twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    అమీ తుమీ మూవీ రివ్యూ: పస లేని కథ.. బలహీనమైన కథనం..

    కుటుంబ సమేతంగా చూడదగిన కథ, హాస్యాన్ని కలగలిపి సినిమాలను అందించే మోహనకృష్ణ తాజాగా అమీ తుమీ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. స్క్రూబాల్ కామెడీ అంశంగా చేసుకొని ఈ చిత్రాన్ని రూపొందించినట్టు ఆయన వెల్ల

    By Rajababu
    |

    Rating:
    2.0/5
    Star Cast: అడవి శేషు, అవసరాల శ్రీనివాస్, ఇషా రెబ్బా, తనికెళ్ల భరణి, వెన్నెల కిషోర్
    Director: ఇంద్రగంటి మోహన కృష్ణ

    టాలీవుడ్‌లో చక్కటి అభిరుచి ఉన్న దర్శకుల్లో ఇంద్రగంటి మోహనకృష్ణ ఒకరు. గ్రహణం సినిమాతో మొదలైన సినీ ప్రయాణంలో అష్ఠాచెమ్మా, అంతకు ముందు ఆ తర్వాత, జెంటిల్మన్ చిత్రాలు ఘన విజయం సాధించాయి. కుటుంబ సమేతంగా చూడదగిన కథ, హాస్యాన్ని కలగలిపి సినిమాలను అందించే మోహనకృష్ణ తాజాగా అమీ తుమీ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. స్క్రూబాల్ కామెడీ అంశంగా చేసుకొని ఈ చిత్రాన్ని రూపొందించినట్టు ఆయన వెల్లడించారు. అష్ఠాచెమ్మా లాంటి సున్నితమైన హాస్యంతో తెరకెక్కిన ఈ చిత్రం జూన్ 9వ తేదీన థియేటర్లలోకి వచ్చింది. అవసరాల శ్రీనివాస్, అడివి శేషు, ఇషా రెబ్బా, అదితి జంటగా రూపొందిన ఈ చిత్రంలో ప్రేక్షకులను ఆకట్టుకొనే అంశాలేమిటో తెలుసుకొనే ముందు కథ గురించి తెలుసుకొందాం.

    కథ ఇదీ..

    కథ ఇదీ..

    డబ్బు పిచ్చి బాగా ఉన్న జనార్ధన్ రావు సంతానం దీపిక ( ఇషా రెబ్బా), విజయ్ (అవసరాల శ్రీనివాస్). జనార్ధన్ రావుకు ఒకప్పటి తన వ్యాపార భాగస్వామి గంగాధర్ అంటే గిట్టదు. జనార్ధన్ రావు కూతురు దీపిక అనంత్‌ అనే సేల్స్ మేనేజర్‌ను ప్రేమిస్తుంది. కానీ జనార్ధన్ రావుకు ఇష్టముండదు. అలాగే జనార్ధన్ రావు కుమారుడు విజయ్ గంగాధర్ కూతురు మాయ (అదితి మైక్యాల్)ను ప్రేమిస్తాడు. ఇలా రెండు ప్రేమ జంటలకు తండ్రులు ఆమోదం ఉండదు. ఎలాగైనా తమ ప్రేమను గెలిపించుకోవాలనుకొంటుండగా వైజాగ్ చెందిన శ్రీ చిలిపి ( వెన్నెల కిషోర్) వీరి కథలోకి ప్రవేశిస్తాడు. శ్రీ చిలిపితో జనార్ధన్ రావు తన కూతురి పెళ్లిచూపులను ఏర్పాటు చేస్తాడు. శ్రీ చిలిపిది విచిత్రమైన సమస్య. తమ వంశంలో పెళ్లి కూతురును ఫోటో చూడకుండా పెళ్లి చూపులకు వెళ్లడం ఆచారం.

    చిక్కులు.. మెలికలకు సమాధానం ఇలా..

    చిక్కులు.. మెలికలకు సమాధానం ఇలా..

