దర్శకధీరుడు ఎస్.ఎస్.రాజమౌళి- సూపర్ స్టార్ మహేష్ బాబు కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న మూవీ 'వారణాసి'. భారీ బడ్జెట్, అంతర్జాతీయ స్థాయి విజువల్స్, పాన్ వరల్డ్ కాన్సెప్ట్‌తో రూపొందుతున్న ఈ సినిమాపై రోజురోజుకూ అంచనాలు పెరుగుతున్నాయి. దీంతో ఈ సినిమాకు సంబంధించిన ఏ చిన్న అప్డేట్ అయిన సోషల్ మీడియాలో ఇట్టే వైరల్ అవుతోంది. ఇదే సమయంలో ఇప్పుడు మరో ఆసక్తికరమైన వార్త సినీ వర్గాల్లో చక్కర్లు కొడుతోంది. ఈ పాన్ ఇండియా సినిమాలో నందమూరి వారసుడు ఈ సినిమాతో బాలనటుడిగా సినీ రంగ ప్రవేశం చేయనున్నారనే ప్రచారం హాట్ టాపిక్‌గా మారింది. ఇంతకీ ఆ వారసుడు ఎవరు?

Advertisement
Advertisement

భారీ స్థాయిలో తెరకెక్కుతున్న 'వారణాసి'
మహేష్ బాబు కెరీర్‌లోనే అత్యంత భారీ బడ్జెట్‌తో రూపొందుతున్న వారణాసి సినిమాకి రాజమౌళి దర్శకత్వం వహిస్తున్నారు. నిర్మాత కే.ఎల్. నారాయణ శ్రీ దుర్గా ఆర్ట్స్ బ్యానర్‌పై ఈ సినిమాను అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. ప్రియాంక చోప్రా హీరోయిన్‌గా నటిస్తుండగా, పృథ్వీరాజ్ సుకుమారన్ కీలక పాత్ర పోషిస్తున్నారు.ఎం.ఎం.కీరవాణి సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమా భారతీయ పురాణాలు, ఆధ్యాత్మిక అంశాలు, టైమ్ ట్రావెల్ కాన్సెప్ట్‌ల సమ్మేళనంగా రూపొందుతోంది.

Advertisement

మహేష్ చిన్ననాటి పాత్రలో ఎన్టీఆర్ తనయుడు?
తాజా ప్రచారం ప్రకారం.. ఈ సినిమాలో మహేష్ బాబు పోషిస్తున్న రుద్ర అనే పాత్రలతో నటిస్తున్నారు. ఈ పాత్ర చిన్ననాటి వెర్షన్‌లో యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ చిన్న కుమారుడు భార్గవ్ రామ్ కనిపించనున్నారట. ఇదే నిజమైతే.. భారతీయ సినీ పరిశ్రమలో అత్యంత ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్ట్ ద్వారా ఆయన బాలనటుడిగా అరంగేట్రం చేసినట్టవుతుంది. అయితే ఈ విషయంపై మూవీ మేకర్స్ నుంచి ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. రాజమౌళి, మహేష్ బాబు, ఎన్టీఆర్ లేదా నిర్మాతల బృందం ఈ వార్తను ధృవీకరించలేదు. ప్రస్తుతం ఇది సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ప్రచారం మాత్రమే.

Advertisement

ప్రచారానికి కారణం ఏమిటి?
రాజమౌళి, ఎన్టీఆర్ మధ్య ఉన్న అనుబంధం అందరికీ తెలిసిందే. దర్శకుడిగా రాజమౌళి ప్రయాణం'స్టూడెంట్ నెం.1' చిత్రంతో ప్రారంభమైంది. అప్పటి నుంచి ఇద్దరి మధ్య స్నేహం కొనసాగుతోంది. తర్వాత'యమదొంగ','ఆర్ఆర్ఆర్' వంటి సినిమాలతో వారి బంధం మరింత బలపడింది. ఈ స్నేహమే భార్గవ్ రామ్ ఎంట్రీ వార్తలకు కారణమై ఉండొచ్చని సినీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. రాజమౌళి అడిగితే ఎన్టీఆర్ కూడా సానుకూలంగా స్పందించారని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. అయితే దీనిపై ఎలాంటి అధికారిక సమాచారం అందుబాటులో లేదు. ఎన్టీఆర్ తనయులు అభయ్ రామ్, భార్గవ్ రామ్‌కు సంబంధించిన ఫొటోలు, వీడియోలు అప్పుడప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంటాయి. దీంతో ఇద్దరు స్టార్ కిడ్స్‌పై అభిమానుల్లో ఎప్పుడూ ఆసక్తి ఉంటుంది.

Advertisement

ప్రస్తుతం 'వారణాసి'షూటింగ్ వేగంగా సాగుతోంది. 2027 ఏప్రిల్‌ 7లో ఈ సినిమాని ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయాలని మూవీ మేకర్స్ లక్ష్యంగా పెట్టుకుంది. ఈ నేపథ్యంలో భార్గవ్ రామ్ ఎంట్రీ వార్తలు మరింత చర్చకు దారితీశాయి.అయితే అధికారిక ప్రకటన వచ్చే వరకు ఈ వార్తను రూమర్‌గానే పరిగణించాల్సి ఉంటుంది. ఒకవేళ ఈ ప్రచారం నిజమైతే, భారతీయ సినీ పరిశ్రమలోనే అత్యంత ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్ట్ ద్వారా ఎన్టీఆర్ తనయుడు వెండితెరపై అడుగుపెట్టడం విశేషంగా నిలుస్తుంది.