భానురేఖ గణేశన్ అంటే గుర్తుకురాకపోవచ్చు కానీ హిందీ నటి రేఖ అంటే ఠక్కున గుర్తుపట్టేస్తారు ప్రేక్షకులు. 60 ఏళ్లకు పైగా కెరీర్‌లో భారతీయ చిత్ర పరిశ్రమలో తనదైన ముద్రవేశారు రేఖ. దక్షిణాది నుంచి వెళ్లి హేమాహేమీలున్న బాలీవుడ్‌లో జెండా పాతి లేడీ సూపర్‌స్టార్‌గా ఓ వెలుగు వెలిగారు రేఖ. తన నటన, అందంతో ఒక తరంలో కుర్రాళ్లకు కలల రాకుమారిగా వెలుగొందారు ఈ నట దిగ్గజం. 70 ఏళ్లు దాటినా ఇప్పటికీ చెక్కుచెదరని గ్లామర్‌తో మెరిసిపోతున్నారు రేఖ.

Advertisement
Advertisement

తమిళ నట దిగ్గజం జెమినీ గణేశన్, నటి పుష్పవల్లి దంపతులకు అక్టోబర్ 10, 1954న మద్రాస్‌లో జన్మించారు రేఖ. ఆమె పూర్తి పేరు భానురేఖ గణేశన్. అయితే వివాహ బంధం లేకుండానే రేఖను వీరిద్దరూ కనడంతో ఆమెను ఇరుగు పొరుగు సూటిపోటి మాటలతో అవమానించారు. చిన్న వయసులో ఈ నిందలను భరించారు రేఖ. చెన్నైలోనే చదువుకున్న రేఖ. 4 ఏళ్ల వయసులోనే వేదాంతం రాఘవయ్య దర్శకత్వంలో వచ్చిన ఇంటి గుట్టు అనే సినిమాలో బాలనటిగా రేఖ ఎంట్రీ ఇచ్చారు. అనంతరం 1969లో ఆపరేషన్ జాక్‌పాట్ నల్లి సీఐడీ 999 అనే కన్నడ సినిమాతో హీరోయిన్‌గా అడుగుపెట్టారు రేఖ. 1970లో సవాన్ భాదో అనే చిత్రంతో హిందీ ఇండస్ట్రీలో ఎంట్రీ ఇచ్చారు.

Advertisement

కానీ 14 ఏళ్ల వయసుకే నల్లగా, లావుగా ఉందని నాటి బాలీవుడ్ సినీ పత్రికలు రేఖను అవహేళన చేశాయి. దీనికి తోడు హిందీ రాకపోవడంతో ఆమె కష్టాలు మరింత రెట్టింపు అయ్యాయి. వీటిని సవాళ్లుగా తీసుకున్న రేఖ.. నాజూకుగా మారడంతో పాటు కష్టపడి హిందీ నేర్చుకుంది. గ్లామర్, నటన, డ్యాన్స్ ఇలా ఎక్కడా తగ్గకుండా తన హవా చూపించడంతో పాటు సినిమాలు వరుస హిట్స్ కావడంతో అనతి కాలంలోనే స్టార్ హీరోయిన్ అనిపించుకున్నారు రేఖ. నటిగా సక్సెస్ అయిన రేఖకు వ్యక్తిగత జీవితం మాత్రం కన్నీటినే మిగిల్చింది.

Advertisement

తొలుత నాటి అగ్రహీరో జితేంద్రను పెళ్లాడాలని భావించింది. కానీ ఆయన మాత్రం శోభను వివాహం చేసుకున్నారు. ఆ తర్వాత వినోద్ మెహ్రాకు దగ్గరైంది.. ఆయనను దక్కించుకోలేక ఆత్మాహత్యాయత్నం కూడా చేసిందని నాడు పత్రికలు కోడై కూశాయి. అనంతరం కిరణ్ కుమార్, అమితాబ్ బచ్చన్, ముఖేష్ అగర్వాల్‌తో ప్రేమాయణం సాగించింది రేఖ. అన్నింటిలోకి రేఖ- అమితాబ్ బచ్చన్ మధ్య రిలేషన్ ఇండస్ట్రీని కుదిపేసింది. వీరిద్దరూ రహస్యంగా పెళ్లి చేసుకున్నట్లుగా కూడా వార్తలు వచ్చాయి. చివరికి జయా బచ్చన్ రాకతో రేఖకు దూరమయ్యారు అమితాబ్.

Advertisement

అయితే రేఖ ఎంట్రీతోనే బాలీవుడ్‌లో యోగా, వర్కవుట్స్ వంటివి వచ్చాయి. మేకప్ గురించి స్వయంగా కోర్స్ నేర్చుకుని వచ్చిన రేఖ వాటిని తూచా తప్పకుండా పాటించేది. సినిమాలలో స్టిల్ ఫోటోలకు బదులుగా ప్రత్యేకంగా ఫోటో షూట్స్‌కు శ్రీకారం చుట్టిన ఘనత రేఖదే. ఆమె చూపించిన దారిలో సహచర నటీనటులే కాదు తర్వాతి తరం హీరోయిన్లు కూడా ఫాలో అయ్యారు. 1990లో ఢిల్లీకి చెందిన వ్యాపారవేత్త ముఖేష్ అగర్వాల్‌ను రేఖ పెళ్లాడారు. అయితే పెళ్లయిన ఏడు నెలలకే ముఖేష్ తన నివాసంలో ఆత్మహత్య చేసుకోవడం భారతీయ చిత్ర పరిశ్రమను కుదిపేసింది.

Advertisement

ముఖేష్ మరణం నుంచి కోలుకోవడానికి రేఖకి చాలా కాలమే పట్టింది.. ఈ ఘటన తర్వాత ఆమె పెళ్లికి దూరమై ఒంటరిగా మిగిలిపోయారు. భర్త, పిల్లలు, ఇతర కుటుంబ బంధాలు లేకుండా సోలోగా జీవితాన్ని సాగిస్తున్నారు. 60 ఏళ్లకు పైగా కెరీర్‌లో 200కు పైగా సినిమాలలో నటించిన రేఖకు ముంబైతో పాటు దేశ, విదేశాల్లో విలువైన ఆస్తులు ఉన్నాయి. వీటి విలువ దాదాపు 1000 కోట్ల రూపాయల పైమాటే. మరి వారసులు, ఇతర కుటుంబ సభ్యులు లేనందున ఈ ఆస్తి ఎవరికి చెందుతుంది? అంటూ మీడియాలో రకరకాల కథనాలు వస్తున్నాయి. తొలి నుంచి సామాజిక సేవా కార్యక్రమాలలో ముందుండే రేఖ.. తను స్వయంగా ట్రస్ట్ నిర్వహిస్తున్నారు. తన మరణానంతరం ఆస్తి మొత్తం ట్రస్ట్‌కు చెందేలా నిర్ణయం తీసుకున్నారట. అలాగే తనకు ఏళ్లుగా తోడు నీడగా వ్యవహరించిన ఫర్జానా అనే మిత్రురాలికి కొంత భాగం ఇస్తారని బాలీవుడ్ మీడియా పేర్కొంది.