కొందరు నటీనటులు కెరీర్‌లో ఉన్నత స్థానానికి చేరుకున్నప్పటికీ తాము ఎక్కడి నుంచి వచ్చాము, తమని ఎవరు ఈ స్థానానికి తీసుకొచ్చారు అన్న సంగతిని మరిచిపోయి దారుణంగా ప్రవర్తిస్తుంటారు. దక్షిణాది చిత్ర పరిశ్రమ నుంచి కెరీర్ ప్రారంభించి నేడు భారతీయ చిత్ర పరిశ్రమలో అగ్ర హీరోయిన్లుగా వెలుగొందుతున్న వారెందరో. బాలీవుడ్ సూపర్‌స్టార్స్ ఐశ్వర్య రాయ్, దీపిక పదుకొణె, ప్రియాంక చోప్రా, కృతి సనన్ వంటి వారే కాదు.. పాత తరంలో శ్రీదేవి, జయప్రద, హేమామాలిని, రేఖ వంటి వారు దక్షిణాది నుంచి వెళ్లి బాలీవుడ్‌లో జయకేతనం ఎగురవేశారు.

Advertisement
Advertisement

తమ కెరీర్‌కు అండగా నిలిచిన దక్షిణాది ఇండస్ట్రీ గురించి వీరంతా గొప్పగా చెప్పినవారే.. అయితే కొందరు మాత్రం ఏరు దాటాక తెప్ప తగలేసిన చందంగా ప్రవర్తిస్తుంటారు. రాధిక ఆప్టే, ఇలియానా, తాప్సీ పన్ను వంటి ముద్దుగుమ్మలు దక్షిణాదిలో టాప్ హీరోయిన్‌లుగా వెలుగొంది ఆ తర్వాతే బాలీవుడ్‌లో అడుగుపెట్టారు. కానీ హిందీకి వెళ్లాక మాత్రం.. సౌత్ ఇండస్ట్రీపై దారుణంగా మాట్లాడారు. తాజాగా ఈ లిస్ట్‌లో చేరారు మిల్కీబ్యూటీ తమన్నా భాటియా. ఈ వివరాల్లోకి వెళితే..

తమన్నా భాటియా చిన్న వయసులోనే హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చారు. శ్రీ మూవీతో తెలుగువారిని పలకరించిన ఆమె.. ఆ తర్వాత హ్యాపీడేస్, రచ్చ, కొంచెం ఇష్టం కొంచెం కష్టం, 100% లవ్, ఎందుకంటే ప్రేమంట, బాహుబలి సిరీస్, సైరా నర్సింహారెడ్డి, ఎఫ్ 2, ఎఫ్ 3 తదితర సినిమాలతో స్టార్ హీరోయిన్ అనిపించుకున్నారు. తెలుగుతో పాటు తమిళ్, మలయాళం, కన్నడ తదితర సినిమాలలోనూ నటించారు. అందం, అభినయంతో పాటు తన డ్యాన్సింగ్ స్కిల్స్‌తో కోట్లాది మంది అభిమానులను సంపాదించుకున్నారు. హీరోయిన్‌గానే కాకుండా ఐటెం సాంగ్స్‌లోనూ నటించి అందాల విందు చేసింది తమన్నా.

Advertisement

ఈ తరంలో 20 ఏళ్ల కెరీర్ పూర్తి చేసుకున్న అతికొద్ది హీరోయిన్లలో ఒకరిగా తమన్నా భాటియా నిలిచారు. ప్రస్తుతం దక్షిణాదిని వదిలేసి పూర్తిగా హిందీ సినిమాలకే అంకితమయ్యారు ఈ ముద్దుగుమ్మ. హిందీలో వివాన్ ఫోర్స్ ఆఫ్ ది ఫారెస్ట్, వి శాంతారామ్ బయోపిక్, రాగిణి 3, జగన్ శక్తి, రోహిత్ శెట్టి సినిమాలలో తమన్నా నటిస్తున్నారు. ఇవి కాకుండా మరిన్ని ప్రాజెక్ట్‌లు చర్చల దశలో ఉన్నాయి. తన సంపాదనను తెలివిగా పెట్టుబడుల వైపు మళ్లిస్తూ.. వ్యాపారవేత్తగానూ రాణించి ఎంతోమందికి ఆదర్శంగా నిలుస్తున్న తమన్నా భాటియా తాజాగా చేసిన వ్యాఖ్యలు మాత్రం వివాదాస్పదమయ్యాయి.

Advertisement

ఫోర్బ్స్ ఇండియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో మిల్కీబ్యూటీ మాట్లాడుతూ.. హిందీ పరిశ్రమలో ఒక నటిగా ఆయా పాత్రల్ని ఎంచుకునే వెసులుబాటు ఉంటుందని నా అభిప్రాయం. పాటలు, డ్యాన్స్‌పై ఆసక్తిలేని.. వాటిలో అంతగా రాణించలేని నటుల్ని కూడా చూస్తుంటాం. కానీ పాత్రలను పోషించే విషయంలో మాత్రం అద్భుతంగా రాణిస్తారు. బాలీవుడ్‌లో గ్లామరస్ రోల్స్, డ్యాన్స్, నటన ఇలా ఎవరికి ఏది ఇష్టమో దానిని నటీనటులు ఎంపిక చేసుకోవచ్చు. కానీ నేను దక్షిణాది చిత్ర పరిశ్రమలో ఎంట్రీ ఇచ్చినప్పుడు నాకు ఒక విషయం అర్ధమైంది... ఇక్కడ పురుషాధిక్యత , సినిమాను భిన్నంగా చూడటం ఏదైనా సరే హీరోయిన్లకు కొన్ని పరిమితులు ఉన్నాయని తమన్నా తెలిపారు.

Advertisement

దక్షిణాది చిత్రాల్లో సంగీతానికి, పాటలకు ప్రాముఖ్యత ఎక్కువ. ఈ తరహా సినిమాలలో నటించాలంటే ప్రత్యేకమైన స్టార్ క్వాలిటీ ఉండాలని అర్ధం చేసుకున్నా. సౌత్‌లో ప్రేక్షకులను అలరించాలంటే కమర్షియల్ అంశాలు కూడా కీలకం. ఆ కోణంలో చూస్తే .. ఇలాంటి సినిమాలు చేసే నటీనటుల విషయంలో కఠినమైన ఆంక్షలు ఉంటాయని నా వ్యక్తిగత అభిప్రాయం. ఇతరుల విషయంలో ఇది పూర్తి భిన్నంగా ఉండొచ్చు. అయితే దాదాపు 10 నుంచి 15 ఏళ్లుగా కెరీర్‌ను కొనసాగించే హీరోయిన్లు అనివార్యంగా నటనకు ప్రాధాన్యత ఉన్న పాత్రలతో పాటు కమర్షియల్ సినిమాల్లోని గ్లామర్, డ్యాన్స్‌ విషయంలోనూ సమతుల్యత పాటించాల్సి ఉంటుంది అని తమన్నా భాటియా అభిప్రాయపడ్డారు. ప్రస్తుతం ఆమె వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా.. నువ్వు కూడా వారిలాగే మాట్లాడుతున్నావంటూ నెటిజన్లు ఏకీపారేస్తున్నారు.