»   » ఒంగోలు గి(చె)త్త (రివ్యూ)

ఒంగోలు గి(చె)త్త (రివ్యూ)

Posted by:

-సూర్య ప్రకాష్ జోశ్యుల

Rating:
1.5/5
మాస్ ఎలిమెంట్స్ ఉన్న యాక్షన్ చిత్రాలంటే పెద్ద హీరోలు డేట్స్ వెంటనే దొరుకుతాయి... బిజినెస్ కి లోటు ఉండదు.... వాటికే ఆదరణ ఎక్కువ... క్లాస్ చిత్రాల్లా కష్టపడి స్క్రిప్టు రెడీ చెయ్యక్కర్లేదు... ఫైట్స్, పాటలు ఉండేలా రివేంజ్ ఫార్ములా కథ రాసుకుంటే సరిపోతుంది.. ఇలాంటివన్నీ ఇండస్ట్రీలో అందరూ చెప్పుకునేవి.. చాలా శాతం నిజం కూడా... అందుకేనేమో... బొమ్మరిల్లు చిత్రంతో తనకంటూ ప్రత్యేక ముద్రవేసుకున్న భాస్కర్... ఆరంజ్ డిజాస్టర్ తర్వాత రెండేళ్ళు గ్యాప్ తీసుకుని తనను తాను మార్చుకుని మాస్ ఎంటర్టైనర్ తో హిట్ కొడదామని ఒంగోలు గిత్తతో వచ్చాడు. అయితే కథ మరీ పురాతనకాలం నాటిది కావటం.. దానికి తగ్గట్లే ట్రీట్ మెంట్ కూడా డల్ గా సాగటం, ట్రెండ్ ని పట్టుకోలేకపోవటం వంటి సమస్యలతో పట్టుజారిపోయింది. దాంతో సహనంతో చివరి దాకా చూసే ప్రేక్షకులను ఓ రేంజిలో ఒంగోలు గిత్త కుమ్మేసింది.

దొరబాబు అలియాస్ వైట్(రామ్) చిన్నప్పుడే ఎక్కడినుంచో పారిపోయి వచ్చి ఒంగోలు మార్కెట్ యార్డ్ కి చేరతాడు. అతని మొండితనం, ధైర్యంతో ఆ మార్కెట్ యార్డ్ లో హీరోలా ఎదిగి, సెటిలవుతాడు. ఆ మార్కెట్ యార్డ్ కి ఛైర్మన్ ఆదికేశవ (ప్రకాష్ రాజ్). ప్రపంచం ఎదురుగా.. పెద్దమనిషిగా, మంచి వ్యక్తిగా నటించే ఆదికేశవ... నిజానికి ఓ పెద్ద విలన్. ఆది కేశవులు కూతురు సంధ్య(కృతి కర్భంధ)తో వైట్ ప్రేమలో పడి... దాన్ని తన తెలివి తేటలతో పెళ్లి దాకా తెచ్చుకుంటాడు. ఈ లోగా లోకల్ ఎమ్మల్యే (ఆహుతి ప్రసాద్) ఆ మార్కెట్ యార్డ్ ని వేరే వారితో చేతులు కలిపి షిప్ట్ చేయాలనుకుంటాడు. అందుకు సహకరించటానికి ఆదికేశవ ఒఫ్పుకుంటాడు. ఆ విషయం తెలుసుకున్న వైట్ ఎలా రియాక్ట్ అయ్యాడు. అసలు చిన్నప్పుడే ఆ మార్కెట్ యార్డ్ ని వెతుక్కుంటూ రావటానికి కారణమేంటి... ఆది కేశవకి ఎలా బుద్ది చెప్పి.. అతని అసలు స్వరూపం ప్రపంచానికి ఎలా బహిర్గతం చేసాడు వంటి విషయాలు తెలియాలంటే మిగతా సినిమా చూడాల్సిందే.

నటీనటులు: రామ్, కృతి కర్బందా, ప్రకాష్ రాజ్, అభిమన్యు సింగ్, డా. బ్రహ్మానందం, ఆహుతి ప్రసాద్, అజయ్, రఘుబాబు, రమాప్రభ తదితరులు
సంగీతం: జి.వి.ప్రకాష్ కుమార్,
ఎడిటింగ్: మార్తాండ్ కె. వెంకటేష్,
ఫైట్స్: సెల్వ,
ఫోటోగ్రఫీ: వెంకటేష్,
ఆర్ట్: కె. కదిర్,
పాటలు: వనమాలి,
ప్రొడక్షన్ కంట్రోలర్: పి. రామ్ మోహన్ రావు,
సమర్పణ: భోగవల్లి బాపినీడు,
నిర్మాత: బి.వి.ఎస్.ఎన్. ప్రసాద్,
కథ-స్క్రీన్ ప్లే-మాటలు-దర్శకత్వం: భాస్కర్.

