భారతదేశంలో టాప్ రియాలిటీ షోగా దూసుకెళ్తోంది బిగ్‌బాస్. విభిన్న మనస్తత్వాలు ఉన్న సెలబ్రిటీలను 100 రోజులకు పైగా హౌస్‌లో ఉంచి వారి వ్యక్తిత్వాన్ని అంచనా వేయడంతో పాటు రకరకాల టాస్క్‌లతో వారిలో పోరాడే తత్వాన్ని బయటకు తీసుకురావడం, అంతిమంగా ఒకరిని విజేతగా నిర్ణయించడం బిగ్‌బాస్ కాన్సెప్ట్. తొలుత హిందీలో ప్రారంభమైన ఈ షో.. దేశంలోని కొన్ని ప్రాంతీయ భాషల్లోనూ ప్రసారమవుతూ ప్రేక్షకుల ఆదరాభిమానులను సంపాదించుకుంటోంది. నగర, అర్బన్ ప్రాంతాలతో పాటు మారుమూల పల్లెలకు కూడా బిగ్‌బాస్ విస్తరించింది.

Advertisement
Advertisement

అశ్లీలత కనిపిస్తోందని, పెళ్లికానీ యువతీ యువకులు, పెళ్లయిన వారు ఒకే గదిలో కలిసి ఉండటం ఏంటంటూ సీపీఐ నారాయణ వంటి వారు మండిపడుతూనే ఉన్నారు. ఎన్ని వివాదాలు, విమర్శలు వచ్చినా ప్రేక్షకులు మాత్రం బిగ్‌బాస్ షోను నెత్తి మీద పెట్టుకుంటున్నారు. ఈ ఏడాది కూడా అన్ని భాషల్లో బిగ్‌బాస్ రెడీ అయ్యింది. తెలుగు విషయానికి వస్తే.. ఇప్పటి వరకు 9 సీజన్లను సక్సెస్‌ఫుల్‌గా కంప్లీట్ చేసుకున్న బిగ్‌బాస్.. ఈసారి 10వ సీజన్‌లోకి అడుగుపెట్టబోతోంది. కింగ్ అక్కినేని నాగార్జున ఈసారి కూడా హోస్ట్‌గా వ్యవహరించనున్నారు.

బిగ్‌బాస్‌ ద్వారా సెలబ్రిటీలు ప్రేక్షకులకు మరింత చేరువు అవుతుండటంతో పాటు మానసికంగా తమ బలమెంతో తెలుసుకుంటున్నారు. బుల్లితెర నుంచి వెండితెర వరకు ఎందరో ఈ షోలో పాల్గొనేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. చాలామందికి బిగ్‌బాస్‌లో పాల్గొనాలని, తామేంటో నిరూపించుకోవాలని ఉంది. కానీ కొందరికే బిగ్‌బాస్ నిర్వాహకులు కంటెస్టెంట్స్‌గా అవకాశం కలిపిస్తున్నారు. మరికొందరు మాత్రం ఎంత పెద్ద ఆఫర్ ఇచ్చినాసరే బిగ్‌బాస్‌లో అడుగుపెట్టేది లేదని తేల్చేస్తున్నారు. ఇంకొందరైతే అక్కడ ఒత్తిడి, మానసిక సంఘర్షణను తాము తట్టుకోలేమని చేతులు ఎత్తేస్తున్నారు. తాజాగా ఒకప్పటి నటి, హీరోయిన్ రేఖ వేదవ్యాస్ కూడా బిగ్‌బాస్ షో గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు.

Advertisement

ఆనందం సినిమాతో తెలుగు వారిని పలకరించిన ఈ కన్నడ కస్తూరి అప్పట్లో యువతకు డ్రీమ్ గర్ల్‌గా నిలిచారు. ఈ సినిమా ఘన విజయం సాధించడంతో అందం, జాబిలి, ఒకటో నెంబర్ కుర్రాడు తదితర సినిమాలలో నటించారు. కెరీర్ పీక్స్‌లో ఉన్న సమయంలో అనారోగ్యానికి గురికావడం, పలు వ్యక్తిగత కారణాలతో సినీ రంగానికి దూరమయ్యారు. అయితే ఇటీవల ఆమె తిరిగి ఇండస్ట్రీలో రీ ఎంట్రీ ఇచ్చారు. ముంబైలో స్థిరపడిన రేఖ వేదవ్యాస్ తనకున్న పరిచయాల ద్వారా అవకాశాల కోసం ట్రై చేస్తున్నారు. రీసెంట్‌గా జబర్దస్త వర్ష హోస్ట్‌గా వ్యవహరిస్తోన్న కిస్సిక్ టాక్ షోకు గెస్ట్‌గా హాజరైన రేఖ పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నారు.

Advertisement

ఈ క్రమంలోనే మీరు ఈ షోకి రావాలని బిగ్‌బాస్ నుంచి కాల్ వస్తే వెళ్లడానికి రెడీ అని వర్ష ప్రశ్నించింది. దీనికి రేఖ స్పందిస్తూ.. బిగ్‌బాస్‌కి వెళ్లాలంటే చాలా గట్స్ ఉండాలి, అన్ని కెమెరాల ముందు అన్ని రోజులు గొడవలు చేసుకుంటూ, టాస్క్‌లలో పాల్గొనాలంటే గట్స్ ఉండాలి. ఎవరైతే ఇప్పటి వరకు బిగ్‌బాస్‌కి వెళ్లారో వారందరికీ హ్యాట్సాఫ్.. నాకు గట్స్ లేవు. ఒకవేళ గెస్ట్‌గా వెళ్లమంటే ఓకే, వేరే ఏదైనా క్రియేటివ్ ఐడియాలు ఉంటే వెళ్తాను. ఒక కంటెస్టెంట్‌గా నా వల్ల కాదు. బిగ్‌బాస్ కాకుండా మనకి చాలా టీవీ షోలు ఉన్నాయి. నన్ను ఆడియన్స్‌కి కనెక్ట్ చేయాలి, అలాంటి ప్రాజెక్ట్ ఏదైనా పర్లేదని రేఖ వేదవ్యాస్ తేల్చిచెప్పారు. ప్రస్తుతం ఆమె వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా... బిగ్‌బాస్‌పై రేఖ అభిప్రాయం పట్ల నెటిజన్లు రకరకాలుగా కామెంట్స్ పెడుతున్నారు.