    అలా చిత్రమైన పరిస్థితుల్లో పెళ్లి చూపులకొచ్చిన శ్రీ చిలిపి దీపికను పెళ్లి చేసేకొంటాడా? విజయ్, దీపిక ప్రేమ వ్యవహారం, విజయ్, మాయల అఫైర్ ఎలా సుఖాంతమైంది. వారి తండ్రులు ఏలా వారికి ఆశీస్సులు అందజేశారు. ఈ కథలో జనార్ధన్ రావు ఇంట్లో పనిమనిషి కుమారి (శ్యామల) పాత్ర ఏంటి? పెళ్లి చూపులకు వచ్చిన శ్రీ చిలిపి కుమారిని ఎందుకు ఇష్ణపడాల్సి వచ్చింది. వారి మధ్య జరిగిన సరదా ప్రేమ సన్నివేశాలు ఎలా ఉన్నాయి? అనే ప్రశ్నలకు సమాధానమే అమీ తుమీ చిత్ర కథ.

    చిత్ర తొలిభాగం..

    చిత్ర తొలిభాగం..

    పాత్రల పరిచయం, పాత్ర స్వభావం, ఇతర కథా కమామీషుతో కాలం గడిచిపోతుంది. చాలా రొటీన్‌గా సాగిపోతున్న ఈ కథలో శ్రీ చిలిపి పాత్ర ప్రవేశించిన తర్వాత ఓ జర్క్ వస్తుంది. సాదాసీదాసినిమా సినిమా చూస్తున్నామన్న ప్రేక్షకుడికి కాస్త జోష్ వస్తుంది. శ్రీ చిలిపిగా వెన్నెల కిషోర్ సినిమాకు వెన్నముకగా మారడంతో ఇంటర్వెల్ వరకు కొంచెం ఆసక్తి కలుగుతుంది. తొలిభాగంలో పనిమనిషి కుమారి, శ్రీ చిలిపి మధ్య సీన్లు, శ్రీ చిలిపి, జనార్ధన్ రావు మధ్య వచ్చే సన్నివేశాలు, డైలాగులు, పంచ్‌లు వినోదాన్ని అందిస్తాయి.

    రెండో భాగంలో

    రెండో భాగంలో

    ఇక రెండో భాగంలో ఇషా రెబ్బా, అడివి శేషు, అవసరాల శ్రీనివాస్, మాయ, వెన్నెల కిషోర్, శ్యామల ఇలా మూడు జంటల మధ్య ప్రేమ వ్యవహారం దర్శకుడు ఎలా క్లైమాక్స్‌ వరకు తీసుకెళ్లాడనేది ప్రధాన అంశం. ద్వితీయార్థంలో కూడా కామెడీకి వెన్నెల కిషోర్‌, తనికెళ్ల భరణినే నమ్ముకొన్నాడు. కాకపోతే వారి మధ్య వచ్చే సీన్లలో సత్తా లేకపోవడం, మొదటి నుంచి చివరి వరకు ఓకే తరహాలో డైలాగ్స్, తెర మీద ఇప్పటికే వందలసార్లు చూసిన సీన్లు మళ్లీ ఈ సినిమాలో రిపీట్ కావడంతో సినిమా ఆసక్తికరంగా అనిపించదు. దర్శకుడు ఇంద్రగంటి సినిమాలను చూస్తే ఆరోగ్యకరమైన కత, దాని చుట్టూ హాస్యం, బలమైన సన్నివేశాలు అల్లుపోయినట్టు కనిపిస్తాయి. ఇంద్రగంటి చిత్రాల చాయలు, ఆయన మార్కు టేకింగ్ అమీ తుమీలో ఎక్కడా కనిపించకపోవడం ప్రధాన లోపం.

    దర్శకుడిగా ఇంద్రగంటి..

    దర్శకుడిగా ఇంద్రగంటి..

