచ్చు కానీ అందరి జీవితాలను స్పృశిస్తారు. అందుకే తల్లిదండ్రుల తర్వాతి స్థానం గురువుకే దక్కింది. అలాంటి గురువులపై అభిమానాన్ని చాటుకునేందుకు శిష్యులు తహతహలాడుతుంటారు. గురువు ద్రోణాచార్యుడి మీద అభిమానం కొద్దీ ఏకలవ్యుడు ఏకంగా తన బొటనవేలినే గురుదక్షిణగా ఇచ్చి తన ప్రేమాభిమానాల్ని చాటుకున్న విషయం ఈ సందర్భంగా ప్రస్తావనార్హం. నేడు ఉపాధ్యాయుల దినోత్సవం సందర్భంగా తెలుగులో గురుశిష్యులు ఇతివృత్తంగా వచ్చిన సినిమాల్ని పరిశీలిద్దాం..

    బడి పంతులు

    బడి పంతులు


    ఎన్టీఆర్‌ నటించిన 'బడిపంతులు' మంచి విజయాన్ని సాధించింది. ఆయన హీరోగా వెలుగొందుతున్న తరుణంలో 'బడిపంతులు' సినిమాను ఒప్పుకోవడమంటే చిన్న విషయం కాదు. ఏ హీరో అయినా యువ గురువు పాత్ర చేయడానికి సై అంటారు కానీ వృద్ధ బడిపంతులు పాత్ర చేయడానికి సై అన్న ఎన్టీఆర్‌ నిజంగా గ్రేట్‌. ఎందుకంటే ఆయన దృష్టిలో నటుడంటే ఏ పాత్రనైనా చేసి మెప్పించగలగాలి. ఆయన గట్స్‌కి అభినందనలు చెప్పాలి. వాటిని అధిగమించలేని తరుణంలో శిష్యులు ఆయనకు అందించే తోడ్పాటును ఈ చిత్రంలో హృద్యంగా చిత్రీకరించారు. 'భారతమాతకు జేజేలు..' అన్న పాట ఈ నాటికీ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో వినిపించడం 'బడిపంతులు' చిత్రాన్ని అజరామంగా నిలిపింది.

    విశ్వరూపం

    విశ్వరూపం


    ఎన్టీఆర్‌ నటించిన మరో చిత్రం 'విశ్వరూపం' కూడా గురుశిష్యుల బంధాన్ని మరింత బలంగా ఆవిష్కరించింది. ఈ సినిమాలో విద్యార్థులకు ప్రాణమైన మాష్టారిని విలన్లు పొట్టన పెట్టుకుంటే వారి ఆట కట్టించడానికి మరో రౌడీ ఎన్టీఆర్‌ని విద్యార్థులు తీసుకువస్తారు. కానీ ఎన్టీఆర్‌ ఆత్మ రౌడీ పాత్రలో ప్రవేశించి సినిమా అంతా ఆసక్తికరంగా నడిపిస్తుంది. 'నూటికో కోటికో ఒక్కరు... ఎప్పుడో ఎక్కడో పుడతారు. మాదేవుడు మీరే మాష్టారు' అనే పాట ఇప్పటికీ రోమాంచితం చేస్తుంది.

    అగ్గిరాజు

    అగ్గిరాజు


    గురువు పాత్రలో నటించే మరో సిన్సియర్‌ నటుడు కృష్టంరాజు. ఈయన సినిమాల్లో కూడా గురుశిష్యుల బంధమే ఎక్కువగా కనిపించేది. జులాయిలా తిరిగే విద్యార్థులను సరైన దారిలో పెట్టే పాత్రలో కృష్టంరాజు 'అగ్గిరాజు' సినిమాలో మంచి మార్కులు కొట్టేశాడు. గురువు పాత్రలో సైతం 'రెబల్‌స్టార్‌'గా కృష్టంరాజు చాలా సీరియస్‌గా నటించాడు.

    మాస్టర్

    మాస్టర్


    చిరంజీవి 'మాష్టర్‌' సినిమా ద్వారా చాలా పవర్‌ఫుల్‌ పాత్రతో ఆకట్టుకున్నాడు. 'మాస్టారూ... మాస్టారూ.. మాంచి లెక్చరు ఇచ్చారు' అనే పాటను స్వయంగా పాడి ప్రేక్షకులను ఆకట్టకున్నారు. స్టూడెంట్‌ పాత్రధారి అయిన సాక్షి శివానంద్‌ మాస్టారిని ప్రేమలోకి దించే సన్నివేశాలు ఈనాటి ట్రెండ్‌కి తగ్గట్లుగా వున్నాయి. అయినప్పటికీ చిరంజీవి హుందాతనం మాస్టారి పాత్రను బాగా ఎలివేట్‌ చేసింది. అల్లరి మూకల స్టూడెంట్‌ నాయకులను ఉత్తమ విద్యార్థులుగా తీర్చిదిద్దడంలో మాస్టర్‌ పాత్ర ఆద్యంతం అలరించింది.

