లెజెండరీ సింగర్ ఎస్ జానకి మరణం కోట్లాది మంది సంగీత ప్రియులను, సినీ అభిమానులను తీవ్ర దిగ్బ్రాంతికి గురి చేసింది. నాలుగు దశాబ్దాలకుపైగా తన పాటలతో ఊర్రూతలూగించిన ప్రఖ్యాత గాయని తిరిగి రానిలోకాలకు వెళ్లిపోవడాన్ని ఆమెను ఆరాధించే వారు జీర్ణించుకోలేకపోతున్నారు. ఆమె మరణం తీరని లోటు అంటూ కంటతడి పెడుతూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అయితే ఎన్నో ఏళ్లుగా జానకితో సంగీత బంధాన్ని కొనసాగించిన ప్రఖ్యాత గాయని పీ సుశీల ఆవేదనను వ్యక్తం చేస్తూ వీడియోను రిలీజ్ చేశారు. జానకీ గారి మరణం తర్వాత ఆమె చేసిన కామెంట్స్ ఇప్పుడు ఇండస్ట్రీలో సర్వత్రా చర్చనీయాంశమయ్యాయి. పీ సుశీల వీడియోలో చెప్పిన విషయాలు ఏమిటి? అనే వివరాల్లోకి వెళితే..
తెలుగు, తమిళ, కన్నడ, ఇతర భారతీయ భాషల్లో 20 వేలకుపైగా పాటలు పాడిన నైటింగేల్ జానకి శనివారం సాయంత్రం కన్నుమూశారు. అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె మైసూరులోని ఓ ప్రైవేట్ హాస్పిటల్‌లో తుదిశ్వాస విడిచారు. ఆమె అంత్యక్రియలు ఆదివారం సాయంత్రం కర్ణాటక ప్రభుత్వ లాంఛనాలతో మైసూరులో నిర్వహించారు. ఎంతో మంది అభిమానులు ఆమెకు ప్రగాఢమైన శ్రద్దాంజలి ఘటించారు.
పీ సుశీల వీడియోను రిలీజ్ చేసి.. సంగీత ప్రపంచంలో జానకీ గారు పర్వతం లాంటి వారు. తన కెరీర్‌లో సంగీత ప్రపంచాన్ని తన ప్రతిభతో గడగడలాడించింది. ఆమెను దెబ్బ మీద దెబ్బ కొట్టి ఈ లోకం నుంచి తీసుకెళ్లారు. ఆమె ఎన్ని రకాలుగా పాడుతుందో ఎవరూ ఊహించలేదు. ఆమె నాకంటే గొప్ప గాయని. అందుకే నా కంటే ముందే అవార్డు ఇచ్చారు. నా జీవితంలో అది మరిచిపోలేనిది. మనం తెలియకుండానే పుడుతాం.. తెలియకుండానే ఆగిపోతాం అని సుశీల ఆవేదన వ్యక్తం చేశారు. జానకి లాంటి గాయని మళ్లీ పుట్టలేరు. ఆ స్థాయికి రావడం కష్టం. నా కంటె గొప్ప గాయని.. ఎన్నో రకాల పాటలు పాడారు. ఎన్నో గొంతుకలతో ఆమె సంగీత ప్రియులను ఆకట్టుకొన్నారు. ఆడియెన్స్‌ను ఎలా ఆకట్టుకోవాలో తనకు తెలుసు. మేమంత ఉత్సవ విగ్రహాలుగానే ఉండే వాళ్లం. నా సిస్టర్ జానకి లేరంటే నమ్మలేకపోతున్నాం. ఏడ్వడానికి కన్నీళ్లు రావడం లేదు. ఇక్కడ కచేరి చేయాలని ఆమెను సరస్వతి దేవీ పిలిచి ఉంటారేమో. ఇలాంటి అదృష్టం ఎవరికి కలగదు అని సుశీల అన్నారు. బతికి ఉన్ననాళ్లు మా ఇద్దరి మధ్య విభేదాలు సృష్టించడానికి కుట్రలు పన్నారు. నా మీద ఆవిడకు, ఆవిడ మీద నాకు చెప్పి.. కొందరు మనుషులు ఏడిపించుకుతిన్నారు. అలాంటి వారికి కళ్లు చల్లబడ్డాయనుకొంటాను. ఏం సాధించాం? పుట్టించినందుకు ఏదో సాధించాలి. ఆమె అన్నీ సాధించింది. పరిపూర్ణ జీవితాన్ని ఆస్వాదించింది. ఆమెకు మరణం లేదు. ఎంతో మందికి ఇలాంటి గౌరవం దక్కదు. ఎక్కడ ఉన్నా ప్రశాంతంగా, చల్లగా సరస్వతి దేవత పక్కన ఉండాలి అని కోరుకొంటున్నాను అని తీవ్ర వేదన చెందారు.More Articles