ఫోక్ పాటలతో తెలుగు రాష్ట్రాల్లో ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న యూట్యూబ్ సెన్సేషన్ నాగదుర్గ. పల్లెటూరి జానపద గీతాలకు తన ఎనర్జిటిక్ డ్యాన్స్‌తో కోట్లాది మంది ప్రేక్షకులను అలరించింది. సోషల్ మీడియాలో భారీ ఫ్యాన్ ఫాలోయింగ్‌ను సొంతం చేసుకుంది. 'కాపోళ్ల ఇంటికాడ','ఎర్ర ఎర్రని రుమాలు గట్టి','తిన్న తిరం పడ్తలే', 'దారి పొంటొత్తుండు','జిల్లెలమ్మ జిట్ట','పేరు గళ్ల పెద్దిరెడ్డి'వంటి ఫోక్ సాంగ్స్‌తో యూట్యూబ్‌లో మిలియన్ల వ్యూస్ సాధించి ఫోక్ డ్యాన్స్‌కు కొత్త ఊపు తీసుకొచ్చింది. ముఖ్యంగా ఆమె వేసే మాస్ డ్యాన్స్ స్టెప్పులు యువతను విశేషంగా ఆకట్టుకున్నాయి. అందుకే నాగదుర్గ కొత్త పాట విడుదలైతే చాలు.. అది క్షణాల్లో ట్రెండింగ్‌లోకి చేరిపోతుంది.

Advertisement

ఫోక్ డ్యాన్సర్‌గా, సోషల్ మీడియా స్టార్‌గా గుర్తింపు తెచ్చుకున్న నాగదుర్గ ఇప్పుడు వెండితెరపై హీరోయిన్‌గా తన అదృష్టాన్ని పరీక్షించుకోనుంది. ప్రియదర్శి హీరోగా తెరకెక్కుతున్న'ఇడుపు కాగితం' సినిమాలో ఆమె కథానాయికగా నటిస్తోంది. సుకుమార్ రైటింగ్స్, బన్నీ వాసు వర్క్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాలో తెలంగాణ గ్రామీణ యువతి 'శ్రీలత'పాత్రలో నాగదుర్గ కనిపించనుంది. ఫోక్ ఆర్టిస్ట్‌గా ప్రేక్షకులను అలరించిన ఆమె.. ఇప్పుడు నటిగా కూడా తన ప్రతిభను నిరూపించుకోవాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఇదిలా ఉండగా.. ఇటీవల ఓ యూట్యూబ్ ఇంటర్వ్యూలో పాల్గొన్న నాగదుర్గ తన వ్యక్తిగత జీవితం, కెరీర్‌తో పాటు బిగ్‌బాస్ తెలుగు ఆఫర్ గురించి ఆసక్తికర విషయాలను పంచుకుంది.

Advertisement

ఇంటర్వ్యూలో యాంకర్ "మీకు బిగ్‌బాస్ ఆఫర్ వచ్చింది. కానీ ఎందుకు రిజెక్ట్ చేశారు? షో చూసి ఏమైనా భయపడ్డారా?" అని ప్రశ్నించగా.. నాగదుర్గ మాట్లాడుతూ "భయం అనేది అసలు లేదు. కానీ నేను ఆ షోకు సెట్ కాను అనిపించింది. అందుకే వెళ్లలేదు. అది నా నిర్ణయం" అని స్పష్టం చేశారు. దీంతో యాంకర్ మరో ప్రశ్న వేస్తూ.. "అంటే మీకు గొడవలు పెట్టుకోవడం రాదా?" అని అడిగారు.

దీనికి నాగదుర్గ తన వ్యక్తిత్వం గురించి చెబుతూ.. "నిజం చెప్పాలంటే నేను చాలా సైలెంట్. చాలా మొహమాటస్తురాలిని. ఎవరికైనా 'నో' చెప్పాలన్నా నాకు చాలా భయం. నా ఫీలింగ్స్ కంటే ఎదుటివారి ఫీలింగ్స్‌కే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తాను. వాళ్లు బాధపడతారేమో, ఎలా రియాక్ట్ అవుతారో అని ఎక్కువగా ఆలోచిస్తుంటాను. అదే కొన్ని సందర్భాల్లో నాకు సమస్యగా మారుతుంది. కొన్నిసార్లు ఎదుటివారిని రిజెక్ట్ చేయలేక నేనే బాధపడుతూ ఏడ్చిన సందర్భాలు కూడా ఉన్నాయి" అంటూ తన మనసులోని భావాలను బయటపెట్టారు.

Advertisement

బిగ్‌బాస్ ఆఫర్ వచ్చిన సమయంలో కుటుంబసభ్యులు ఎలా స్పందించారో కూడా నాగదుర్గ వివరించారు."అమ్మ నాతో ఒక మాట చెప్పింది. 'నువ్వు చిన్న విషయానికే ఇంత ఎమోషనల్ అవుతావు. బిగ్‌బాస్ హౌస్‌లో ఏమైనా జరిగితే ఎలా తట్టుకుంటావో ఒకసారి ఆలోచించు' అని చెప్పింది. కానీ అదే సమయంలో వెళ్లొచ్చని కూడా ప్రోత్సహించింది" అని తెలిపారు. తన తండ్రి కూడా బిగ్‌బాస్‌లో పాల్గొనాలని ప్రోత్సహించారని నాగదుర్గ చెప్పారు. "డాడీ అయితే తప్పకుండా వెళ్లమన్నాడు. కనీసం రెండు మూడు వారాలు అయినా హౌస్‌లో ఉంటే చాలు. దాంతో టీవీ ప్రేక్షకులకు మరింత దగ్గరవుతావు అని చెప్పారు. కుటుంబ సభ్యులంతా నాకు సపోర్ట్ చేశారు" అని వెల్లడించారు.

Advertisement

అయితే చివరకు తన కెరీర్ లక్ష్యాన్ని దృష్టిలో పెట్టుకుని బిగ్‌బాస్‌ను వదులుకున్నట్లు ఆమె స్పష్టం చేశారు. "ప్రస్తుతం నా ఫుల్ ఫోకస్ సినిమాలపైనే ఉంది. నేను హీరోయిన్‌గా మంచి అవకాశాలు అందుకోవాలని నిర్ణయించుకున్నాను. ఒకేసారి రెండు పనులపై దృష్టి పెట్టి ఏదీ సరిగా చేయలేనని అనిపించింది. అందుకే బిగ్‌బాస్ ఆఫర్‌ను గౌరవంగా తిరస్కరించాను. నా లక్ష్యం సినిమా కెరీర్. దానిపైనే పూర్తిగా దృష్టి పెట్టాలని నిర్ణయించుకున్నాను" అని చెప్పారు. ప్రస్తుతం నాగదుర్గ చేసిన ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.