ఇటీవల సినీసెలబ్రిటీల పెళ్లిళ్ల ట్రెండ్ పూర్తిగా మారిపోయింది. ఒకప్పుడు నెలల ముందే పెళ్లి వార్తలు బయటకు వచ్చి, అంగరంగ వైభవంగా వేడుకలు జరిగేవి. కానీ ఇప్పుడు చాలామంది స్టార్‌లు ఎలాంటి హడావుడి లేకుండా ముందుగా నిశ్చితార్థం చేసుకుని, ఆ తర్వాతే అభిమానులకు గుడ్ న్యూస్ చెబుతున్నారు. తాజాగా ఇదే జాబితాలోకి ఓ టాలీవుడ్ హీరో కూడా చేరాడు. ఎలాంటి ప్రచారం లేకుండా తన ఎంగేజ్‌మెంట్ పూర్తి చేసుకుని, ఇప్పుడు పెళ్లికి సిద్ధమయ్యాడు. దీనికి సంబంధించిన వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేయడంతో ఈ వార్త ఒక్కసారిగా వైరల్ అయింది. ఇంతకీ ఆ హీరో ఎవరు? కాబోయే వధువు ఎవరు? వీరి ప్రేమ ఎలా మొదలైంది? పెళ్లి ఎప్పుడు, ఎక్కడ జరగబోతోంది? అనే విషయాలు అభిమానుల్లో ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి.

Advertisement
Advertisement

ఆ హీరో ఎవరో కాదు.. హీరో, క్యారెక్టర్ ఆర్టిస్ట్, బిగ్‌బాస్ మాజీ కంటెస్టెంట్ ప్రిన్స్ సెసిల్. ఈ టాలీవుడ్ హీరో తన బ్యాచిలర్ లైఫ్ ఎండ్ కార్డు వేయబోతున్నారు. త్వరలో పెళ్లి పీటలెక్కనున్నారు. ఇప్పటి వరకు తన పర్సనల్ విషయాలను గోప్యంగా ఉంచిన ప్రిన్స్.. తాజాగా సోషల్ మీడియా ద్వారా అభిమానులకు గుడ్ న్యూస్ చెప్పారు. గత నెలలోనే నిశ్చితార్థం జరిగిన విషయాన్ని ఓ వీడియోతో వెల్లడించి, అభిమానులు ఆశ్చర్యపరిచారు.

సైలెంట్‌గా జరిగిన నిశ్చితార్థం
ప్రిన్స్ సెసిల్ నిశ్చితార్థం.. సాయి మాచిరాజు అనే యువతితో గత నెల ప్రారంభంలో కుటుంబ సభ్యులు, అత్యంత సన్నిహితుల సమక్షంలో జరిగింది. ఈ విషయాన్ని ఇంతకాలం గోప్యంగా ఉంచిన ఆయన.. ఇటీవల సోషల్ మీడియాలో ఎంగేజ్‌మెంట్ వీడియోను షేర్ చేశారు. "నేను కూడా ఒక ఇంటివాడిని కాబోతున్నాను" అంటూ పోస్ట్ చేయడంతో ఈ వార్త ఒక్కసారిగా వైరల్ అయింది. ఈ వీరిద్దరి పరిచయం కూడా చాలా డిఫరెంట్ గా జరిగిందట.

Advertisement

ప్రిన్స్ చెప్పిన వివరాల ప్రకారం.. గత ఏడాది సెప్టెంబర్‌లో ఒక కామన్ ఫ్రెండ్ పెళ్లిలో తొలిసారి సాయి మాచిరాజును కలిశారు. మొదట ఇద్దరి మధ్య స్నేహం ఏర్పడింది. ఆ తర్వాత ఒకరినొకరు బాగా అర్థం చేసుకున్నారు. అభిరుచులు, ఆలోచనలు కలవడంతో ఆ స్నేహం ప్రేమగా మారింది. చివరకు ఇరు కుటుంబాల అంగీకారంతో నిశ్చితార్థం వరకు వారి ప్రయాణం చేరుకుంది. ఈ ప్రేమకథలో నటుడు ప్రియదర్శి కూడా కీలక పాత్ర పోషించినట్లు తెలుస్తోంది. ప్రిన్స్, సాయికి కామన్ ఫ్రెండ్‌గా ప్రియదర్శి ఉన్నారని సమాచారం. ప్రిన్స్ షేర్ చేసిన ప్రపోజల్ వీడియోలో కూడా ప్రియదర్శి కనిపించారు. ఆయనతో పాటు ఇరువురి సన్నిహితులు కూడా ఉన్నారు.

Advertisement

న్యూజిలాండ్‌లోనే గ్రాండ్ వెడ్డింగ్
ప్రిన్స్ కాబోయే భార్య సాయి మాచిరాజు ప్రస్తుతం న్యూజిలాండ్‌లో ఉద్యోగం చేస్తున్నారు. ఆమె కుటుంబం కూడా అక్కడే స్థిరపడింది. ఈ నేపథ్యంలో వీరి వివాహాన్ని కూడా న్యూజిలాండ్‌లో నిర్వహించాలని రెండు కుటుంబాలు నిర్ణయించినట్లు తెలుస్తోంది. సినీ వర్గాల్లో వినిపిస్తున్న సమాచారం ప్రకారం.. ఆగస్టు 24న న్యూజిలాండ్‌లోనే వీరి డెస్టినేషన్ వెడ్డింగ్ జరగనుంది.

Advertisement

హీరోగా ఎంట్రీ.. తర్వాత కొత్త దారి
ప్రిన్స్ సెసిల్ కెరీర్‌ను పరిశీలిస్తే.. దర్శకుడు తేజ తెరకెక్కించిన 'నీకు నాకు డ్యాష్ డ్యాష్' సినిమాతో హీరోగా పరిచయమయ్యారు. ఆ తర్వాత 'బస్ స్టాప్' సినిమా ద్వారా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఈ రెండు సినిమాలు ఆయనకు మంచి గుర్తింపు తీసుకొచ్చినా, స్టార్ హీరోగా మాత్రం నిలబెట్టలేకపోయాయి. హీరోగా ఆశించిన విజయాలు రాకపోవడంతో ప్రిన్స్ తన కెరీర్‌ను కొత్త దిశగా మలిచారు. 'నేను శైలజ', 'డీజే టిల్లు' వంటి చిత్రాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. అవసరమైతే నెగెటివ్ షేడ్స్ ఉన్న పాత్రల్లో కూడా నటిస్తూ తన నటనతో ఆకట్టుకున్నారు. ఇటీవల విడుదలైన 'సాంప్రదాయిని సుప్పిని సుద్ధపూసని' సినిమాలో కూడా కనిపించారు.

Advertisement

బిగ్‌బాస్‌తో మరింత పాపులారిటీ
సినిమాలతో పాటు బిగ్‌బాస్ తెలుగు తొలి సీజన్ లో పాల్గొనడం కూడా ప్రిన్స్‌కు మంచి గుర్తింపు తీసుకొచ్చింది. షోలో ఆయన ప్రవర్తన, ఆటతీరు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. బిగ్‌బాస్ తర్వాత కూడా ఆయనకు మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఏర్పడింది. ప్రిన్స్ షేర్ చేసిన ఎంగేజ్‌మెంట్ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అభిమానులతో పాటు సినీ ప్రముఖులు కూడా ఈ జంటకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. హ్యాపీ మ్యారెడ్ లైఫ్, కంగ్రాట్స్ ప్రిన్స్, మేడ్ ఫర్ ఈచ్ అదర్ అంటూ కామెంట్లు చేస్తున్నారు.