Rating: 2.75/5

నటీనటులు: అఖిల్, భాగ్యశ్రీ భోర్సే, శివాజీ, రాజీవ్ కనకాల, బ్రహ్మాజీ, సునీల్, రమేశ్ ఇందిరా తదితరులు
దర్శకత్వం: మురళీ కిషోర్ అబ్బూరు
నిర్మాతలు: అక్కినేని నాగార్జున, సూర్యదేవర నాగవంశీ
సినిమాటోగ్రఫి: లియోన్ బ్రిట్టో,
మ్యూజిక్ డైరెక్టర్: తమన్ ఎస్
ఎడిటర్: నవీన్ నూలీ
యాక్షన్ కోరియోగ్రఫి: దిలీప్ సుబ్బరాయన్, రామ్ లక్ష్మణ్, విజయ్, రియల్ సతీష్,
ప్రొడక్షన్ డిజైనర్: అవినాష్ కొల్ల
కొరియోగ్రఫి: దినేష్ మాస్టర్
బ్యానర్: మనం ఎంటర్‌ప్రైజెస్ ఎల్ఎల్‌పీ, సితారా ఎంటర్‌టైన్‌మెంట్స్
సమర్పణ: అన్నపూర్ణ స్టూడియో
రిలీజ్ డేట్: 2026-07-10

Advertisement

చిత్తూరు జిల్లాలో ద్రౌపదిని కొలిచే వందో భారతం మిట్ట జాతర నిర్వహించే విషయంలో జయమ్మ (ఈశ్వరీ రావు) కుటుంబానిదే ఆధిపత్యం కొనసాగుతుంది. జాతరలో అధిపత్య కొనసాగించాలని ఎమ్మెల్యే (రమేశ్ ఇందిరా) వర్గం కుట్రలు పన్నుతుంటారు. ఇలాంటి గొడవల నేపథ్యంలో అనాథ అయిన లెనిన్ (అఖిల్) ను ఓ కారణంగా జయమ్మ కుటుంబం ఆదరిస్తుంది. జయమ్మ, ఆమె కొడుకు వసంత్ (ప్రమోద్ పంజు) లెనిన్‌ను కుటుంబ సభ్యుడిగా చేసుకొంటారు. వసంత్ అంటే లెనిన్‌కు ప్రాణస్నేహితుడిగా మారుతాడు. అదే గ్రామంలో భారతీ ( భాగ్యశ్రీ భోర్సే), లెనిన్ ప్రేమించుకొంటారు. కానీ వసంత్‌తో భారతీ పెళ్లి నిశ్చయిస్తారు. దాంతో తన స్నేహితుడి కోసం ప్రేమను త్యాగం చేయాలని లెనిన్ డిసైడ్ అవుతాడు.

Advertisement

భారతం మిట్ట గ్రామంపై మహాభారతం ప్రభావం ఎలా ఉంటుంది? ప్రతిష్టాత్మకంగా భావించే గ్రామ జాతర రెండు వర్గాల మధ్య ఎలాంటి విభేదాలు సృష్టించింది? అనాథ అయిన లెనిన్‌ను జయమ్మ కుటుంబం చేరదీయడానికి కారణం ఏమిటి? భారతీతో లెనిన్ ప్రేమ వ్యవహారం ఎలా కొనసాగింది? వసంత్‌తో భారతీ పెళ్లి జరిపించడానికి దారి తీసిన బలమైన కారణం ఏమిటి? భారతీతో వసంత్ పెళ్లి జరిగిందా? లేదా లెనిన్ తన ప్రేయసిని దక్కించుకొన్నాడా? లెనిన్‌కు యతిరాజులు (శివాజీ) చేసిన నమ్మక ద్రోహం ఏమిటి? లెనిన్‌కు జైలు శిక్ష ఎందుకు పడింది? జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత లెనిన్ ఎవరిపై పగ ప్రతీకారం తీర్చుకొన్నాడు? అనే ప్రశ్నలకు సమాధానమే లెనిన్ సినిమా కథ.

Advertisement

చిత్తూరు జిల్లాలో జరిగే జాతర ఎపిసోడ్‌తో కథ ఎమోషనల్‌గా మొదలుపెట్టడం ద్వారా సినిమాపై క్యూరియాసిటిని పెంచడంలో దర్శకుడు మురళీ కిషోర్ సరైన ట్రాక్‌లో ఉన్నాడనిపించింది. ఆ తర్వాత లెనిన్ జైలు నుంచి రిలీజ్ కావడంతో ఫ్లాష్‌బ్యాక్ కథ ఏం జరిగి ఉంటుందనే ఆసక్తిని పెంచాడు. ఒకసారి గతంలోకి వెళ్లి కథ చెప్పడం ప్రారంభించిన తర్వాత ఫీల్ గుడ్ సీన్లు లేకపోవడం, భారతీ, లెనిన్ మధ్య లవ్ ఎస్టాబ్లిష్‌మెంట్ స్ట్రాంగ్‌గా లేకపోవడం వల్ల కథ సాదాసీదా ఇంటర్వెల్ వరకు లాగించే ప్రయత్నం చేశారనేది స్పష్టంగా కనిపిస్తుంది. అలా స్లోగా సాగే కథలో లెనిన్‌తో ఓ ట్విస్ట్ రివీల్ చేసిన పాయింట్ సినిమా రేంజ్‌ను పెంచేలా చేసింది. పాటలు, ఫైట్స్, ఎమోషనల్ సీన్లు, రూరల్ డ్రామా ఫస్టాఫ్‌కు పాజిటివ్‌గా మారాయి.

