'పుష్ప', 'పుష్ప 2' సినిమాల తర్వాత ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కెరీర్ పూర్తిగా మారిపోయింది. ఒకప్పుడు టాలీవుడ్ స్టార్‌గా గుర్తింపు పొందిన బన్నీ.. ఇప్పుడు పాన్ ఇండియా స్టార్‌గా మారారు. కేవలం ఇండియాలోనే కాదు.. ఇతర దేశాల్లో ఆయన సినిమాలు విడుదల అవుతుండటంతో కొత్త సినిమాల విషయంలో ఆచితూచి అడుగులు వేస్తున్నారు. ప్రస్తుతం అట్లీ దర్శకత్వంలో 'రాకా', ఆ తర్వాత లోకేశ్ కనగరాజ్ దర్శకత్వంలో మరో భారీ సినిమా లైనప్‌లో ఉంది. ఈ రెండు సినిమాల తరువాత అల్లు అర్జున్ ఎవరితో సినిమా చేయబోతున్నాడన్న ప్రశ్నకు ఓ కొత్త సమాధానం దొరికిందట. ఇంతకీ ఆ కథేంటీ?

Advertisement
Advertisement

గత కొంతకాలంగా మలయాళ దర్శకుడు, నటుడు బాసిల్ జోసెఫ్‌తో అల్లు అర్జున్ ఓ ఫాంటసీ మూవీ తెరకెక్కించడానికి ప్రయత్నిస్తున్నారనే ప్రచారం జరుగుతోంది. అయితే అట్లీ, లోకేశ్ కనగరాజ్ సినిమాలు ప్రకటించడంతో ఆ ప్రాజెక్ట్ పక్కకు వెళ్లిపోయిందని అంతా భావించారు. కానీ, తాజాగా బాసిల్ జోసెఫ్ సోషల్ మీడియాలో చేసిన ఒక చిన్న పోస్ట్ తో వారిద్దరి కాంబో మరోసారి తెరపైకి వచ్చింది. ఈ కాంబినేషన్‌ను వార్తల్లోకి తీసుకొచ్చింది.

Advertisement

బాసిల్ జోసెఫ్ తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో 'ICON'అని రాసి ఉన్న ఒక క్యాప్ ఫొటోను షేర్ చేశారు. అంతేకాదు, ఆ పోస్టుకు అల్లు అర్జున్ నటించిన 'ఆర్య 2' సినిమాలోని సూపర్‌హిట్ 'రింగా రింగా' పాటను బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్‌గా జోడించారు. ఈ రెండు అంశాలను చూస్తుంటే.. అల్లు అర్జున్‌తో తన ప్రాజెక్ట్‌ సెట్ అయిందని, ఈ మేరకే బాసిల్ పరోక్షంగా హింట్ ఇచ్చారని భావిస్తున్నారు. అధికారిక ప్రకటన ఏదీ లేకపోయినా, ఈ పోస్టు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఈ రుమార్ వైరల్ అవుతున్నాయి.

Advertisement

వాస్తవానికి 'పుష్ప 2' విడుదలైన వెంటనే అల్లు అర్జున్ తదుపరి దర్శకుడు ఎవరు అనే చర్చ మొదలైనప్పుడు బాసిల్ జోసెఫ్ పేరు వినిపించింది. కానీ, అట్లీ తన కథతో ముందుకు రావడంతో రాకా సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. దీంతో ఈ ప్రాజెక్ట్ వెనక్కి వెళ్లింది. అయితే.. ఇప్పటికే కొన్ని కథలను బాసిల్ అల్లు అర్జున్‌కు వినిపించారని, కానీ అప్పట్లో అవి ఫైనల్ కాలేదని గతంలో కథనాలు వచ్చాయి. తాజాగా ఇప్పుడు బాసిల్ చేసిన సోషల్ మీడియా పోస్ట్‌ను బట్టి చూస్తే, అల్లు అర్జున్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చి ఉండొచ్చనే ఊహాగానాలు మొదలయ్యాయి.

Advertisement

అయితే ఈ ప్రాజెక్ట్ వెంటనే పట్టాలెక్కే అవకాశం మాత్రం కనిపించడం లేదు. ప్రస్తుతం అల్లు అర్జున్ అట్లీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న 'రాకా' షూటింగ్‌తో పాటు, లోకేశ్ కనగరాజ్ సినిమాకి కూడా సమయం కేటాయించాల్సి ఉంది. ఈ రెండు భారీ సినిమాలు పూర్తయ్యేలోపు కనీసం మరో ఏడాది నుంచి ఏడాదిన్నర సమయం పట్టే అవకాశం ఉంది. ఆ తర్వాతే బాసిల్ జోసెఫ్ సినిమా అధికారికంగా ప్రారంభమయ్యే అవకాశాలు ఉన్నాయని సినీ వర్గాలు అంచనా వేస్తున్నాయి. మొత్తానికి బాసిల్ జోసెఫ్ చేసిన ఒక చిన్న సోషల్ మీడియా పోస్టే భారీ చర్చకు దారితీసింది.