నందమూరి బాలకృష్ణ వారసుడు మోక్షజ్ఞ తేజ లాంచింగ్ కోసం అభిమానులు కళ్లు కాయలు కాచేలా ఎదురుచూస్తున్నారు. రేపో మాపో ప్రాజెక్ట్ పట్టాలెక్కుతుందని వార్తలు రావడం అంతలోనే వాతావరణం సద్దుమణగడం ఆనవాయితీగా మారింది. అన్నీ అనుకున్నట్లుగా సాగితే మోక్షజ్ఞ ఎంట్రీ ఈపాటికే జరిగిపోవాల్సింది. కానీ అనివార్య కారణాలతో డెబ్యూ మూవీ వాయిదా పడింది. తాజాగా మోక్షజ్ఞ లాంచింగ్‌కు సంబంధించి ఓ వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఈ వివరాల్లోకి వెళితే..
తన వారసుడిని గ్రాండ్‌గా అరంగేట్రం చేయించాలని బాలకృష్ణ అన్ని పనులను దగ్గరుండి చూసుకుంటున్నారు. ఏ చిన్న తప్పుకి అవకాశం ఇవ్వకుండా స్క్రిప్ట్ దగ్గరి నుంచి క్యాస్టింగ్, ప్రొడక్షన్ అన్నింటిని పర్యవేక్షిస్తున్నారు. గతంలోనే హనుమాన్ ఫేమ్ ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో మోక్షజ్ఞ ఎంట్రీ ఉంటుందని బలంగా జరిగింది. ఈ కుర్రాడి ఫోటోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. అయితే ఆ తర్వాత ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించి ఎలాంటి ప్రకటన రాకపోవడంతో అభిమానులు డీలా పడిపోయారు.
అయితే మోక్షజ్ఞ ఎంట్రీ త్వరగా జరిగేలా చూడాలని నందమూరి అభిమానుల నుంచి బాలయ్యపై ఒత్తిడి నానాటికీ తీవ్రమవుతోంది. ప్రతిసారి హడావుడి జరగడం ఆ వెంటనే సైలెంట్ అయిపోవడంతో వారు అసహనం వ్యక్తం చేస్తున్నారు. దాంతో మరిన్ని పుకార్లు వైరల్ అవుతున్నాయి. బాలయ్య కెరీర్‌లో క్లాసిక్ చిత్రాలలో ఒకటైన ఆదిత్య 369కి సీక్వెల్‌గా ఆదిత్య 999 మ్యాక్స్‌తోనే మోక్షజ్ఞ లాంచింగ్ ఉంటుందని మొన్నామధ్య గాసిప్స్ వినిపించాయి. క్రిష్ జాగర్లమూడి చేతికి మోక్షజ్ఞ లాంచింగ్ బాధ్యతలు అప్పగించినట్లుగా ఊహాగానాలు చక్కర్లు కొట్టాయి. ఎట్టి పరిస్ధితుల్లోనూ ఈ ఏడాదే ప్రాజెక్ట్ సెట్స్ మీదకి వెళ్లాలని బాలయ్య కూడా పట్టుదలతో ఉన్నట్లు కథనాలు వినిపించాయి. చివరికి ఇది కూడా ఉత్త ప్రచారంగానే తేలిపోయింది. ఇప్పుడు మోక్షజ్ఞ డెబ్యూ మూవీకి సంబంధించి తాజాగా మరో వార్త వైరల్ అవుతోంది. ఈ నందమూరి కుర్రాడి కోసం పాన్ ఇండియా డైరెక్టర్ రంగంలోకి దిగినట్లుగా ఓ ఆసక్తికరమైన కథనం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆయన ఎవరో కాదు అర్జున్ రెడ్డి, యానిమల్ సినిమాల దర్శకుడు సందీప్ రెడ్డి వంగా. బాలయ్య రూపొందించిన కథకు సందీప్ రెడ్డి వంగా తన వంతు సహకారం అందిస్తున్నట్లుగా ఫిలింనగర్‌లో ఊహాగానాలు వినిపిస్తున్నాయి. దర్శకుడిగా తనకున్న అనుభవంతో స్క్రిప్ట్‌లో మార్పులు చేర్పులపై ఆయన సలహాలు ఇస్తున్నట్లుగా చర్చ జరుగుతోంది. తన సినిమాలలో హీరో క్యారెక్టరైజేషన్, ఎలివేషన్స్ విషయంలో సందీప్ రెడ్డి వంగా తన మార్క్ చూపించారు. జెన్ జీ కోరుకునే ఎలిమెంట్స్‌తో కథనాన్ని నడపడంలో ఆయన దిట్ట అనే గుర్తింపు తెచ్చుకున్నారు. ఈ క్రమంలోనే మోక్షజ్ఞ డెబ్యూ మూవీ కోసం బాలయ్యతో సందీప్ చేతులు కలిపారనే టాక్ వినిపిస్తోంది. ఒకవేళ అదే నిజమైతే బాలయ్య వారసుడి మూవీపై అంచనాలు పెరిగిపోతాయి. మరి నిజంగానే మోక్షజ్ఞ ఎంట్రీ ప్రాజెక్ట్‌లో సందీప్ తన సహకారం అందిస్తున్నారా? లేక సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారమా అనేది తెలియాలంటే కొద్దిరోజులు వెయిట్ చేయాల్సిందే.More Articles