ప్రస్తుతం ఎక్కడా చూసినా మహిళలపై లైంగిక దాడులు, అత్యాచారాలు, వేధింపులు పెరిగిపోతున్నాయి. చిన్నారుల నుంచి వృద్ధుల వరకు కామాంధులు ఎవ్వరినీ వదిలిపెట్టడం లేదు. ఇక సినీరంగంలో లైంగిక వేధింపుల గురించి నిత్యం వార్తలు వస్తూనే ఉంటాయి. క్యాస్టింగ్ కౌచ్ పేరుతో రోజుకొకరి బండారం వెలుగులోకి వస్తోంది. అయితే కొందరు తారలు ఇండస్ట్రీలోకి రాకముందే లైంగిక వేధింపులకు గురైనట్లు బయటపెడుతుంటారు. తాజాగా ఈ లిస్ట్‌లోకి నటి సమీరా రెడ్డి చేరారు. కొద్దిరోజుల క్రితం ఓ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె తనకు ఎదురైన అనుభవాన్ని వెల్లడించారు. ఈ వివరాల్లోకి వెళితే..
తెలుగు తండ్రికి, కొంకణ్ తల్లికి ముంబైలో జన్మించారు సమీరా రెడ్డి. ఈమెకు మేఘన, సుష్మా అనే తోబుట్టువులు ఉన్నారు. ముంబైలోనే చదువుకున్న సమీరా రెడ్డి 2002లో మైనే దిల్ తుజ్కో దియా అనే హిందీ సినిమాతో వెండితెరపై హీరోయిన్‌గా అడుగుపెట్టారు. డర్నా మనా హై, ప్లాన్, ముసఫిర్ తదితర హిందీ సినిమాలలో సమీరా రెడ్డి నటించారు. అనంతరం 2005లో జూనియర్ ఎన్టీఆర్ హీరోగా వచ్చిన నరసింహుడు సినిమాతో టాలీవుడ్‌లో అడుగుపెట్టారు. అనంతరం జై చిరంజీవా, అశోక్ చిత్రాలలో నటించారు. అయితే అనుకున్న స్థాయిలో సక్సెస్ దక్కకపోవడంతో టాలీవుడ్‌కు ఈ ముద్దుగుమ్మ దూరమయ్యారు. పాతికేళ్ల కెరీర్‌లో హిందీ, తెలుగు, ఇంగ్లీష్, బెంగాలీ, తమిళ్, మలయాళం, కన్నడ భాషల్లో నటించారు.
మహారాష్ట్రకు చెందిన అక్షయ్ వార్దేతో 2014, జనవరి 21న సమీరా రెడ్డి పెళ్లి జరిగింది. ఈ దంపతులకు కుమారుడు హన్స్, కుమార్తె నైరా జన్మించారు. వివాహం తర్వాత భర్త, పిల్లల కోసం సినిమాలకు దూరమ్యారు ఈ నటి. 2026లో సంజయ్ దత్ హీరోగా వచ్చిన ఆఖరి సవాల్ మూవీ ద్వారా రీ ఎంట్రీ ఇచ్చారు. సినిమాలు చేయకున్నా సోషల్ మీడియాలో, సామాజిక కార్యక్రమాలలో యాక్టీవ్‌గా ఉంటూ మహిళలు, సమాజానికి సంబంధించిన విషయాలు, బ్యూటీ, ఫిట్‌నెస్ టిప్స్ చెబుతూ గడుపుతున్నారు సమీరా రెడ్డి. ఇటీవల వరుసపెట్టి ఇంటర్వ్యూలు ఇస్తున్న సమీరా రెడ్డి తన కెరీర్ తొలినాళ్లలో ఎదురైన అనుభవాలను పంచుకుంటున్నారు. హిందీ ఇండస్ట్రీలో నిలదొక్కుకోవాలంటే ఖరీదైన వస్తువులు, బట్టలు ధరించాలని కొందరు చెప్పడంతో తన సంపాదనలో అత్యధిక శాతం వాటికే ఖర్చు చేశానని సమీరా తెలిపారు. బాలీవుడ్ సినిమాలలో హీరోలతో సమానంగా కనిపించేందుకు గాను ఓవర్‌గా మేకప్ వేసేవారని .. దీని వల్ల తన ముఖం బూడిద రంగులో కనిపించేది. తన స్కిన్ టోన్, శరీరాకృతి, హైట్ తదితర అంశాలపై ట్రోలింగ్‌కు గురయ్యానని.. ప్రతి విషయంలోనూ మహిళా నటులను విమర్శించే పరిస్థితి ఉండేదని సమీరా రెడ్డి పేర్కొన్నారు. ఇక చిన్న వయసులోనే తాను లైంగిక వేధింపులను ఎదుర్కొన్నానని ఈ ముద్దుగుమ్మ బయటపెట్టారు. స్కూల్‌లో చదువుకుంటున్న సమయంలో ముంబైలోని బాంద్రా ప్రాంతంలో నడుచుకుంటూ వస్తుండగా సైకిల్ మీద వచ్చిన ఓ కుర్రాడు తన ఛాతీపై కొట్టి వెకిలిగా నవ్వుతూ పైశాచిక ఆనందం పొందాడు. ఊహించని ఘటనతో షాకైన నేను తర్వాత తేరుకుని అతనిని వెంబడించి సైకిల్ మీది నుంచి కిందకి తోసేసి చితక్కొట్టా. తల్లిదండ్రులు చిన్నతనం నుంచే పిల్లలకు లైంగిక చర్యలపై అవగాహన కల్పించాలని సమీరా రెడ్డి పేర్కొన్నారు. ప్రస్తుతం ఆమె వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా సమీరా రెడ్డి ధైర్యానికి నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు.More Articles