చిత్ర పరిశ్రమలో కొత్త అమ్మాయిలను అవకాశాల పేరుతో ట్రాప్ చేసి లైంగిక వాంఛలు తీర్చుకునే వారి బండారాలు బయటపడుతూనే ఉన్నాయి. టాలీవుడ్ నుంచి బాలీవుడ్ వరకు పైకి పెద్ద మనుషుల్లా చెలామణి అవుతూ కీచకుల్లాంటి వ్యక్తులు ఇండస్ట్రీలో అడుగడుగునా కాచుకుని కూర్చొన్నారు. అమాయక అమ్మాయిలు ఏ మాత్రం ఆదమరిచినా కాటు వేయడానికి సిద్ధంగా ఉంటారు. అయితే ఆఫర్ల కోసం వ్యక్తిత్వాన్ని, మానాన్ని పణంగా పెట్టని నటీమణులు కూడా ఉంటారు. ఎన్ని ఇబ్బందులు ఎదురైనా ధైర్యంగా తట్టుకుని నిలబడి స్టార్స్‌గా వెలుగొందుతున్నారు.

భారతీయ చిత్ర పరిశ్రమలో మీటూ ఉద్యమం ఉధృతంగా సాగిన రోజులలో కొందరు హీరోయిన్లు, నటీమణులు తమ జీవితంలో ఎదురైన క్యాస్టింగ్ కౌచ్ అనుభవాలను పంచుకున్నారు. ఈ క్రమంలోనే కోలీవుడ్‌ హీరోయిన్ లేఖ వాషింగ్టన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఓ దర్శకుడు తనను కమిట్‌మెంట్ అడిగాడని బయటపెట్టారు. 1999లో కాదలర్ దినమ్ మూవీలో చిన్న పాత్ర ద్వారా తమిళ చిత్ర పరిశ్రమలో అడుగుపెట్టారు లేఖ. ఆ తర్వాత హిందీలో మణిరత్నం తెరకెక్కించిన యువ ఆమెకు మరింత గుర్తింపు తెచ్చిపెట్టింది.

అనంతరం తమిళంలో ఉన్నాలే ఉన్నాలే, జయం కొండాన్, వా, కళ్యాణ సమయాల్ సాదం, అరిమ నంబి సినిమాలలో నటించారు లేఖ. తెలుగులో అల్లు అర్జున్ - మంచు మనోజ్ హీరోలుగా వచ్చిన మల్టీస్టారర్ మూవీ వేదంలోనూ కనిపించారు. అయితే ఎక్కువగా గెస్ట్ రోల్స్‌కే ఈ ముద్దుగుమ్మ పరిమితమయ్యారు. నటిగా కంటే పెయింటర్‌గా, ఆర్టిస్ట్‌గా లేఖ వాషింగ్టన్ గుర్తింపు తెచ్చుకున్నారు. 2014లో పీటర్ గయా కామ్ సే ఆమె చివరి సినిమా. పాబ్లో ఛటర్జీతో సహజీవనం చేసిన లేఖ వాషింగ్టన్ అనంతరం.. బాలీవుడ్ సూపర్‌స్టార్ ఆమీర్ ఖాన్ బంధువు ఇమ్రాన్ ఖాన్‌తో రిలేషన్‌లో ఉన్నారు.

కాగా.. కొన్నాళ్ల క్రితం ఓ ఇంటర్వ్యూలో లేఖ వాషింగ్టన్ మాట్లాడుతూ తాను కూడా క్యాస్టింగ్ కౌచ్ బాధితురాలినేనని బయటపెట్టారు. ఏదైనా సినిమాలో ఒక పాత్రను మేం దక్కించుకోవాలంటే ఎన్నో కష్టాలు పడాలి. వివక్షను ఎదుర్కొన్నా, అవకాశాలు ఇవ్వకుండా నన్ను పక్కనపెట్టిన ఘటనలు ఉన్నాయి. ఏం జరిగినా నేను మాత్రం వెనకడుగు వేసే రకం కాదు. నాకంటూ కొన్ని పరిమితులు ఉన్నాయి, ఆ హద్దులు మీరి నేను జీవించలేను. ఇతరులు ఏమనుకుంటారోననే దాని గురించి పెద్దగా పెట్టించుకోను. నటిగా కంటే ఆర్టిస్ట్‌లకు, డిజైనర్‌లకు ఇలాంటి సమస్యలు ఉండవనుకుంటా అని లేఖ ఆవేదన వ్యక్తం చేశారు.

ఒక తమిళ దర్శకుడు నాకు తన సినిమాలో ఆఫర్ ఇచ్చాడు. ఓ రోజు రాత్రి అతని కారులో ఎక్కించుకుని తిప్పుతూ దీనికి ప్రతిఫలంగా నాకేం దొరుకుతుందని గుచ్చి గుచ్చి అడిగాడు. అతని ఉద్దేశం నాకు అర్ధమైనా ఏం తెలియనట్లు నటించా.. కానీ ఆ డైరెక్టర్ పట్టు వదలకుండా అలాగే అడగటంతో నీతో పడుకునే ఆలోచన నాకు లేదని కోపంగా సమాధానం చెప్పేశా. ఊహించని సమాధానంతో అతను షాకైనా.. తిరిగి నన్ను ఒప్పించడానికి ప్రయత్నించాడు. ఆ క్యారెక్టర్ నాకు దక్కదని తెలిసిపోయింది.. అయితే మనసులోని మాటను ముందే ప్రస్తావించడం నాకు ఊరట కలిగించింది. లేదంటే షూటింగ్ సమయంలో నిత్యం అతని చేతిలో వేధింపులు ఎదుర్కోవాల్సి వచ్చేది. కొన్నిరోజుల తర్వాత ఆ డైరెక్టర్ ఓ టాప్ హీరోయిన్‌తో షూటింగ్ నిమిత్తం విదేశాలకు వెళ్లాడు. అక్కడ వయగ్రాను మోతాదుకు మించి వాడటంతో గుండెపోటుతో చనిపోయాడు. బహుశా కర్మ అంటే ఇదేనేమో అని లేఖ వాషింగ్టన్ వ్యాఖ్యానించారు.

లేఖ వాషింగ్టన్ వ్యాఖ్యలు తమిళ చిత్ర పరిశ్రమలో కలకలం రేపాయి. దాంతో ఆమెను కమిట్‌మెంట్ అడిగిన దర్శకుడు ఎవరు అంటూ అప్పట్లో చర్చ జరిగింది. అయితే ఆ సమయంలో తమిళ చిత్ర పరిశ్రమకు చెందిన దర్శకుడు జీవా ఓ సినిమా షూటింగ్ కోసం రష్యాకు వెళ్లగా గుండెపోటుతో కన్నుమూశారు. జయం రవి, కంగనా రనౌత్, లక్ష్మీరాయ్ లీడ్ రోల్‌‌లో జీవా తెరకెక్కించిన ధామ్ ధూమ్ మూవీ ఫైనల్ షెడ్యూల్‌లో ఉండగా ఆయన మరణించడంతో తమిళ చిత్ర పరిశ్రమ దిగ్భ్రాంతికి గురైంది. జీవా మరణానంతరం ఈ సినిమాను విడుదల చేశారు. దీంతో లేఖ వాషింగ్టన్ చేసిన వ్యాఖ్యలు జీవాను ఉద్దేశించినా అంటూ చర్చ జరిగింది.