హిట్ కోసం కళ్లు కాయలు కాచేలా ఎదురుచూసి ఎట్టకేలకు లెనిన్‌తో హిట్ అందుకున్నారు మరాఠీ బ్యూటీ భాగ్యశ్రీ బోర్సే. లెనిన్ విజయంలో కీలకపాత్ర పోషించడం.. నటన, డ్యాన్స్ ఇలా అన్నింటిలోనూ తనను తాను ప్రూవ్ చేసుకోవడంతో భాగ్యశ్రీ టాలీవుడ్‌లో ఇప్పుడు మోస్ట్ వాంటెడ్ హీరోయిన్‌గా మారారు. సీనియర్ల నుంచి జూనియర్ హీరోల వరకు ఆమె పర్ఫెక్ట్ ఛాయిస్‌గా మారిపోయారు. అయితే ఈ సక్సెస్, ప్రశంసలు ఆమెకు రాత్రికి రాత్రి రాలేదు. ఇందుకోసం ఎన్నో కష్టాలను భరించి, అవమానాలను దిగమింగుకుని ఇక్కడి వరకు వచ్చారు. తాజాగా హైదరాబాద్‌లో కాలేజ్ విద్యార్ధులతో జరిగిన ముఖాముఖిలో తన జీవిత ప్రయాణాన్ని గుర్తుచేసుకుంటూ ఎమోషనల్ అయ్యారు భాగ్యశ్రీ. ఈ వివరాల్లోకి వెళితే..

Advertisement
Advertisement

మహారాష్ట్రలోని ఛత్రపతి శంభాజీ నగర్‌లో 6 మే, 1999న జన్మించారు భాగ్యశ్రీ బోర్సే. నైజీరియాలోని లాగోస్, ముంబైలలో ఆమె చదువుకున్నారు. దిగువ మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చిన ఈ ముద్దుగుమ్మ చిన్నతనంలో ఎన్నో కష్టాలు పడ్డారు. భాగ్యశ్రీ పుట్టేనాటికి తండ్రి ఉద్యోగం కోల్పోవడంతో వీరి కుటుంబాన్ని ఆర్ధిక సమస్యలు చుట్టుముట్టాయి. తనకు ఇద్దరు కూతుళ్లు ఉన్నారని.. కుటుంబాన్ని పోషించుకోవడానికి తనకు ఏదైనా ఉద్యోగం ఇవ్వాలని తన తండ్రి ప్రాధేయపడటం తనకు ఇప్పటికీ గుర్తుందని ఓ ఇంటర్వ్యూలో భాగ్యశ్రీ భావోద్వేగానికి గురయ్యారు. నాన్న ఎప్పటికీ ఎవరి ముందు తలదించుకోకూడదనే ఉద్దేశంతో కష్టపడి చదువుకుని మోడలింగ్ వైపు వచ్చినట్లు చెప్పారు.

Advertisement

మోడలింగ్‌లో దిగిన భాగ్యశ్రీకి సినీరంగం నుంచి అవకాశాలు వచ్చాయి. 2023లో యారియన్ అనే హిందీ సినిమాతో చిత్రసీమలో అడుగుపెట్టారు ఈ ముద్దుగుమ్మ. ఆ తర్వాత చందు ఛాంపియన్‌లోనూ నటించారు. భాగ్యశ్రీ అందం, నటన చూసిన టాలీవుడ్ డైరెక్టర్ హరీశ్ శంకర్ ఆమెను తెలుగు ఇండస్ట్రీకి పరిచయం చేశారు. రవితేజ హీరోగా తెరకెక్కిన మిస్టర్ బచ్చన్‌లో భాగ్యశ్రీ బోర్సే నటించారు. ఈ సినిమాలో ఆమె అందానికి కుర్రాళ్లు పిచ్చెక్కిపోయారు. అయితే మిస్టర్ బచ్చన్ డిజాస్టర్ కావడంతో భాగ్యశ్రీ నిరాశ వ్యక్తం చేశారు.

Advertisement

ఆ వెంటనే విజయ్ దేవరకొండ సరసన కింగ్డమ్, తమిళంలో దుల్కర్ సల్మాన్ సరసన కాంతా.. రామ్ పోతినేని సరసన ఆంధ్రా కింగ్ తాలూకా సినిమాలలో నటించారు. స్టార్ హీరోల పక్కన ఛాన్స్ దొరికినప్పటికీ ఆమెకు హిట్ మాత్రం అందలేదు. వరుస పరాజయాల కారణంగా భాగ్యశ్రీపై ఐరన్ లెగ్ ముద్ర పడింది. అయినప్పటికీ మొక్కవోని దీక్ష, పట్టుదలతో సక్సెస్ కోసం ప్రయత్నించి చివరికి లెనిన్ రూపంలో తొలి హిట్‌ను అందుకున్నారు ఈ ముద్దుగుమ్మ. ఈ మూవీ సక్సెస్‌మీట్‌లో భాగ్యశ్రీ ఎమోషనల్ అయ్యారు. తాను ఇకపై ఐరన్ లెగ్ కాదని కన్నీటి పర్యంతమయ్యారు.

Advertisement

ఇటీవల హైదరాబాద్‌లోని కాలేజీ విద్యార్ధులతో భాగ్యశ్రీ బోర్సే నిర్వహించిన ముఖాముఖిలో తన కెరీర్‌కు సంబంధించిన ఆసక్తికర విశేషాలను పంచుకున్నారు. నేను సినీరంగంలోకి వెళ్లడం మా కుటుంబానికి ఏమాత్రం ఇష్టం లేదు. తల్లిదండ్రులే కాదు మా అక్క కూడా ఈ విషయంలో నాకు సపోర్ట్‌గా నిలవలేదు. అందరూ ఒక్క మాట మీదే ఉండి నా నిర్ణయాన్ని వ్యతిరేకించారు. అయితే సినిమాలలోకి ఎలాగైనా అడుగుపెట్టాలనే ఉద్దేశంతో నేను ఆడిషన్స్ ఇస్తూ వచ్చాను. ఈ విషయం ఇంట్లో తెలియడంతో అమ్మ సీరియస్ అయ్యింది. నన్ను వాట్సాప్‌లో బ్లాక్ చేసి 6 నెలల పాటు మాట్లాడలేదు. దాంతో ఎంతో ఏడ్చానని భాగ్యశ్రీ గుర్తుచేసుకుని ఎమోషనల్ అయ్యారు. ప్రస్తుతం ఆమె వ్యాఖ్యలు సోషల్ మీడియలో వైరల్ అవుతున్నాయి.