Lenin Movie Public Talk: అక్కినేని అఖిల్ చాలా కాలంగా సాలిడ్ హిట్ కోసం ఎదురుచూస్తున్నాడు. విభిన్న కథలు, వేర్వేరు జోనర్లలో సినిమాలు చేసినా.. ఆయనకు ఆశించిన స్థాయి బ్లాక్‌బస్టర్ విజయం మాత్రం ఇంకా దక్కలేదు. తాజాగా అక్కినేని అఖిల్ .. లెనిన్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ప్రేమ, భక్తి అంశాలతో రూపొందిన రూరల్ యాక్షన్ డ్రామాకు మురళీ కిషోర్ అబ్బూరు దర్శకత్వం వహించారు. అక్కినేని నాగార్జున, సూర్యదేవర నాగవంశీ సంయుక్తంగా మనం ఎంటర్‌ప్రైజెస్ LLP, సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్లపై ఈ సినిమాను ప్రతిష్టాత్మకంగా నిర్మించగా, అన్నపూర్ణ స్టూడియోస్ సమర్పించింది.
అక్కినేని అఖిల్ సరసన భాగ్యశ్రీ బోర్స్లే నటించగా.. శివాజీ, రాజీవ్ కనకాల, బ్రహ్మాజీ, సునీల్, రమేశ్ ఇందిరా తదితరులు కీలక పాత్రలు పోషించారు. సాంకేతిక విభాగంలో లియోన్ బ్రిట్టో సినిమాటోగ్రఫీ అందించగా, ఎస్. థమన్ సంగీతం సమకూర్చారు. నవీన్ నూలీ ఎడిటింగ్ బాధ్యతలు నిర్వహించారు. దిలీప్ సుబ్బరాయన్, రామ్-లక్ష్మణ్, విజయ్, రియల్ సతీష్ యాక్షన్ సన్నివేశాలను రూపొందించగా, అవినాష్ కొల్ల ప్రొడక్షన్ డిజైనర్‌గా వ్యవహరించారు. భారీ అంచనాల మధ్య ఈ సినిమా జూలై 10న (ఇవాళ) ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా థియేటర్లలో విడుదలైంది. ఈ నేపథ్యంలో లెనిన్ సినిమాపై పబ్లిక్ టాక్ (Lenin Movie Public Talk)ఎలా ఉందనే విషయాన్ని పరిశీలిస్తే..
'లెనిన్' సినిమాకు ప్రేక్షకుల నుంచి ఎక్కువగా పాజిటివ్ టాక్ వినిపిస్తోంది. మొదటి షో ముగిసిన తర్వాత థియేటర్ల బయట ప్రేక్షకులు తమ అభిప్రాయాలను వెల్లడిస్తున్నారు. ఎక్కువ మంది సినిమా అఖిల్ కెరీర్‌లో బెస్ట్ పెర్ఫార్మెన్స్ అని కొనియాడుతుండగా, మరికొందరు కొన్ని లోపాలను కూడా ప్రస్తావిస్తున్నారు. ముఖ్యంగా అఖిల్ నటన, ఇంటర్వెల్ ట్విస్ట్, సెకండాఫ్‌లోని ఎలివేషన్స్, హీరో-విలన్ పోరు, థమన్ బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్‌కు ప్రశంసలు దక్కుతున్నాయి. దర్శకుడు మురళీ కిషోర్ రూపొందించిన రూరల్ సెటప్, స్క్రీన్‌ప్లే కూడా ఆకట్టుకుంటున్నాయని పలువురు అభిప్రాయపడుతున్నారు. ఓ ప్రేక్షకుడు మాట్లాడుతూ.. "సినిమా చాలా బాగుంది. అఖిల్ యాక్టింగ్ ఇరగదీశాడు. 'పెద్ది' సినిమాలో రామ్ చరణ్ ఎలా విశ్వరూపం చూపించారో.. 'లెనిన్'లో అఖిల్ కూడా అదే స్థాయిలో ఆకట్టుకున్నాడు. ఇది పూర్తిగా అఖిల్ వన్ మ్యాన్ షో. 