తమిళ స్టార్ హీరో ధనుష్ తొలిసారి జాతీయ చలనచిత్ర అవార్డులపై స్పందించారు. ఇటీవల ప్రకటించిన 72వ జాతీయ చలనచిత్ర అవార్డుల్లో ధనుష్ నటించిన 'రాయన్' ఉత్తమ తమిళ సినిమాగా ఎంపికైంది. అలాగే 'కెప్టెన్ మిల్లర్' సినిమాలో అద్భుతమైన నటనకు గాను హీరో ధనుష్‌కు స్పెషల్ మెన్షన్ (Special Mention-Best Actor) గౌరవం దక్కింది. అయితే 'రాయన్'కు అవార్డు రావడంపై సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ జరిగింది. పలువురు సినీ అభిమానులు, నెటిజన్లు ఈ నిర్ణయాన్ని ప్రశ్నించారు. ఈ నేపథ్యంలో హీరో ధనుష్ తొలిసారి జాతీయ అవార్డుపై స్పందించారు. తన మనసులోని మాటను బయటపెట్టారు. ఇంతకీ ఏమన్నారంటే?
ఇటీవల ఓ కార్యక్రమంలో ధనుష్ పాల్గొన్నారు. ఈ ట్రోలింగ్ పై స్పందించారు. 'ఆ ఏడాది 'రాయన్' కంటే గొప్ప సినిమాలు వచ్చాయి. ఆ సినిమాల అభిమానులు తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. వారి భావాలను నేను పూర్తిగా గౌరవిస్తున్నాను'అని ధనుష్ అన్నారు. అయితే ఏ సినిమా పేరును ఆయన ప్రస్తావించలేదు. ఎవరినీ విమర్శించకుండా, అందరి అభిప్రాయాన్ని గౌరవిస్తానని తెలిపారు. అనంతరం తన సినీ ప్రయాణాన్ని గుర్తు చేసుకున్నారు. కెరీర్‌లో ఎన్నో సందర్భాల్లో జాతీయ అవార్డు వస్తుందని ఆశించినా రాలేదని వెల్లడించారు. తనకు ఎంతో ఇష్టమైన పలు సినిమాలు అవార్డుకు అర్హమైనవేనని అప్పట్లో అభిమానులు చెప్పారని గుర్తు చేశారు.
2005లో విడుదలైన 'అదు ఒరు కనా కాలం'(Adhu Oru Kana Kaalam)సినిమాకు జాతీయ అవార్డు వస్తుందని అందరూ అన్నారు. నేను కూడా అప్పట్లో చాలా చిన్నవాడిని. నిజంగానే వస్తుందని ఆశపడ్డాను. కానీ రాలేదు" అని చెప్పారు. ఆ తర్వాత 'పుదుపెట్టై'(Pudhupettai)సినిమాను కూడా అవార్డు వస్తుందని భావించానని తెలిపారు. అలాగే త్రి(3), 'మయక్కం ఎన్నా', 'వడ చెన్నై', 'కర్ణన్', మరియన్, హిందీ సినిమా రాంఝనా (Raanjhanaa)వంటి సినిమాలకు కూడా అభిమానులు జాతీయ అవార్డు ఖాయమని చెప్పారని గుర్తు చేశారు. కానీ అవి కూడా తనకు దక్కలేదని వివరించారు. ఈ సందర్భంగా అవార్డుల గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. "కొన్ని విషయాలు ఎంత ప్రయత్నించినా మన చేతుల్లో ఉండవు. సమయం వచ్చినప్పుడు అవే మన దగ్గరకు వస్తాయి. నా విషయంలో కూడా అదే జరిగింది" అని ధనుష్ పేర్కొన్నారు. 'రాయన్' గురించి కూడా ఆయన ప్రత్యేకంగా మాట్లాడారు. "సినిమా ఎలా ఉందనేది ఒక విషయం. కానీ ఆ సినిమా కోసం నేను చేసిన కష్టం మాత్రం నిజమైనది. నా శ్రమను ఎవరూ తక్కువ చేసి చూడొద్దు. నేను తమిళ వ్యక్తిగా మరో రెండు జాతీయ అవార్డులు అందుకున్నాను. దీనిని తక్కువ చేసి మాట్లాడకండి" అంటూ అభిమానులకు విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా నటుడు అజిత్ కుమార్ చెప్పిన ఓ మాటను కూడా ధనుష్ గుర్తు చేశారు. "మనమే ఓడిపోయామని ఒప్పుకునే వరకు ఎవరూ మనల్ని ఓడించలేరు" అని అజిత్ చెప్పిన మాటలను ఉటంకించారు. జాతీయ అవార్డుల ప్రకటన తర్వాత సోషల్ మీడియాలో పెద్ద చర్చ జరిగింది. ముఖ్యంగా 'రాయన్' ఉత్తమ తమిళ సినిమాగా ఎంపిక కావడంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. పలువురు సినీ అభిమానులు 'మేయ్యళగన్' వంటి సినిమా ఈ అవార్డుకు మరింత అర్హమని అభిప్రాయపడ్డారు. కార్తీ, అరవింద్ స్వామి ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన ఆ సినిమా విమర్శకుల ప్రశంసలు అందుకోవడంతో పాటు ప్రేక్షకులను కూడా ఆకట్టుకుంది. అలాగే విజయ్ సేతుపతి, అనురాగ్ కశ్యప్ నటించిన 'మహారాజా' కూడా ఉత్తమ తమిళ చిత్ర అవార్డుకు గట్టి పోటీ ఇస్తుందనీ, ఈ రెండు చిత్రాలతో పోలిస్తే 'రాయన్'కు మిశ్రమ స్పందన మాత్రమే వచ్చిందని సోషల్ మీడియాలో అనేక పోస్టులు వచ్చాయి. అయినప్పటికీ జాతీయ అవార్డు దక్కడం ఆశ్చర్యానికి గురి చేస్తుంది. అయితే ఈ విమర్శలపై ధనుష్ స్పందించిన తీరు ప్రశంసనీయంగా మారింది. తన సినిమానే గొప్పదని చెప్పకుండా, ఇతర సినిమాల గొప్పతనాన్ని అంగీకరించడం గొప్ప విషయమేనని అభిమానులు అంటున్నారు. అదే సమయంలో తన శ్రమకు గౌరవం ఇవ్వాలని కోరడం కూడా సమంజసమేనని పలువురు సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.More Articles