twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ప్రేమగా ‘ప్రేమ (మ్)’ కురుస్తోంది...!

    By Lakshmisurya
    |

    ప్రతి సీజన్లో వేసవి తాపాన్ని చలార్చుతూ ఋతుపవనాలు వస్తాయి. కానీ రొటీన్ రెగ్యులర్ సినిమాల తాకిడి మధ్య ప్రాణమున్న సినిమాలు ఎపుడో ఒకసారే వస్తాయి.

    భావాల్ని కదిలిస్తాయి ..
    ఉద్వేగాలను తట్టి లేపుతాయి ..
    వయసును వెనక్కి తీసుకొస్తాయి ..
    మనసుని హత్తుకుంటాయి ..
    ప్రేమను పెకిలిస్తాయి ..
    ప్రేమగా మారతాయి ..
    ప్రేమమ్ లు అవుతాయి.

    కేరళలో కలెక్షన్ల వర్షం కురిపిస్తున్న "ప్రేమమ్" పై ప్రత్యేక కథనం..

    ప్రేమమ్ (ప్రేమ) .. ఇప్పుడు కేరళ చిత్రసీమను మలయసమీరంలా చుట్టేసి కలెక్షన్ల వర్షాన్ని కురిపిస్తున్న సినిమా. ఇప్పట్లో ఆ వర్షం ఆగేలా కనిపించటం లేదు. మే 29 న విడుదలయిన ప్రేమమ్ ఒక్క కేరళ లోనే 20 కోట్లు పైగా వసూలు చేసింది. ఈ సినిమాలో మలయాళ సీమలోని స్టార్లు మమ్ముట్టి , మోహన్ లాల్ లాంటి వారు ఎవరూ లేరు కానీ మనసును మెస్మరైజ్ చేసే మ్యాజిక్ ఉంది.

    అంతలా ఏముంది ప్రేమమ్ లో ....

    Premam Movie Review: Entertainment, Entertainment & Entertainment

    జార్జ్ అనే కుర్రాడు టీనేజ్ లో, కాలేజ్ లో , సెటిలేజ్ లో ముగ్గురు అమ్మాయిలను ప్రేమిస్తాడు. వారి ప్రేమను సాధించుకోవటం లో ఊహించని అడ్డంకులు ఎదురై ,కలలు కరిగిపోయి ప్రేమించిన వారు మరొకరితో సెటిల్ అవ్వతుంటే తట్టుకోలేక గుండె పగిలేలా.. ఆగండాగండి ..ఎక్కడో ..ఎపుడో ..ఏవో గుర్తుకొస్తున్నాయి అంటారా.!
    ఆ అవును...మీకు ఆ మధ్య రవితేజ చేసిన నా ఆటోగ్రాఫ్ ..స్వీట్ మెమరీస్ గుర్తురావటం లో తప్పేం లేదు..గుర్తు రాకపోతేనే తప్పు.

    కానీ ఇక్కడ ఆ సారూప్యత కేవలం కధకు తీసుకున్న పాయింట్ వరకే , కారణం .. ప్రేమమ్ లో ఉన్న ఫ్లేవర్, ఫ్రెష్ నెస్ గడ్డిపరకల్ని అంటుకున్న మంచు బిందువుల్లా మనసుని తాకి గతంలో వదిలేసిన జ్ఞాపకాలను తట్టి లేపుతాయి. సినిమా నడకలో పదే పదే కనిపించే సీతాకోకచిలుకలు మనసుని కుదురుగా ఉండన్నివ్వవు. టీనేజ్ ఎపిసోడ్ లో తాను ప్రేమించిన మేరీ మరొకరిని ప్రేమిస్తుందని చెప్పి తన ప్రేమకు సాయం చేయమని అడిగినపుడు అమాయకంగా నిజాయితీగా ఒప్పుకుని సాయం చేసే జార్జ్ ప్రేమలోని స్వచ్ఛత కి మనకు తెలియకుండానే ప్రేమమ్ లో లీనమైపోయి ‘చదువుకునేపుడు వెంట తిప్పుకుని ఎవడో వెంగళప్పకి పడిపోయిన సుజాత నో మనం చూసినపుడల్లా పళ్ళికిలించి పలకరించి బావని పెళ్లి చేసుకున్న పక్కింటి పావని నో గుర్తు తెచ్చుకుంటాం .కాలేజ్ లో ప్రేమించిన గెస్ట్ లెక్చరర్ మలర్ యాక్సిడెంట్ లో గతాన్ని మరిచిపోయినపుడు గుండె పగిలేలా రోదించే జార్జ్ ని చూసి ఏడ్చేస్తాం , ఎందుకంటే అప్పటికే మనం జార్జ్ అయిపోతాం.

