మత్తెక్కించే చూపులతో, తన ఒంపు సొంపులతో ఒక తరాన్ని ఉర్రూతలూగించారు సిల్క్ స్మిత. హీరోలను మించిన స్టార్‌డమ్‌తో, క్రేజ్‌తో బాక్సాఫీస్‌ను షేక్ చేశారు సిల్క్ స్మిత. జీవితంతో ఎన్నో కష్టాలను, అవమానాలను భరించి చిత్ర సీమలో ధ్రువతారగా వెలుగొందారు ఈ ముద్దుగుమ్మ. ఎవరెస్ట్‌ స్థాయి నుంచి అథ: పాతాళానికి పడిపోయి, అయినవాళ్ల మోసంతో, ఒంటరితనంతో మానసిక క్షోభను అనుభవించి బలవన్మరణానికి పాల్పడ్డారు. చిన్న వయసులోనే తిరిగిరాని లోకాలకు తరలివెళ్లిన ఈ నటి.. అభిమానులకు తీరాన్ని విషాదాన్ని మిగిల్చారు. మరణించి 30 ఏళ్లు గడుస్తున్నా నేటికీ సిల్క్ స్మిత క్రేజ్ ఏ మాత్రం తగ్గలేదంటే సినీ రంగంపై ఆమె వేసిన ముద్ర ఎలాంటిదో అర్ధం చేసుకోవచ్చు. అయితే సిల్క్ స్మిత మరణించడానికి ఒకరోజు ముందు రాసినట్లుగా చెబుతున్న ఓ సూసైడ్ నోట్ సోషల్ మీడియాలో ప్రస్తుతం చక్కర్లు కొడుతోంది. ఈ వివరాల్లోకి వెళితే..

పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరుకు చెందిన సిల్క్ స్మిత అసలు పేరు వడ్లపాటి విజయలక్ష్మీ. 14 ఏళ్ల వయసులోనే పెళ్లి చేసుకుని అత్తారింటిలో అడుగుపెట్టారు సిల్క్. అయితే అత్తమామలు, భర్త నుంచి వేధింపులు, సూటిపోటీ మాటలతో నరకం చూశారు. చివరికి ఓపిక నశించి ఇల్లు వదిలి మద్రాస్ చేరుకున్నారు. పొట్టకూటి కోసం తొలుత టచ్ అప్ ఆర్టిస్ట్‌గా పనిచేస్తూ.. సినిమాలలో చిన్నా చితకా పాత్రలలో నటిస్తూ వచ్చారు సిల్క్ స్మిత. మలయాళ దర్శకుడు ఆంటోనీ ఈస్ట్‌మన్‌తో పరిచయంతో సిల్క్ స్మిత జీవితం మలుపు తిరిగింది. విజయలక్ష్మీ అనే పేరును సిల్క్ స్మితగా మార్చుకుని వాంప్ రోల్స్, క్లబ్ డ్యాన్సర్‌గా అవతారమెత్తి ప్రేక్షకులను ఉర్రూతలూగించారు.

స్టార్ హీరోల సినిమాలైనా సరే ఆవిడ ఐటెం సాంగ్స్ ఉండాల్సిందే అన్నంతగా గుర్తింపు తెచ్చుకున్నారు సిల్క్ స్మిత. పదేళ్లు తిరిగేసరికి దాదాపు 450కి పైగా సినిమాలలో నటించి ఆశ్చర్యపరిచారు. ఒకప్పుడు తినడానికి తిండి లేని స్థాయి నుంచి లగ్జరీ లైఫ్‌స్టైల్‌కు ఆమె మారారు. ఆమె రేంజ్ ఎలా ఉండేదంటే నోట్ల కట్టలు పరిచిన పరుపులపై పడుకునేది. ఆ రోజుల్లో చెన్నైలోని ఖరీదైన ఇంట్లో అన్ని సౌకర్యాలతో వెలుగొందారు. స్టార్ హీరోలు సైతం ఆమె వైభవాన్ని చూసి ముక్కున వేలేసుకునేవారు.

