తమిళనాడు సీఎం , టీవీకే (తమిళగ వెట్రి కజగం) అధినేత దళపతి విజయ్ నటించిన చివరి సినిమా 'జన నాయగన్'. ఈ సినిమా గురువారం (జూలై 23) ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదలైంది. రాజకీయాల్లో పూర్తిస్థాయిలో అడుగుపెట్టిన తర్వాత విజయ్ నటించిన చివరి సినిమా ఇది. దీంతో తమిళ అభిమానులు, పార్టీ కార్యకర్తలు, నాయకులు ఈ సినిమాను ఓ వేడుకలా జరుపుకున్నారు. తొలి రోజు తొలి షో నుంచే థియేటర్ల వద్ద భారీ సంబరాలు కనిపించాయి.
సినిమా విడుదల నేపథ్యంలో తమిళనాడులోని పలు థియేటర్ల వద్ద అభిమానులు భారీ కటౌట్లు ఏర్పాటు చేసి, బాణాసంచా పేల్చుతూ, డీజే సౌండ్స్‌తో సందడి చేశారు. పాలు అభిషేకాలు, పూల వర్షం, భారీ ర్యాలీలతో 'జన నాయగన్' విడుదలను పండుగలా మార్చేశారు. ఈ సమయంలో ఓ భావోద్వేగ ఘటన చోటుచేసుకుంది. ఇంతకీ ఏమైందంటే?
విజయ్ 'జన నాయగన్' సినిమాలో పూజా హెగ్డే హీరోయిన్‌గా నటించారు. ఈ భారీ పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్‌కు హెచ్. వినోద్ దర్శకత్వం వహించారు. కన్నడ ప్రముఖ నిర్మాణ సంస్థ కేవీఎన్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై వెంకట్ కె. నారాయణ, జగదీష్ పళనిస్వామి, లోహిత్ ఎన్.కే ఈ సినిమాను నిర్మించారు. ఈ చిత్రంలో మమితా బైజు కీలక పాత్రలో కనిపించగా, బాబీ డియోల్, ప్రకాశ్ రాజ్, గౌతమ్ వాసుదేవ్ మీనన్, ప్రియమణి, సునీల్, రేవతి, రెబా మోనికా జాన్, బాబా భాస్కర్ తదితరులు ప్రధాన పాత్రల్లో నటించారు. అనిరుధ్ రవిచందర్ సంగీతం అందించగా, సత్యన్ సూర్యన్ సినిమాటోగ్రఫీ, ప్రదీప్ ఈ. రాఘవ్ ఎడిటింగ్ బాధ్యతలు నిర్వహించారు. జన నాయగన్ సినిమా విడుదల రోజునే టీవీకే ప్రభుత్వానికి చెందిన పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు కూడా వివిధ థియేటర్లలో తొలి షోను వీక్షించారు. ఒకప్పుడు విజయ్ అభిమాన సంఘాల్లో పనిచేసిన వారిలో చాలామంది ఇప్పుడు మంత్రులు, ఎమ్మెల్యేలుగా కొనసాగుతున్న విషయం తెలిసిందే. జలవనరుల శాఖ మంత్రి ఎన్. ఆనంద్ (బస్సీ ఆనంద్), ఆరోగ్య శాఖ మంత్రి కే.జి. అరుణ్‌రాజ్ చెన్నైలోని ప్రముఖ రోహిణి థియేటర్‌లో అభిమానులతో కలిసి సినిమా చూశారు. ఇక హైలెట్ గా నిలిచిన అంశమేమిటంటే? పుదుకొట్టైలో ఓ థియేటర్ లో కార్మిక సంక్షేమ శాఖ మంత్రి జే. మహమ్మద్ పర్వేష్ అభిమానులతో కలిసి సినిమా వీక్షించారు. సినిమాలో క్లైమాక్స్ సన్నివేశాలు, "చీఫ్ మినిస్టర్ విజయ్" టైటిల్ కార్డ్ కనిపించగానే మంత్రి తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. కళ్లలో నీళ్లు తెప్పించుకుని కన్నీళ్లు పెట్టుకున్నారు. పక్కనే ఉన్న పార్టీ నాయకులు, కార్యకర్తలు ఆయనను ఓదార్చారు. ఈ భావోద్వేగ సన్నీవేశాన్ని అక్కడ ఉన్న ప్రేక్షకులు తన మొబైల్ ఫోన్లలో షూట్ చేశారు. కొద్దిసేపటికే ఆ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. విజయ్ అభిమానులు మంత్రి భావోద్వేగాన్ని ప్రశంసిస్తుండగా, వీడియోకు లక్షలాది వ్యూస్ వచ్చాయి. ఇక ప్రతి పక్షాలు విమర్శలు గుప్పించాయి. సామాజిక సమస్యలపై ఇంత భావోద్వేగం చూపని మంత్రి, సినిమా చూసి కన్నీళ్లు పెట్టుకోవడం ఆశ్చర్యకరమని కామెంట్స్ చేస్తున్నారు. మరికొందరు ఈ ఘటనను రాజకీయ ప్రచారంగా అభివర్ణించారు. మరోవైపు టీవీకే నాయకులు మాత్రం ఇది భావోద్వేగమని చెబుతున్నారు. విజయ్ నటుడిగా చివరిసారి వెండితెరపై కనిపించడం అభిమానులను కదిలించిందని అంటున్నారు. "ఇది కేవలం సినిమా కాదు.. మా నాయకుడి సినీ ప్రయాణానికి వీడ్కోలు" అంటూ అభిమానులు సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. More Articles