ఎన్ని అవమానాలు ఎదురైనా సరే.. ఎంచుకున్న రంగంలో విజేతలుగా నిలిచేవారు కొందరు ఉంటారు. తమకు జరిగిన అవమానాలకు, చీత్కారాలకు ప్రతిభ ద్వారానే వీరు సమాధానం చెబుతారు. వీరిలో బాలీవుడ్ అగ్రనటి ప్రియాంక చోప్రా కూడా ఒకరు. గ్లోబల్ బ్యూటీగా అంతర్జాతీయ స్థాయిలో భారతదేశానికి పేరు తీసుకొస్తున్నారు ప్రియాంక. జూలై 18న ప్రియాంక పుట్టినరోజు. ఈ సందర్భంగా ఆమె కెరీర్, విజయాలు, సంపద, ఆస్తులు తదితర వివరాలు పరిశీలిస్తే..
జూలై 18, 1982న జంషెడ్‌పూర్‌లో జన్మించారు ప్రియాంక చోప్రా. తల్లిదండ్రులు అశోక్, మధు చోప్రా. వీరిద్దరూ ఇండియన్ ఆర్మీలో వైద్యులుగా పనిచేసేవారు. ప్రియాంకకు సిద్ధార్ధ్ అనే తమ్ముడు ఉన్నాడు. అలాగే బాలీవుడ్ హీరోయిన్లు పరిణితీ చోప్రా, మీరా చోప్రా, మన్నారా చోప్రాలు ఆమెకు కజిన్స్. తల్లిదండ్రుల ఉద్యోగరీత్యా ప్రియాంక బాల్యం ఢిల్లీ, చండీగఢ్, అంబాలా, లడఖ్, లక్నో, బరైలీ, పూణేలలో గడిచింది. 13 ఏళ్ల వయసులో అమెరికాకు వెళ్లి బంధువుల ఇంట్లో ఉండి చదువుకున్నారు. నల్లగా ఉండటంతో అక్కడ జాతి వివక్షను ఎదుర్కొన్నారు.
చదువు తర్వాత మోడలింగ్‌లోకి దిగిన ప్రియాంక చోప్రా.. 2000వ సంవత్సరంలో మిస్ ఇండియా వరల్డ్ టైటిల్ దక్కించుకుంది. అదే మిస్ వరల్డ్ కిరీటం దక్కించుకుని వార్తల్లో నిలిచారు. 2002లో తమిజాన్ అనే తమిళ చిత్రం ద్వారా వెండితెరపై హీరోయిన్‌గా అడుగుపెట్టారు ప్రియాంక చోప్రా. ది హీర్: లవ్ స్టోరీ ఆఫ్ ఏ స్పై సినిమాతో బాలీవుడ్‌లో ఎంట్రీ ఇచ్చారు. ఆ తర్వాత అందాజ్, ముజ్సే షాదీ కరోగి, ఐత్రాజ్, బ్లఫ్‌మాస్టర్, క్రిష్, డాన్, ఫ్యాషన్, కమినే, 7 ఖూన్ మాఫ్, బర్ఫీ, డాన్ 2, అగ్నిపథ్, క్రిష్ 3 తదితర సినిమాలో బాలీవుడ్‌లో అగ్రనటిగా ఎదిగారు ప్రియాంక చోప్రా. హాలీవుడ్‌లోనూ ఎంట్రీ ఇచ్చి విజయాలు సాధించారు ఈ ముద్దుగుమ్మ. సినీరంగానికి ఆమె అందించిన సేవలకు గాను భారత ప్రభుత్వం పద్మశ్రీ అవార్డ్‌తో సత్కరించింది. రెండు జాతీయ చలనచిత్ర అవార్డులు, ఐదు ఫిల్మ్‌ఫేర్ పురస్కారాలతో పాటు టైమ్ మ్యాగజైన్ ప్రకటించిన ప్రపంచంలోనే 100 మంది అత్యంత ప్రభావశీల వ్యక్తుల్లో ఒకరిగా ప్రియాంక స్థానం సంపాదించారు. ఆ తర్వాత ఫోర్బ్స్ 100 మంది శక్తివంతమైన మహిళల జాబితాలో.. 