బొమ్మరిల్లు, పరుగు చిత్రాలకు మంచి కథలు తయారు చేసుకున్న భాస్కరేనే ఈ చిత్రానికి కథ తయారు చేసి డైరక్ట్ చేసింది అనే డౌట్ ఈ సినిమా చూస్తూంటే చాలా సార్లు కలుగుతుంది. ఎందుకంటే బొమ్మరిల్లుకి ఎంతో టైట్ స్క్రీన్ ప్లే తయారుచేసుకున్న భాస్కర్ ఈ సినిమాకి వచ్చేసరికి మాస్ ఎలిమెంట్స్ అనే మాయలో పడి... కథనం తన ఇష్టం వచ్చినట్లు నడిపాడు. అంతేగాక హీరో పాత్రకు ఎక్కడా ఎదురనేదే లేకుండా ట్రీట్ మెంట్ ఇచ్చి... కథని ప్యాసివ్ గా అన్ ఇంట్రస్టింగ్ గా మార్చేసాడు. సినిమా సెకండాఫ్ సగం దాకా విలన్ కి ఫలానా వాడు... తనను ఎదిరించటానికి వచ్చిన హీరో అని తెలియకుండా సాగుతుంది. దాంతో విలన్... తనను ఇరికిస్తున్నది హీరో అని..వాడిని ఎదుర్కోవాలని ఉండదు. అలా హీరోకి విలన్ సైడ్ నుంచి అడ్డంకి లేకుండా చేసేసారు. అంతేగాక..సినిమాలో హీరో, హీరోయిన్స్ ప్రేమ కథకు అసలు ప్రయారిటీ ఇవ్వలేదు. వాళ్లిద్దరి మధ్యన ఇంటిమసి సీన్స్ అస్సలు పండలేదు. కామిడీ అంటే... మెయిన్ కథకు సంభంధ లేకుండా సాగుతుంది. అలీ వంటి సీనియర్ నటులు ఉన్నా రఘుబాబు కామెడీనే ఉన్నంతలో కాస్త పేలింది. ముఖ్యంగా కథ... ఎనభైల నాటి... తండ్రిపై పడిన మచ్చని తొలిగించటానికి విలన్ పై పగ తీర్చుకునే కార్యక్రమం చుట్టూ తిరగటం బోర్ కొట్టించింది. ఈ పాతికేళ్లలో సామాజిక పరిస్ధితులతో పాటు.. సినిమా విలన్ స్వరూపం మారిపోయింది... అది భాస్కర్ గుర్తించలేదు.

యాక్షన్, పాటలు, డాన్స్ లు, కామెడీ వంటి మాస్ ఎలిమెంట్స్ అన్నీ సమకూర్చుకున్న ఈ కథలో..... అన్ని ఉన్నా అల్లుడు నోట్లో శని అన్నట్లు కథలో సోల్ మిస్సవటం జరిగి, కథనం బరువైపోయింది.

యూత్ ఫుల్ ఎంటర్టైనర్ తో తనకంటూ క్రేజ్ తెచ్చుకున్న రామ్... ఈ సినిమాలోనూ యాక్షన్ హీరోగా ప్రూవ్ చేసుకోవాలని ప్రయత్నం చేసాడు కానీ అతనికిచ్చిన క్యారెక్టర్ సహకరించలేదు. సీనియర్ హీరోలు చెయ్యాల్సిన పాత్రను అతని చేత చేయించినట్లైంది. కానీ డాన్స్ లు, ఫైట్స్ లో అతని కష్టం తెరపై కనిపిస్తుంది.

బోణి చిత్రంతో పరిచయమై, తీన్ మార్ లో పవన్ ప్రక్కన చేసిన కీర్తి కర్భందాకి పెద్దగా సీన్స్ లేవు కానీ.. ఉన్నంతలో బాగానే చేసింది. అయితే రెగ్యులర్ కమర్షియల్ హీరోయిన్ లాగ మాత్రం గ్లామర్ కురిపించలేకపోయింది. అయితే సాంగ్ సీక్వెన్స్ లలో మాత్రం చాలా బాగా చేసి, రామ్ కు పోటీ ఇచ్చింది.

