తల్లి కావడం అనేది ప్రతి మహిళ జీవితంలో ఓ అందమైన కల. ఆ కలను నిజం చేసుకోవడానికి ఓ సినీ నటి 8 ఏళ్లు నిరీక్షించాల్సి వచ్చిందట. ఒకటి కాదు.. రెండు కాదు.. 5 సార్లు ఐవీఎఫ్ చికిత్స చేయించుకుందట. 1000కిపైగా ఇంజెక్షన్లు, రెండు గర్భస్రావాలు.. ఇన్ని కష్టాలు భరించిన తర్వాతే ఆమె మాతృత్వాన్ని ఆస్వాదించింది. తన జీవితంలో ఎదుర్కొన్న ఆ బాధాకరమైన ప్రయాణాన్ని తాజాగా బహిరంగంగా పంచుకున్నారు. ఇంతకీ ఆ నటి ఎవరు? ఆమె చెప్పిన హృదయవిదారక నిజాలేంటి?

Advertisement
Advertisement

ఆ నటి ఎవరో కాదు.. సినీ నటి, మోడల్ తేజస్విని కొల్హాపురి.. ఈ అమ్మడు ప్రముఖ నటి పద్మిని కొల్హాపురి సోదరి. అలాగే బాలీవుడ్ స్టార్ శ్రద్ధా కపూర్, నటుడు సిద్ధాంత్ కపూర్లకు మేనత్త. టెలివిజన్, థియేటర్, ఇండిపెండెంట్ సినిమాల్లో నటిగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించారు. 'ముఝే చాంద్ చాహియే' టీవీ సీరియల్‌తో కెరీర్ ప్రారంభించిన ఆమె, రావణ్' (2010), 'అగ్లీ' (2013), 'దాదీ కీ షాదీ' వంటి సినిమాల్లో నటించారు. తాజాగా తన వ్యక్తిగత జీవితంలోని అత్యంత బాధాకరమైన అధ్యాయాన్ని బయటపెట్టారు.

సాధారణంగా సెలబ్రిటీలు తమ వ్యక్తిగత కష్టాల గురించి పెద్దగా మాట్లాడరు. కానీ, తేజస్విని మాత్రం తాను తల్లి కావడానికి ఎదుర్కొన్న శారీరక, మానసిక వేదనను ఎలాంటి మొహమాటం లేకుండా పంచుకున్నారు. ఇటీవల సిద్ధార్థ్ కన్నన్ పోడ్‌కాస్ట్‌లో పాల్గొన్న ఆమె.. ఐవీఎఫ్ (IVF)చికిత్స కోసం ఐదు సార్లు ప్రయత్నించానని, ఆ ప్రయాణంలో వెయ్యికిపైగా ఇంజెక్షన్లు తీసుకోవాల్సి వచ్చిందని, రెండు సార్లు గర్భస్రావం కూడా జరిగిందని భావోద్వేగంగా వెల్లడించారు.

Advertisement

తేజస్విని మాట్లాడుతూ.. తాను మొత్తం ఐదు సార్లు ఐవీఎఫ్ చికిత్స చేయించుకున్నట్లు చెప్పారు. మొదటి రెండు ప్రయత్నాలు చాలా కఠినంగా అనిపించాయని, తర్వాతి ప్రయత్నాలకు మానసికంగా అలవాటు పడినా, ప్రతి దశలోనూ తీవ్రమైన ఒత్తిడిని ఎదుర్కొన్నానని చెప్పారు. వారం, పదిరోజులకోసారి ఆసుపత్రికి వెళ్లి ఇంజెక్షన్లు తీసుకోవడం, పరీక్షలు చేయించుకోవడం, ఫలితాల కోసం ఎదురుచూడడం ఎంతో బాధాకరమైన అనుభవమని వివరించారు.

వెయ్యికి పైగా ఇంజెక్షన్లు..
ఐవీఎఫ్ చికిత్సలో భాగంగా 1000కిపైగా హార్మోన్ ఇంజెక్షన్లు తీసుకోవాల్సి వచ్చిందని తేజస్విని వెల్లడించారు. ఆ ఇంజెక్షన్ల ప్రభావంతో తన శరీరాకృతి పూర్తిగా మారిపోయిందని చెప్పారు. "ఇంతకుముందు నేను ఎలా ఉండేదాన్నో, ఇప్పుడు పూర్తిగా వేరే వ్యక్తిలా మారిపోయాను. మానసికంగా మాత్రం చాలా బలంగా తయారయ్యాను. కానీ శారీరకంగా చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నాను" అని ఆమె పేర్కొన్నారు. ఐవీఎఫ్ ప్రయాణంలో అత్యంత బాధాకరమైన విషయం రెండు గర్భస్రావాలు అని తేజస్విని చెప్పారు.

Advertisement

ప్రతి ప్రయత్నం విఫలమైనప్పుడు ఆశలు కూలిపోతాయని, ముఖ్యంగా మిస్క్యారేజీల తర్వాత మానసికంగా పూర్తిగా విరిగిపోయానని అన్నారు. అయినప్పటికీ ఆశను వదలకుండా మళ్లీ ప్రయత్నించానని తెలిపారు. చివరకు ఐదో ఐవీఎఫ్ ప్రయత్నం విజయవంతమైందనీ, తాను తల్లి అయ్యానని ఆనందం వ్యక్తం చేశారు.

ఫిల్మ్‌మేకర్, నటుడు పంకజ్ సరస్వత్ ను వివాహం చేసుకున్న తేజస్వినికి పెళ్లైన ఎనిమిదేళ్ల తర్వాత సంతానం కలిగింది. 2015 జనవరి 30న వారి కుమార్తె వేదిక జన్మించింది. ఎన్నో కష్టాల తర్వాత పుట్టిన బిడ్డ కావడంతో ఆ రోజు తన జీవితంలో మరచిపోలేని రోజుగా నిలిచిపోయిందని ఆమె చెప్పారు. తన అనుభవాన్ని పంచుకుంటూ యువ దంపతులకు కూడా తేజస్విని ఒక సలహా ఇచ్చారు. "సాధ్యమైనంత వరకు 35 ఏళ్లలోపే పిల్లల కోసం ప్లాన్ చేసుకోవాలి. నేను చాలా ఆలస్యంగా నిర్ణయం తీసుకున్నాను. అందుకే ఇంత కష్టమైన ప్రయాణం చేయాల్సి వచ్చింది" అని అన్నారు.