'ఏజెంట్' తర్వాత అఖిల్ పని అయిపోయిందని చాలామంది అనుకున్నారు. కానీ 'లెనిన్'తో ఆయన స్ట్రాంగ్ కమ్‌బ్యాక్ ఇస్తారు. యాక్షన్ సీక్వెన్స్‌లో ఆయన చూపించిన ఎనర్జీ, బాడీ లాంగ్వేజ్ అద్భుతంగా ఉన్నాయి. గ్లామర్ పరంగా కూడా అఖిల్ చాలా హ్యాండ్సమ్‌గా కనిపించాడు. ఈ సినిమా రూ.100 కోట్ల మార్క్‌ను అందుకుంటుందనే నమ్మకం ఉంది" అని వ్యాఖ్యానించాడు. మరో ప్రేక్షకుడు మాట్లాడుతూ.. "లెనిన్‌లో అఖిల్ దుమ్మురేపారు. అక్కినేని కుటుంబానికి అసలైన నట వారసుడు వచ్చేశాడనిపించింది. క్లాస్ సినిమాలే కాదు.. మాస్ సినిమాలు కూడా చేయగలమని అఖిల్ నిరూపించాడు. నాగార్జునకు ఎలాంటి మాస్ హిట్ ఉందో.. అఖిల్‌కు 'లెనిన్' అలాంటి సినిమాగా నిలుస్తుంది. ఇంటర్వెల్ ట్విస్ట్ అద్భుతంగా ఉంది. అప్పుడే ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద గట్టిగా కొట్టబోతుందని అనిపించింది. క్లైమాక్స్ ఫైట్స్, హీరోయిన్‌తో లవ్ ట్రాక్, అన్నదమ్ముల మధ్య ఎమోషనల్ సన్నివేశాలు అన్నీ చాలా బాగా వర్కౌట్ అయ్యాయి. సినిమా బ్లాక్‌బస్టర్" అని అభిప్రాయపడ్డాడు. ఇంకో ప్రేక్షకుడు దర్శకుడు మురళీ కిషోర్ అబ్బూరును ప్రత్యేకంగా ప్రశంసించాడు. "డైరెక్టర్ టేకింగ్ చాలా బాగుంది. అఖిల్‌కు ఫస్ట్ హిట్ ఈ దర్శకుడితోనే పడుతుంది. కొత్త హీరో లాంచ్ మూవీలా ఎనర్జీతో సినిమా తీశారు. ట్రైలర్, టీజర్‌తో మంచి హైప్ క్రియేట్ చేసినట్టే సినిమా కూడా అంచనాలకు తగ్గట్టే ఉంది. మాస్ ప్రేక్షకుల నాడిని దర్శకుడు బాగా పట్టుకున్నారు. లోకల్ ఎమోషన్స్‌తో సినిమా తీస్తే ప్రేక్షకులు ఎలా కనెక్ట్ అవుతారో మరోసారి నిరూపించారు. అఖిల్ యాక్టింగ్ కూడా వేరే లెవెల్" అని చెప్పాడు. అదే సమయంలో అఖిల్‌కు అభిమానులు ఇస్తున్న"అయ్యగారే నంబర్ వన్" ట్యాగ్‌పై స్పందిస్తూ.."అది అభిమానులు అనుకోవడం సహజం. కానీ ఇతర హీరోల అభిమానులు కూడా అంగీకరించే స్థాయికి వెళ్లాలి"అని ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. అయితే అందరూ ఒకే విధంగా స్పందించలేదు. మరో ప్రేక్షకుడు "సినిమా బాగానే ఉంది. కానీ వీఎఫ్ఎక్స్ కొన్ని చోట్ల బలహీనంగా అనిపించింది. కొన్ని సన్నివేశాలు చాలా బాగా వర్కౌట్ అయ్యాయి. అయితే మరికొన్ని సీన్స్ మాత్రం అంతగా ఎంగేజ్ చేయలేకపోయాయి" అంటూ తన అభిప్రాయాన్ని వెల్లడించాడు. అయితే మరోవైపు కొంతమంది ప్రేక్షకులు సినిమా కమర్షియల్ ఎంటర్‌టైనర్‌గా బాగున్నప్పటికీ, కథలో ఎమోషనల్ డెప్త్ కొంత తగ్గిందని అభిప్రాయపడుతున్నారు. లవ్ స్టోరీ ఆశించిన స్థాయిలో వర్కౌట్ కాలేదని, ఫస్ట్ హాఫ్ కాస్త నెమ్మదిగా సాగిందని, ప్రీ-ఇంటర్వెల్ తర్వాతే సినిమా అసలు ట్రాక్‌లోకి వచ్చిందని పోస్టులు చేస్తున్నారు. మొత్తంగా చూస్తే లెనిన్'కు మెజారిటీ పాజిటివ్ టాక్ లభిస్తుండగా, కొన్ని అంశాలపై మిక్స్‌డ్ అభిప్రాయాలు కూడా వ్యక్తమవుతున్నాయి. ఈ పాజిటివ్ టాక్‌ను బాక్సాఫీస్ వద్ద 'లెనిన్' ఎంతవరకు క్యాష్ చేసుకుంటుందో, ఓపెనింగ్ కలెక్షన్లు ఎలా ఉంటాయో? తొలి వీకెండ్‌లో ఎలాంటి కలెక్షన్లు సాధిస్తుందో చూడాలి.More Articles