Advertisement

ఇక సెకండాఫ్‌లో వసంత్, లెనిన్, భారతీ మధ్య జరిగే సన్నివేశాలు, ఇతర క్యారెక్టర్లు వేసే ఎత్తులు పై ఎత్తులు స్టోరీని గ్రిప్పింగ్‌గా మార్చడంతో సినిమా సరైన గాడిలో పడిందనే ఫీలింగ్ కలుగుతుంది. అప్పటి వరకు ఓ పాజిటివ్ నోట్ ఉన్న క్యారెక్టర్లు నెగిటివ్ జోన్‌లోకి తీసుకొచ్చిన తీరు కథకు బలంగా మారింది. ప్రీ క్లైమాక్స్ నుంచి చివరి సీన్ వరకు వచ్చే ట్విస్టులు ఆడియెన్స్‌ను థ్రిల్ చేస్తాయి. చివరి 20 నిమిషాలు లెనిన్ క్యారెక్టర్ బిహేవ్ చేసిన విధానం.. ఆ పాత్ర కోసం అఖిల్ చేసిన పెర్ఫార్మెన్స్ హైలెట్‌గా మారిందనే చెప్పాలి. రెగ్యులర్ సినిమా కథల ముగింపులా కాకుండా డిఫరెంట్‌గా సినిమాను ముగించడం కొత్తదనాన్ని ఆశించే ప్రేక్షకులకు ఫీల్ గుడ్ ఫ్యాక్టర్‌గా అనిపిస్తుంది.

Advertisement

నటీనటుల పెర్ఫార్మెన్స్ విషయానికి వస్తే.. ఈ సినిమాను మొత్తం అఖిల్ తన భుజాలపై మోశాడు. ఇప్పటి వరకు చూసిన అఖిల్ వేరు.. లెనిన్ సినిమాలో చూసిన అఖిల్ వేరు అనే ఫీలింగ్‌ను తన నటన ద్వారా కలిగించాడు. లెనిన్ పాత్రలో ఒదిగిపోయి తన ఇమేజ్‌కు భిన్నంగా కనిపించాడు. క్లైమాక్స్ ఎపిసోడ్‌లో ఇరుగదీశాడనే చెప్పాలి. ఇక భాగ్యశ్రీ భోర్సే మరోసారి బరువైన పాత్రలో కనిపించారు. ఎప్పటిలానే తన పాత్రతో మంచి పెర్ఫార్మెన్స్‌తో సినిమాకు బలంగా మారారు. శివాజీ, ప్రమోద్ పంజు, ఈిశ్వరీ భాయ్ తమ పాత్రలకు న్యాయం చేశారు. మిగితా పాత్రల్లో కనిపించిన వారు ఫర్వాలేదనిపించారు.

Advertisement

సాంకేతిక విభాగాల విషయానికి వస్తే.. ఈ సినిమాకు తమన్ మ్యూజిక్, లియోన్ బ్రిట్టో సినిమాటోగ్రఫి ప్లస్ పాయింట్స్. కథలో బలహీనంగా కనిపించే సన్నివేశాలను కూడా తమన్ తన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ హైప్ క్రియేట్ చేశాడు. రూరల్ ఎన్విరాన్‌మెంట్, జాతర ఎపిసోడ్స్‌ను లియోన్ చాలా నేచురల్‌గా చూపించాడు. ఎడిటర్‌గా నవీన్ నూలీ తన రెగ్యులర్ ట్రాక్ మిస్ అయ్యాడనే ఫీలింగ్ కలుగుతుంది. కథను సాఫీగా కాకుండా జర్కీగా చూపించడం వల్ల కన్‌ఫ్యూజన్ క్రియేట్ అయింది. కథ, కథనాల డిమాండ్ మేరకు సితారా, అన్నపూర్ణ బ్యానర్లు అనుసరించిన నిర్మాణ విలువలు బాగున్నాయి. కథ, కథనాలను పక్కన పెడితే.. అఖిల్ పెర్ఫార్మెన్స్, భాగ్యశ్రీ భోర్సే గ్లామర్ కోసం ఈ సినిమాను థియేటర్‌లో చూడాలనిపించేంతలా ఉంది. ఈ వారం డిఫరెంట్ కాన్సెప్ట్ ఉన్న సినిమాను చూడాలనుకొంటే లెనిన్ చక్కటి ఆప్షన్.