    సుందర కాండ

    సుందర కాండ


    వెంకటేష్‌ కూడా తన కెరీర్‌ స్పీడ్‌ అందుకుంటున్న సమయంలోనే 'సుందరకాండ' సినిమాలో లెక్చరర్‌ పాత్ర ధరించి మంచి మార్కులే కొట్టేశాడు. స్టూడెంట్‌ ప్రేమను తప్పని చెబుతూనే ఆమెకు జబ్బని తెలిసి విలపించే మాస్టర్‌ పాత్ర ప్రేక్షకుల్ని కంట తడి పెట్టిస్తుంది. మాస్టర్‌, సుందరకాండ చిత్రాల్లో హీరోపాత్రలకు ముందే పెళ్లి జరిగిపోవడం పాత్రల ఔన్నత్యాన్ని పెంచాయి. అయితే ఈ సినిమాలో ఒకానొక దశలో తమ గురువుగారైన మూలశంక మా ష్టారికి దండేసి దండం పెట్టేస్తాయి స్టూడెంట్‌ వర్గాలు. పాపం తాను చావకుండానే పాడె కట్టేసిన స్టూడెంట్లను చూసి తల్లడిల్లి పోతాడు పాపం గురువుగారు.

    ప్రతి ఘటన

    ప్రతి ఘటన


    'ప్రతిఘటన' సినిమాలో విద్యార్థులు కొందరు నగ్న చిత్రం బోర్డుపై వేస్తే దానిపై విజయశాంతి వేటూరి వారి పాటతో వారిలో సిగ్గును, జ్ఞానాన్ని కలిగిస్తుంది. అలాంటి సన్నివేశాలు మచ్చుకైనా కనిపించని నేటి సినిమాల్లో సుమన్‌శెట్టి ఎంతో ఆశగా షకీలా టీచర్‌ వైపు చూడడం 'జయం' సినిమాలో కుర్రకారుని పిచ్చెక్కించింది. ఇలాంటి సినిమాలు చూసి విద్యార్థులు అలా చేస్తున్నారని జనాలు మండిపడుతుంటే ..... బయట జరుగుతున్న వాటినే సినిమాల్లో పెడుతున్నామని సినీరంగ ప్రముఖులు చెబుతున్నారు. నేడు నిజజీవితంలో కీచకుల్లా మారిపోతున్న గురువులున్నారు. కామ, ప్రేమావేశాలతో ఎంతకైనా తెగిస్తున్న విద్యార్థులూ కనిపిస్తున్నారు. రాను రాను గురుశిష్యుల బంధం సినిమాల్లో మాదిరి ఒరే... ఒరే... అనుకునే స్థాయికి దిగజారిపోతుంది.

    రేపటి పౌరులు

    రేపటి పౌరులు


    స్వర్గీయ టి.కృష్ణ దర్శకత్వం వహించిన ‘రేపటి పౌరులు' చిత్రంలో విజయశాంతి సామాజిక స్పృహ ఉన్న టీచర్‌గా చాలా చక్కగా నటిం చారు. అయితే ఇలాంటి సినిమాలు మరిన్ని రావాల్సిన అవసరం ఎంతైనా వుంది. గురువు ను వెండితెరపై బంగారు కొండగా చూపించాల్సిన అవసరం ఉంది. అంతేకానీ అర్ధం పర మార్థం లేని, గురుస్థాయిని దిగజార్చే సినిమా లు ఇకముందైనా మానుకుంటేనే మాస్టారి ప్రతిభ వెండితెరపై కూడా విరాజిల్లుతుంది.

    ఓనమాలు

    ఓనమాలు


    ఇటీవల రాజేంద్రప్రసాద్‌ హీరోగా వచ్చిన ‘ఓనమాలు' చిత్రం కూడా గురువుగా గురుతర బాధ్యతలను బోధిస్తుం ది. నారాయణరావు (రాజేంద్రప్రసాద్‌) ఓ గ్రామంలో ఉపాధ్యాయుడు. పదవీవిరమణ తరవాత అమెరికాలోని కొడుకు దగ్గరకు వెళ్లిపోతాడు. ఆ దేశంలో ఉన్నా సొంత వూరుపైనే ఎప్పుడూ ధ్యాస. పదేళ్ల తరవాత తన వూరుకి వస్తాడు నారాయణరావు మాస్టారు. అక్కడి పరిస్థితులను చూసి తల్లడిల్లిపోయి గురువుగా మార్పు కోసం తన వంతు బాధ్యత నిర్వహిస్తాడు.

    English summary
    Teaching is considered as the noble profession in Indian customs and teachers are always held high in Hinduism. In the holy scriptures, teacher has been described as - Guru Brahma Gurur Vishnu, Guru Devo Maheshwaraha, Guru Saakshat Para Brahma, Tasmai Sree Gurave Namaha (Teacher is verily the representative of Brahma, Vishnu and Shiva. He creates, sustains knowledge and destroys the weeds of ignorance. I salute such a Guru.)
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X