    అమీ తుమీ కోసం చాలా రొటీన్ కథను ఎంచుకొన్న దర్శకుడు ఇంద్రగంటి బలమైన సన్నివేశాలను రాసుకోకపోవడం ప్రధాన లోపంగా కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది. పాత్రలు, పాత్రధారులు ఎంపిక ఈ చిత్రానికి మరో మైనస్. పాత్రల చిత్రీకరణ చాలా పేలవంగా కనిపిస్తుంది. దర్శకుడి ప్రతిభ గురించి చెప్పుకోవాల్సి వస్తే అదీ వెన్నెల కిషోర్ ట్రాక్ మాత్రమే. అది తప్ప ప్రేక్షకుడిని అలరించే అంశాలు మచ్చుకు కనిపించవు. ఒక సీరియస్ అంశాన్ని హాస్యంగా మలిచి.. స్క్రూబాల్ కామెడీగా అని చెప్పిన చేసిన ప్రయోగం వికటించిందనే చెప్పవచ్చు. సత్తా ఉన్న దర్శకుడిగా ముద్ర వేసుకొన్న ఇంద్రగంటి ఎలా ట్రాక్ తప్పాడో ఓ పట్టాన అర్థం కాదు. సినిమాను చాలా సులభంగా చుట్టేశాడా అనే భావన కలుగుతుంది. వెన్నెల కిషోర్, తనికెళ్ల భరణి పాత్రలనే నమ్ముకొన్న దర్శకుడు హీరో, హీరోయిన్ల పాత్రలను పెద్దగా పట్టించుకోలేదనిపిస్తుంది.

    వెన్నెల కిషోర్ హ్యాట్సాఫ్

    వెన్నెల కిషోర్ హ్యాట్సాఫ్

    అమీ తుమీ సినిమాకు హీరో వెన్నెల కిషోర్. శ్రీ చిలిపి పాత్ర పండకపోతే సినిమా చాలా దారుణంగా ఉండేదనే కామెంట్ ప్రేక్షకుల్లో వ్యక్తమవుతున్నది. ఈ సినిమా కర్త, కర్మ, క్రియగా వెన్నెల కిషోర్ మారడంతో అమీ తుమీ గురించి మాట్లాడుకునే అవకాశం కలిగింది. తనకు లభించిన శ్రీ చిలిపి పాత్రలో వెన్నెల కిషోర్ నటించాడు అనే కన్నా జీవించాడు చెప్పడం సబబు. తనకు లభించిన పాత్రకు వెన్నెల కిషోర్ వందశాతం న్యాయం చేకూర్చాడని చెప్పవచ్చు.

    తనికెళ్ల భరణి సరదా సరదాగా..

    తనికెళ్ల భరణి సరదా సరదాగా..

    అమీ తుమీలో చెప్పుకోవాల్సిన పాత్ర జనార్దన్‌రావు. ఈ పాత్రను తనికెళ్ల భరణి తనదైన శైలిలో పోషించారు. తెలంగాణ యాసలో పలికిన ఆయన మాటలు ప్రేక్షకులకు గిలిగింతలు పెట్టడం ఖాయం. తన డైలాగ్స్‌లో యాస, ప్రాసతో జనార్ధన్ రావు పాత్రకు ప్రాణం పోశాడు. జనార్దన్‌రావు పాత్రపై దర్శకుడు మరింత దృష్టిపెట్టి ఉంటే తనికెళ్ల భరణికి కెరీర్‌లో చెప్పుకోదగిన పాత్ర అయి ఉండేది.

    పరిమితమైన పాత్రలో హీరో, హీరోయిన్లు...

    పరిమితమైన పాత్రలో హీరో, హీరోయిన్లు...

    ఇషా రెబ్బా, అడివి శేషు, అదితి మైక్యాల్, అవసరాల శ్రీనివాస్ హీరో హీరోయిన్లు అంటే ఓ పట్టాన నమ్మకం కలుగదు. సినిమా ప్రారంభంలో నాసిరకంగా ప్రారంభమైన వారి పరిచయంతోనే ఆ పాత్రల విలువేంటో అర్థమవుతుంది. కేవలం వారంతా సపోర్టింగ్ పాత్రలకే పరిమితం అవ్వడం అమీ తుమీకి మరో లోపం. గుడ్డిలో మెల్ల మాదిరిగా పనిమనిషి పాత్రలో కనిపించిన శ్యామలదేవి మెరుగ్గా కనిపిస్తుంది. తన పాత్రకు శ్యామల పూర్తి న్యాయం చేకూర్చింది.