    ప్రేమమ్ కు జార్జ్ గా నివిన్ పోలి ప్రాణం పోస్తే మేరీ, మలర్, సెలిన్ లు గా కనిపించిన.. సారీ జీవించిన ముగ్గురు కొత్త అమ్మాయిలు జీవం నింపారు. చూస్తుంటే ఎప్పుడో తెలిసిన ఎక్కడో పరిచయమున్న వారిలా అనిపించే అనుపమ శ్రీనివాసన్, సాయిపల్లవి, మడోన్నా సెబాస్టియన్ లు మొదటి సినిమాతోనే కేరళ అబ్బాయిల గుండెల్లో సెటిలయిపోయారు.ఇపుడు వాళ్ళు బయటకు వెళ్తుంటే వాళ్ళని అసలు పేర్లతో కాకుండా సినిమా పేర్లతోనే వారిని పిలుస్తున్నారంటేనే అర్ధం అవుతుంది ప్రేమమ్ లో వాళ్ళెంత ప్రేమగా నటించారో..

    ప్రాణమున్న సినిమాకు భాషతో పని లేదు , అందులో ప్రేమకు అసలు అవసరం లేదు ,ఎందుకంటే ప్రేమ ఏ భాషలో అయినా ప్రేమే..! భావం మనసును అనుభవించేలా చేస్తుంది. ప్రేమమ్ విషయం లో అదే జరిగింది. మనకు భాష తెలియక పోయినా దర్శకుడు అల్ఫోన్సో పుత్తరేన్ చూపించిన సన్నివేశాలు చూస్తుంటే తప్పిపోయిన నోస్టాల్జియా తిరిగొచ్చి తియ్యని జ్ఞాపకంగా పలకరిస్తుంది. పాటలు అర్ధం కాకపోయినా సంగీతం గుండెని హమ్ చేయిస్తుంది. ‘ఆళువా పుడయిడ తీరత్తు ఆరోరమిల్లా నేరత్తు ..అళగే.. అళగిళ్ తీత్తోరు శిల అళగే .. మలరే ఎన్నుయిరిల్ విడరుం పనిమలరే ‘.. అంటూ బాష రాకపోయినా రాజేష్ మురుగేశన్ అందించిన మ్యూజిక్ మనతో రాగాలు తీయిస్తుంది.సినిమాటోగ్రాఫర్ ఆనంద్ సి చంద్రన్ ఎక్స్ ట్రీం క్లోజప్ షాట్స్ పనితనం సినిమా నుండి బయటకి వచ్చాక కూడా సినిమాని కళ్ళముందు నుండి పోనివ్వదు. మొత్తంగా ఈ కొత్త తరం చూపించిన ప్రతిభ ప్రేమమ్ ను టాక్ ఆఫ్ ది సౌత్ ఇండియన్ సినిమా గా నిలిపింది.

    అలుపు లేకుండా తేనె కోసం వెతికే సీతాకోక చిలుకల్లా మనిషి ప్రేమ కోసం అన్వేషిస్తూనే ఉంటాడు. కొన్ని సార్లు ఫెయిల్ అయినా ఎక్కడో ఒకచోట సక్సెస్ అయ్యి సెటిలవుతాడు. స్థూలంగా చెప్పాలంటే ప్రేమమ్ సినిమా సారాంశం ఇదే .. ఈ ప్రేమను మీరూ ఫీల్ అవ్వాలనుకుంటే ఈరోజే దగ్గరలో ఉన్న మల్టీప్లెక్స్ కు వెళ్ళండి ..ఒకవేళ ఆల్రెడీ ప్రేమిస్తుంటే వాళ్ళని కూడా వెంట తీసుకెళ్ళండి.. సినిమాలో ఉన్న భావం భాష తో సంబంధం లేకుండా కనెక్ట్ చేస్తుంది. ఒంటరిగా అయినా వెళ్ళండి ,పర్లేదు.. సినిమాలో ముగ్గురు అమ్మాయిలు ఉన్నారు .. తప్పకుండా ప్రేమలో పడతారు.

    ఒకప్పడు మలయాళ సినిమా అంటే సెక్స్ సినిమా అనే అభిప్రాయాన్ని చెరిపేసేలాఆ మధ్య వచ్చిన దృశ్యం , బెంగుళూరు డేస్ లాంటి సినిమాలు తరువాత వచ్చిన ఈ ప్రేమమ్ మారిన మలయాళ సినిమాని కళ్ళ ముందు నిలిపింది. 31 వ వడిలో ఉన్న ఒక యువకుడి 30 ఏళ్ళ జీవితంలోని ప్రేమానుభూతులను సమాహారంగా వచ్చిన ఈ చిత్రం త్వరలో తెలుగులో రీమేక్ కాబోతుందనే వార్తలు వినిపిస్తున్నాయి. అదే కనుక జరిగితే ఈ ప్రేమ సమీరం స్వంత భాషలో తెలుగు నేలను తాకి లబ్ డబ్... లవ్... లవ్ .. అని కొట్టుకునేలా చేస్తుందని ప్రేమగా ఆశిద్దాం.

    లక్ష్మీ S కుకునూర్

    English summary
    Premam is a romantic comedy directed by Alphonse Puthren, with Nivin Pauly in the central role. Debutantes Anupama Parameshwaran, Sai Pallavi and Madonna essyas the female leads in the movie. Premam is produced by filmmaker Anwar Rasheed, under the banner Anwar Rasheed Entertainments.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X