twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    మ్యూజిక్‌ వికటించిన 'మాధురి'

    By Staff
    |

    Madhuri
    -సౌమిత్‌
    బ్యానర్‌: ఉషాకిరణ్‌ మూవీస్‌
    నటీనటులు: అబ్బాస్‌, అంజన, నాజర్‌, పృధ్వీ, గణేష్‌, చలపతిరావు,
    ఏవీఎస్‌, సంగీత, రాళ్ళపల్లి, డబ్బింగ్‌ జానకి, భరణి, కోవైసరళ తదితరులు.
    మాటలు: పరుచూరి బ్రదర్స్
    సంగీతం: మురళి
    కెమెరా: లోకి
    నిర్మాత: రామోజీరావు
    కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: మౌళి

    పాప్‌సింగర్‌గా పేరు తెచ్చుకోవాలని తాపత్రయపడే ఓ అమ్మాయి కథకి బ్రదర్‌ సెంటిమెంట్‌ని ముడివేసి తీసిన చిత్రం ఇది. జర్మనీలో వాస్తవంగా జరిగిన కథ ఆధారంగా ఈ చిత్రం రూపొందించారట. అన్నీ ఉన్నా అల్లుడి నోట్లో శని అన్నట్లు ఎ టు జడ్‌ కావాల్సినవన్నీ సమకూర్చినా విజయవంతమైన చిత్రంగా మలచడంలో దర్శకుడు మౌళి విఫలం అయ్యారని చెప్పొచ్చు. స్టేజ్‌నుంచి వచ్చిన మనిషి కావడంవల్లో ఏమో కొన్నిచోట్ల స్టేజ్‌ షో చూస్తున్న ఫీలింగ్‌ కలిగింది.

    ప్రత్యేకించి అన్నాచెల్లెళ్ళ మధ్య సీన్స్‌ విషయంలో ఇది ప్రస్ఫుటంగా కన్పించింది. ఈ తరహా చిత్రాలకు మ్యూజిక్‌ ఎప్పుడూ ప్లస్‌ అవుతూ ఉంటుంది. కానీ ఈ చిత్రం విషయంలో అది మైనస్‌ అయింది. కీరవాణి సహాయకునిగా పని చేసిన మురళి తనకు లభించిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవడంలో విఫలం అయ్యాడు. క్యాచీగా ఉండే పాటలు ఏవీ లేవీ చిత్రంలో.

    మాధురి (అంజన) ఓ పాప్‌ సింగర్‌. మాధురి తల్లిదండ్రులు నాజర్‌, అంబిక. ఒక్కతే కూతురు కావడంతో గారాబంగా పెంచుతూ ఉంటారు. సంగీతం పట్ల అభిరుచి ఉన్న నాజర్‌ తన ప్రావీణ్యాన్ని కూతురికి నేర్పించి ఆమె సింగర్‌గా ఎదగాలని కోరుకుంటుంటాడు. సివ్లూలో ప్రదర్శన కోసం వెళుతున్న మాధురికి అబ్బాస్‌ పరిచయం అవడం, ఆ పరిచయం ప్రేమగా మారుతుంది. సివ్లూలో సైట్‌సీయింగ్‌కి వెళ్లిన ఈ బృందం ప్రయాణిస్తున్న బస్సులో టెర్రరిస్ట్‌లు ప్రవేశించగా వార్ని చాకచక్యంగా ఎదుర్కొంటాడు అబ్బాస్‌. ఈ సంఘటనతో మరింత దగ్గరౌతారా జంట. తిరిగివచ్చిన తర్వాత వీరిద్దరి విషయం తెలుసుకున్న నాజర్‌ ముందు వ్యతిరేకించినప్పటికీ తర్వాత పెళ్లికి ఒప్పుకుంటాడు.

    నిశ్చితార్ధం రోజున మాధురి పాడకూడదనే కండిషన్‌తో పెళ్లికి ఒప్పుకుంటానంటాడు అబ్బాస్‌. దాంతో నిర్ఘాంతపోయినా తేరుకుని అందుకు అంగీకరిస్తుంది. అయితే పెళ్ళికి ఇంకా టైం ఉన్నందున మరో ప్రోగ్రాంని ఒప్పుకుంటుంది. ఆ ప్రోగ్రామ్‌ చేస్తూ మధ్యలోనే కుప్పకూలుతుంది. డాక్టర్స్‌ 'ప్రోగ్రాం ఇవ్వొద్దని చెప్పాంగా, ఇస్తే ఇంకా త్వరగా చనిపోతుంది' అని వెల్లడిస్తారు. దాంతో నిజాన్ని చెబుతాడు అబ్బాస్‌. సివ్లూలో టెర్రరిస్ట్‌ల దాడిలో గాయపడ్డప్పుడు పరీక్షించిన వైద్యులు ఆమె కిడ్నీ చెడిపోయిందని వెంటనే కిడ్నీ మార్చకపోతే చనిపోతుందని, అప్పటివరకు ప్రోగ్రాంస్‌ ఇవ్వకూడదనిచెప్పిన సంగతి చెబుతూ అందుకే తాను మాధురి పాడకూడదనే కండిషన్‌ పెట్టినట్లు తెలుపుతాడు.