    అంతంత మాత్రంగా మణిశర్మ సంగీతం

    అంతంత మాత్రంగా మణిశర్మ సంగీతం

    చాలా రోజుల తర్వాత అమీ తుమీలో మణిశర్మ సంగీతం ఓ స్థాయిలో వినిపించింది. రీరికార్డింగ్‌పై పాత ఆంగ్ల సినిమాల ప్రభావం స్పష్టంగా కనిపించింది. సన్నివేశాలు బలంగా లేకపోవడం వల్ల తన ప్రతిభకు మెరుగుపెట్టాల్సిన అవకాశం దక్కలేదనిపిస్తుంది. పాటలు ప్లేసింగ్ చాలా దారుణంగా ఉన్నాయి. పాటలు కూడా అంతగా ఆకట్టుకునేలా లేకపోవడం సినిమాకు మరో మైనస్ పాయింట్. పాటలకు ప్లేస్‌మెంట్ లేని పరిస్థితుల్లో ఓ పాటను ఎండ్ టైటిల్స్‌లో వేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.

     పర్వాలేదనిపించిన విందా

    పర్వాలేదనిపించిన విందా

    గ్రహణం నుంచి అమీ తుమీ వరకు దర్శకుడు ఇంద్రగంటి మోహనక‌‌ృష్ణకు సరైన జోడి సినిమాటోగ్రాఫర్ పీజీ విందా. అంతకు ముందు ఆతర్వాత, జెంటిల్మన్ వీరి కాంబినేషన్ బాగా వర్కవుట్ అయింది. కథ అంతా రెండు ఇళ్లలో సాగడం వల్ల తన పనితీరుతో ప్రేక్షకులకు కొత్త అనుభూతిని కలిగించడానికి కెమెరామెన్ విందాకు ఛాన్స్ దక్కలేదు. సన్నివేశాల్లోనే బలం లేకపోవడం వల్ల తనకు ఉన్న స్కోప్ వరకు పర్వాలేదనిపించాడు. ఎడిటింగ్ బాధ్యతలను నిర్వర్తించిన మార్తాండ్ కే వెంకటేశ్, ఇతర విభాగాల పనితీరు ఓకేలా ఉన్నాయి.

    బలం.. బలహీనతలు

    బలం.. బలహీనతలు

    పాజిటివ్ పాయింట్స్
    వెన్నెల కిషోర్, తనికెళ్ల భరణి కామెడీ
    డైలాగ్స్

    నెగిటివ్ పాయింట్స్
    కథ, కథనం

    తెర ముందు.. తెర వెనుక

    తెర ముందు.. తెర వెనుక

    నటీనటులు: అవసరాల శ్రీనివాస్, అడివి శేషు, వెన్నెల కిషోర్, ఇషా రెబ్బా, అదితి మైకాల్, తనికెళ్ల భరణి, తనికెళ్ల భార్గవ్, శ్యామల
    కథ, దర్శకత్వం: ఇంద్రగంటి మోహన్‌కృష్ణ
    నిర్మాత: కేసీ నర్సింహారావు
    సంగీతం: మణిశర్మ
    సినిమాటోగ్రఫీ: పీజీ విందా
    ఎడిటింగ్: మార్తాండ్ కే వెంకటేశ్
    బ్యానర్: ఏ గ్రీన్ టీ ప్రొడక్షన్
    రిలీజ్ డేట్: జూన్ 9, 2017

    English summary
    Director Mohanakrishna Indraganti's latest movie is Ami Thumi. Adavi Sheshu, Avasarala Srinivas, Isha Rebba, Tanikella Bharani, Venneala Kishore are played lead roles. The movie picturised on the basis of Screwball commedy. But This movie plot not upto the mark for today standards.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X