అయితే రోజులెప్పుడూ ఒకేలా ఉండవని అంటారు.. అయినవాళ్లు మోసం చేయడం, ప్రేమ విఫలం కావడం, నిర్మాతగా మారి నిర్మించిన చిత్రాలు అట్టర్ ఫ్లాప్ కావడంతో ఆర్ధిక సమస్యలు చుట్టుముట్టడంతో సిల్క్ స్మిత ఉక్కిరిబిక్కిరి అయ్యారు. ఈ క్రమంలో తీవ్ర మనస్తాపానికి గురై తాగుడికి బానిసగా మారి డిప్రెషన్‌లోకి వెళ్లిన సిల్క్ స్మిత 1996 సెప్టెంబర్ 23న చెన్నైలో ఆత్మహత్య చేసుకున్నారు. చనిపోయే నాటికి ఆమె వయసు కేవలం 35 సంవత్సరాలే కావడం దురదృష్టకరం.

తాజాగా మరణానికి ముందురోజు సిల్క్ స్మిత రాసినట్లుగా చెబుతున్న ఓ సూసైడ్ నోట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆ లేఖ యథాతథంగా.. అభాగ్యురాలు 22/9/1996 దేవుడా, నా 7వ సంవత్సరం నుంచి నా పొట్టకి కష్టపడ్డాను. నాకు నావారు అంటూ ఎవరూ లేరు. నేను నమ్మిన వారు నన్ను మోసం చేసారు. బాబు తప్ప నామీద ఎవరు ప్రేమ చూపలేదు. ఎవ్వరికీ నామీద ప్రేమలేదు. బాబు తప్పితే అందరూ నా కష్టం తిన్నవారే. నా నాశనం కోరారు. ఎవ్వరికీ విశ్వాసం లేదు. జీవితంలో నాకు అందరిలాగే కోరికలు ఉన్నాయి. కానీ నాచుట్టూ ఉన్నవాళ్లు నాకు మనశాంతి లేకుండా చచ్చిపోయేట్లు చేశారు. ఇంత సాధించినా నాకు మనశాంతి లేకుండా చేశారు. అందరికి మంచి చేశాను. కానీ నా జీవితం ఇలా చేశారు. ఏమి న్యాయమిది. నాకు ఉన్న ఏ కొంచెమైనా బాబు కుటుంబానికి, నా కుటుంబానికి పంచవలెను.

నా ఆశలన్నీ ఒకరిమీద పెట్టుకున్నా. అతను నన్ను మోసం చేసాడు. దేవుడుంటే వాడే చూసుకుంటాడు. రాము, రాధాకృష్ణన్ నన్ను రెచ్చగొట్టారు. వారికి ఎంతో మేలు చేశాను. కానీ వారు నాకు చేసింది దారుణం. నా రెక్కల కష్టం తినని వారు లేరు. అయినా ఎవరికి విశ్వాసం లేదు, బాబుకి తప్ప. నాకు ఒకడు 5 సంవత్సరాల క్రితం జీవితం ఇస్తానన్నాడు. ఇప్పుడు ఇవ్వనంటున్నాడు. నా జీవితంలో ఎంతో భరించాను. కానీ ఇది నావల్ల కావడం లేదు. ఇది రాయడానికి ఎంత నరకం పడ్డానో నాకే తెలియును' అని సిల్క్ స్మిత బాధతో రాసుకొచ్చారు. ఆ తర్వాతి రోజే ఆమె కోట్లాది మంది అభిమానులను విషాదంలో ముంచెత్తుతూ బలవన్మరణానికి పాల్పడ్డారు. అయితే సిల్క్ స్మిత మరణం చుట్టూ ఎన్నో అనుమానాలు, వాదనలు ఉన్నాయి. ఏది ఏమైనా తన అందం, డ్యాన్స్‌తో ప్రేక్షకులను ఒక ఊపు ఊపిన సూపర్‌స్టార్ తిరిగిరాని లోకాలకు తరలిపోయారు.