2022లో బీబీసీ 100 ఉమెన్ లిస్ట్‌లోనూ ఆమె చోటు దక్కించుకున్నారు. హాలీవుడ్ సింగర్, నటుడు నిక్ జోనాస్‌తో ప్రేమలో పడిన ప్రియాంక చోప్రా ఆయనను 2018లో వివాహం చేసుకున్నారు. ప్రియాంక కంటే నిక్ పదేళ్లు చిన్నవాడు. అయినప్పటికీ వీరిద్దరూ సంతోషంగా తమ వైవాహిక జీవితాన్ని ఎంజాయ్ చేస్తున్నారు. అయితే ప్రియాంక చోప్రాకు ఈ విజయాలన్నీ రాత్రికి రాత్రి వచ్చేయలేదు.. కెరీర్ తొలినాళ్లలో ప్రియాంక సరిగా డ్యాన్స్ చేయకపోవడంతో సీనియర్ కొరియోగ్రాఫర్ చేతుల్లో తిట్లు తిన్నారు. ఆయన సెట్‌లోనే మైక్ విసిరేసి నువ్వు మిస్ యూనివర్స్ అయితే ఎవరికి గొప్ప ముందు డ్యాన్స్ నేర్చుకోమని మండిపడ్డారు. ఈ అవమానాలను సీరియస్‌గా తీసుకున్న ప్రియాంక పట్టుదలతో డ్యాన్స్ నేర్చుకుని దేశీ గర్ల్, రామ్ చాహే లీలా వంటి పాటలలో అదిరిపోయే స్టెప్స్ వేసింది. ఇదే కాదు.. తన రంగు, రూపం కారణంగా నల్లపిల్లీ అని డస్కీ బ్యూటీ అని పిలవడంతో ఒకానొక సమయంలో ఆత్మహత్య చేసుకోవాలని కూడా అనుకున్నట్లు ఆమె పలుమార్లు తెలిపారు. అయితే అన్ని అవమానాలు భరించి ప్రియాంక చోప్రా పట్టుదలతో విజయాలు సాధించి ఈ స్థాయికి చేరుకున్నారు. పాతికేళ్ల కెరీర్‌లో ప్రియాంక చోప్రా భారీగానే ఆస్తులు కూడబెట్టారు. సినిమాల పారితోషికం, బ్రాండ్ అండార్స్‌మెంట్స్, వ్యాపారాల ద్వారా ఆమె భారీగా సంపాదిస్తున్నారు. సినిమాకు 30 కోట్ల రూపాయలకు పైగా రెమ్యునరేషన్ అందుకుంటారు ప్రియాంక చోప్రా. అలాగే బ్రాండ్ అండార్స్‌మెంట్స్‌కి కూడా భారీగానే ఛార్జ్ చేస్తున్నారట ఈ ముద్దుగుమ్మ. అలాగే అనోమాలి అనే హెయిర్ కేర్ బ్రాండ్‌తో పాటు న్యూయార్క్‌లో సోనా అనే రెస్టారెంట్ ఉంది. ఇవి కాకుండా టెక్, వెల్‌నెస్, ఫైనాన్షియల్ స్టార్టప్స్‌లో ప్రియాంక చోప్రా పెట్టుబడులు పెట్టింది. ప్రియాంకకు ముంబై, న్యూయార్క్, లాస్ ఏంజెల్స్‌లో విలాసవంతమైన బంగ్లాలు ఉన్నాయని బాలీవుడ్ టాక్. మొత్తంగా ప్రియాంక చోప్రా ఆస్తుల విలువ 600 కోట్ల పైమాటేనని అంచనా. భర్త నిక్ జోనాస్ ఆస్తుల విలువ 650 కోట్ల పైనే ఉంటుందని చెబుతున్నారు. అలా భార్యాభర్తలు ఇద్దరి సంపద కలిపితే 1250 కోట్ల పైమాటేనని సినీ వర్గాల టాక్. ప్రస్తుతం ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో మహేశ్ బాబు సరసన హీరోయిన్‌గా నటిస్తున్నారు ప్రియాంక చోప్రా. ఆమె జీవితంలో మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షిస్తోంది ఫిల్మీబీట్.More Articles