ఆదికేశవులుగా మార్కెట్ యార్డ్ ఛైర్మన్ గా ప్రకాష్ రాజ్ జీవించాడనే చెప్పాలి. అయితే ఆ పాత్ర మలిచిన తీరు మన పాత సినిమాల్లో నాగభూషణం, రావుగోపాలరావుని గుర్తుకు తెస్తూ సాగటం విచారకరం. అంతేగాక ప్రకాష్ రాజ్ న్యూడ్ సీన్స్ పెట్టారు. అవి వెగటు పుట్టించాయి కానీ సినిమాకు పెద్దగా ఉపయోగపడలేదు.

రక్త చరిత్ర ఫేమ్ అబిమన్యు సింగ్ ఫరవాలేదనిపిస్తే, కిషోర్ దాస్ ఈ చిత్రంలో చెలరేగిపోయారు.. దాదాపు సినిమా మొత్తం కనిపించి నవ్వులు పూయించటమే కాక, రకరకాల ఎమోషన్స్ లో తనదైన ముద్రవేసే ప్రయత్నం చేసారు. ఈ సినిమా తర్వాత ఆయన బిజీ అయ్యే అవకాసం ఉందనిపిస్తోంది. జయప్రకాష్ రెడ్డికి సినిమాలో సీన్స్ పెద్దగా లేవు.. ఆహుతి ప్రసాద్ ఓకే అనిపించారు. రఘుబాబు... ఉన్నంతలో తిక్కలోడిగా బాగానే నవ్వించారు.

సాంకేతికంగా ఈ చిత్రం ఉన్నతంగానే ఉంది. ముఖ్యంగా మణిశర్మ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అద్బుతంగా కుదిరింది. అయితే జివి ప్రకాష్ కుమార్ సౌండ్ ట్రాక్ లో వచ్చే పాటలు మాత్రం మాస్ సినిమాకు తగినట్లు లేవు. నిరాశపరిచాయి.

కెమెరా వర్క్ బాగుంది. ప్రొడక్షన్ వ్యాల్యూస్ కూడా బాగానే ఉన్నాయి. పాటలు బాగా ఖర్చుపెట్టితీసారు. ఎడిటింగ్ లో లెంగ్త్ మరీ ఎక్కువైనట్లుంది. తగ్గిస్తే కాస్త జనం సేవ్ అవుతారు.

సినిమాలో తమిళ నేటివిటీ ఎక్కువైంది. అలాగే రామ్ కి అతని తండ్రి పాత్ర ధారి ప్రభుకి మధ్య వచ్చే ఎమోషనల్ సీన్స్ సరిగా పండలేదు. ఎందుకంటే వారి బంధం సరిగా ఎస్టాబ్లిష్ చేయలేకపోయారు. క్లైమాక్స్ అయితే మరీ ప్రెడిక్టిబుల్ గా తయారైంది.

దర్శకుడుగా భాస్కర్.. తగిన చిత్రం కాదనిపిస్తుంది. ఆయన తన గత చిత్రాలు తరహాలోనే క్లాస్ అయినా ఫర్వాలేదు అని తీస్తేనే మంచి సినిమాలు వచ్చేటట్లు ఉన్నాయనిపిస్తుంది. రామ్.. కూడా.. కరుణాకరన్, భాస్కర్ అంటూ తమిళ దర్శకుల వెంట వెళ్లినా పెద్ద ఫలితం కనిపించటం లేదని స్పష్టం అవుతుంది.

ఫైనల్ గా క్లాస్ చిత్రాల దర్సకులు ఇలాటి మాస్ చిత్రాల ప్రయత్నాలు చేస్తే.... పులిని చూసి నక్క వాత పెట్టుకున్న చందంగా సినిమాలు తయారయ్యి.. ప్రేక్షకులని భయపెడతాయని మరో సారి ఈ చిత్రంతో ప్రూవ్ అవుతుంది. బొమ్మరిల్లు భాస్కర్ చిత్రం కదా అని ఫ్యామిలీలను తీసుకుని వెళ్లి ఆవేశపడితే.. ఆయాసం మిగులటం తప్ప ఫలితం ఉండదు.

English summary
Ram, Kriti Karbandha starrer Ongole Gitta releasing today(1st February)with divide talk. Bommarillu Bhaskar who has done class and family movies like Bommarillu, Parugu and Orange is directing a mass film for the first time. BVSN Prasad producer of the movie.
Please Wait while comments are loading...