    తోడబుట్టిన వాళ్ళు ఎవరైనా కిడ్నీదానం చేస్తే ఆమె బ్రతుకుతుందని అంటారు డాక్టర్లు. అప్పుడు మాధురి తాను కన్నబిడ్డ కాదని వైజాగ్‌లో పని చేస్తున్నప్పుడు తర్వాత దత్తత తీసుకున్నామన్న నిజాన్ని బహిరంగపరుస్తూ ఆమెకు ఓ అన్నయ్య కూడా ఉండాలని చెబుతాడు నాజర్‌. దాంతో అతనికోసం వేట మొదలెడ్తారు. ఈ నేపథ్యంలో అతనొక టెర్రరిస్ట్‌గా మారిన నిజం తెల్సుకుని ఇంటికి ఫోన్‌ చేస్తే ఆకాష్‌ని మాధురి రిసీవ్‌ చేసుకుని సివ్లూలో బస్‌లో తారసపడ్డ ఉగ్రవాది తన అన్నే అని గ్రహించి అతన్ని కలుసుకోవడానికి వెళ్లి అతనికి చెల్లెలిపై ఉన్న ప్రేమానురాగాల్ని గ్రహిస్తుంది. పోలీస్‌లు వెంటపడగా అతన్ని ఇంటికి తీసుకుని వచ్చి ఉగ్రవాదం మానుకోమని హెచ్చరించి అతను జీవితంలో స్థిరపడడానికి వీలుగా సహాయం చేస్తానని చెప్పి ఓ కొత్త ఆల్బమ్‌ ఒప్పుకుని డబ్బుని అందిస్తుంది. ఆ ఆల్బమ్‌ పూర్తి చేస్తూ మరోసారి కూలిపోవడంతో హాస్పిటల్‌లో ఆపరేషన్‌కు ఏర్పాట్లు చేస్తారు. ఊరు విడిచి వెళుతున్న మాధురి అన్న చావుబతుకుల మధ్య చెల్లిని రక్షించుకోవడానికి హాస్పిటల్‌కు వచ్చి కిడ్నీని దానం చేసి మరణిస్తాడు. సంక్షిప్తంగా ఇదీ కథ.

    కథాగమనంలో ఎన్నో లొసుగులు ఉన్నాయి. స్క్రీన్‌ప్లేని పకడ్బందీగా రూపొందించలేకపోవడంతో సినిమా పట్టు కోల్పోతుంది. పాప్‌సింగర్‌ మాధురిగా అంజన అభినయం ఫర్వాలేదు. తొలి చిత్రం అయినప్పటికీ ఎటువంటి నదురుబెదురూ లేకుండా చక్కగా నటించింది. అబ్బాస్‌, పృధ్వీ నటన సోసో... గణేష్‌ కామెడీ కొంతవరకు పేలింది. భరణి, కోవై సరళ మధ్య సన్నివేశాలు కూడా ఫర్వాలేదు. సంభాషణల్లో అంతగా బలం లేదు. పరుచూరి బ్రదర్స్‌ చాలా పేలవంగా రాశారు. మాధురిపై చిత్రీకరించిన పాటలు ఓ పాప్‌సింగర్‌పై చిత్రీకరించినట్లు లేవు. క్లబ్‌ సాంగ్స్‌గా తీసినట్లున్నాయి. పాప్‌సింగర్‌ అంటే థియేటర్స్‌లో చూస్తున్న ప్రేక్షకులు కూడా ఉత్కంఠభరితులు కావాలి. అప్పుడే ఆ పాటలు రక్తికడతాయి. చివర్లో మాధురి చావు బ్రతుకుల మధ్య పోరాటం చేస్తున్నప్పుడు ఓ 50 మందితో 'వుయ్‌ వాంట్‌ మాధురి' అనిపించడం, ఏవీఎస్‌ స్పీచ్‌ మొదలైనవన్నీ కృత్రిమత్వానికి పరాకాష్టగా మారి ప్రేక్షకుల సహనానికి పరీక్ష పెడ్తాయి. ఏతావాతా నిర్మాత రామోజీరావు ఖాతాలో మరో పరాజయంగా ఈ చిత్రాన్ని పేర్కొనవచ్చు. ఆయన కనుక వెంటనే తన స్టోరీ డిపార్ట్‌మెంట్‌ని ప్రక్షాళన చేయకపోతే నిర్మించుకున్న ఆశా స్వప్నాలన్నీ కూలిపోవడం ఖాయం.

     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X