ఉత్తరాది నుంచి వచ్చి తెలుగు ప్రేక్షకులకు ఇష్టమైన హీరోయిన్లలో ఒకరిగా నిలిచారు జెనీలియా డిసౌజా. ప్రస్తుతం తెలుగు చిత్ర పరిశ్రమకు దూరంగా ఉంటున్నప్పటికీ ఇక్కడి ప్రజల హృదయాలలో హసినీగా నిలిచిపోయారు ఈ ముద్దుగుమ్మ. బొమ్మరిల్లు, సై, హ్యాపీ, రెడీ, శశిరేఖా పరిణయం తదితర చిత్రాలలో టాలెంటెడ్ నటిగా గుర్తింపు తెచ్చుకున్నారు జెనీలియా. బాలీవుడ్ నటుడు రితేష్ దేశ్‌ముఖ్‌తో ప్రేమ వివాహం తర్వాత ముంబైకే పరిమితమయ్యారు ఈ నటి. అయితే తనకు స్టార్ స్టేటస్‌ను, దేశవ్యాప్తంగా గుర్తింపు అందించిన తెలుగు ప్రజలు, టాలీవుడ్ అంటే జెనీలియాకు ఎంతో గౌరవం అభిమానం. సందర్భం వచ్చినప్పుడల్లా ఈ విషయాన్ని పలుమార్లు బయటపెడుతూనే ఉన్నారు. తాజాగా జెనీలియా ఓ ఎమోషనల్ పెట్టారు. ఈ వివరాల్లోకి వెళితే..
హైదరాబాద్ మహానగరం ఎన్నో చారిత్రక, వారసత్వ కట్టడాలకు ప్రసిద్ధి. పురాతన, ఆధునిక హంగులతో పర్యాటకులను ఆకట్టుకుంటూ ఉంటుంది ఈ నగరం. హైదరాబాద్ అనగానే గుర్తొచ్చే అంశాల్లో ఛార్మినార్, గోల్కొండ కోట, హైటెక్ సిటీ, హుస్సేన్ సాగర్‌లో బుద్ధ విగ్రహం, రామోజీ ఫిల్మ్ సిటీ వంటివి ప్రముఖంగా ఉన్నాయి. అయితే 80వ దశకంలో హైదరాబాద్‌కు ఐకానిక్‌గా నిలిచిన కట్టడం తాజా బంజారా. ఎందరో దేశ, విదేశీ ప్రముఖులకు ఆతిథ్యాన్ని అందించిన ఘనత ఈ హోటల్ సొంతం. హైదరాబాద్‌లో తొలి తరం లగ్జరీ హోటల్స్‌లో ఇది కూడా ఒకటి. ఇంతటి చరిత్ర ఉన్న తాజ్ బంజారా హోటల్ చరిత్ర ఇకపై కాలగర్బంలో కలిసిపోనుంది.
1979లో ఏర్పాటైన తాజ్ బంజారా.. హైదరాబాద్‌లో తొలి విలాసవంతమైన హోటళ్లలో ఒకటిగా నిలిచింది. 1986 వరకు దీని నిర్వహణ బాధ్యతలను ఐటీసీ గ్రూప్ నిర్వహించింది. ఆ తర్వాత నాలుగు దశాబ్ధాల పాటు జీవీకే హోటల్స్ దీనిని పరుగులు తీయించింది. అయితే గత కొన్నేళ్లుగా ఆపరేషనల్ సమస్యలు, పన్ను బకాయిలు చెల్లించకపోవడంతో జీహెచ్ఎంసీ నుంచి పలుమార్లు నోటీసులు ఎదుర్కోవడం వంటి సవాళ్లను ఎదుర్కొంది. ఆస్తి పన్ను బకాయిలు చెల్లించకపోవడంతో జీహెచ్ఎంసీ అధికారులు ఈ హోటల్‌ను తాత్కాలికంగా సీల్ చేశారు. అధికార వర్గాల అంచనా ప్రకారం జీహెచ్ఎంసీకి దాదాపు 1.43 కోట్ల రూపాయల బకాయిలు పడింది తాజ్ బంజారా. అయితే బంజారా లేక్‌కు ఆనుకుని దాదాపు 3.4 ఎకరాల విస్తీర్ణంలో, 270కి పైగా గదులతో విస్తరించి ఉండటం, నగరంలోని ప్రైమ్ ఏరియాలో ఉండటం వల్ల ఈ విలువైన ఆస్తిపై ప్రముఖ రియాలిటీ సంస్థలు, ప్రైవేట్ వ్యక్తుల కన్ను పడింది. ఈ క్రమంలోనే ప్రముఖ రియాలిటీ సంస్థ అరబిందో రియాలిటీ సంస్థ 315 కోట్ల రూపాయలకు దక్కించుకుంది. దీనికి స్టాంప్ డ్యూటీ కింద 17.3 కోట్ల రూపాయలు చెల్లించడం విశేషం. ఇప్పుడున్న హోటల్ భవనాన్ని కూల్చివేసి దాని స్థానంలో దాదాపు 40 అంతస్తులతో భారీ కాంప్లెక్స్‌ను నిర్మించాలని అరబిందో సంస్థ ప్రణాళికలు రూపొందిస్తోంది. ఈ క్రమంలోనే ఈ ఏడాది ఏప్రిల్ నెలాఖరులో కూల్చివేత పనులు ప్రారంభమయ్యాయి. తొలుత తలుపులు, కిటికీలు, ఇతర ఫర్నిచర్ తరలింపు ప్రక్రియ ప్రారంభించారు. తాజాగా ప్రధాన భవనాన్ని నేలమట్టం చేసే పనుల్ని ప్రారంభించారు. ఈ ప్రక్రియ పూర్తి కావడానికి నాలుగు నెలల సమయం పట్టొచ్చని నిర్మాణ రంగ నిపుణులు భావిస్తున్నారు. తాజ్ బంజారా మొత్తం విస్తీర్ణం 16,645 చదరపు గజాలు, ఇందులో బిల్డప్ ఏరియా 1.22 లక్ష చదరపు అడుగులు అని అంచనా. ఇక్కడి వరకు బాగానే ఉంది కానీ.. తాజ్ బంజారా కూల్చివేతపై హైదరాబాద్ వాసులు జీర్ణించుకోలేకపోతున్నారు. 45 ఏళ్లుగా తమ జీవితంలో భాగమైన ఐకానిక్ చిహ్నం ఇక లేదని తెలిసి ఎమోషనల్ అవుతున్నారు. ప్రజలే కాదు.. ప్రముఖులు కూడా దీనిపై బాధపడుతున్నారు. తాజాగా బాలీవుడ్ నటి జెనీలియా డిసౌజా కూడా తాజ్ బంజారా హోటల్‌తో తనకున్న అనుబంధాన్ని గుర్తుచేసుకున్నారు. ఈ హోటల్‌తో తనకు ఎన్నో జ్ఞాపకాలు ముడిపడి ఉన్నాయని.. ఇది నాకు హైదరాబాద్‌లో ఇల్లులా నిలిచిందని విచారం వ్యక్తం చేస్తూ హార్ట్ బ్రేక్ ఎమోజీ షేర్ చేశారు. ప్రస్తుతం ఆమె పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.More Articles