బిగ్‌బాస్ తెలుగు 10 మరికొద్దిరోజుల్లో గ్రాండ్ లాంచ్ కాబోతోంది. ఇప్పటి వరకు 9 సీజన్లను పూర్తి చేసుకుని విజయవంతంగా 10వ సీజన్‌లోకి అడుగుపెట్టనుంది. తాజా సీజన్‌కు సంబంధించి ఇప్పటికే ఏర్పాట్లు చకచకా జరుగుతున్నాయి. కంటెస్టెంట్స్ ఎంపిక కూడా జోరందుకుంది. సెలబ్రిటీలతో పాటు సామాన్యులను కూడా ఈసారి హౌస్‌లోకి పంపేందుకు బిగ్‌బాస్ నిర్వాహకులు రెడీ అవుతున్నారు. అయితే బిగ్‌బాస్ 10వ సీజన్ అంత ఆషామాషీగా ఉండదని, ఇప్పటి వరకు ఏ సీజన్‌లోనూ లేని విధంగా సరికొత్త టాస్క్‌లు, గేమ్స్‌తో పాటు కొత్త రూల్స్ ఉంటాయని సోషల్ మీడియాలో రూమర్స్ వస్తున్నాయి.

Advertisement

అసలే బిగ్‌బాస్‌ను బూతు షో అని, అశ్లీలతకు మారు పేరంటూ సీపీఐ నారాయణ వంటి వారు మండిపడుతుంటారు. పెళ్లయిన వారు, పెళ్లికాని ఆడ, మగ మూడు నెలల పాటు ఒకే గదిలో ఉండటాన్ని కొందరు సంప్రదాయవాదులు తప్పుబడుతున్నారు. ఇలాంటి వాటి ద్వారా సమాజానికి ఎలాంటి మెసేజ్‌లు ఇస్తున్నారు, పిల్లలకు ఏం చెబుతున్నారని ప్రతిసారి బిగ్‌బాస్ స్టార్ట్ అయ్యే టైంలో సోషల్ మీడియాలో భారీగా ట్రోలింగ్ జరుగుతుంటుంది. అయితే హౌస్‌ లోపల, బయట జరిగే కొన్ని సంఘటనల కారణంగా బిగ్‌బాస్‌ ఇమేజ్ డ్యామేజ్ అవుతోంది. దాంతో ఈసారి బిగ్‌బాస్ తెలుగు 10లో కఠినమైన రూల్స్‌ను తీసుకొచ్చినట్లుగా ప్రచారం జరుగుతోంది. మతం, భాష, ప్రాంతం, వ్యక్తిగతంగా టార్గెట్ చేస్తే ఊరుకునేది లేదని చాలా కఠినంగా శిక్షలు ఉంటాయని హెచ్చరిస్తున్నారు.

Advertisement

బిగ్‌బాస్ సీజన్ 8లో మతం తెరపైకి వచ్చిన సంగతి తెలిసిందే. నాటి సీజన్‌లో కంటెస్టెంట్స్‌గా ఉన్న నబీల్, మొహబూబ్‌లు కమ్యూనిటీ గురించి మాట్లాడుకున్న ఓ సంభాషణ నాడు దుమారం రేపింది. బిగ్‌బాస్ నియమ నిబంధనల ప్రకారం కొన్ని విషయాలను హౌస్‌లో ప్రస్తావించకూడదు, అలాంటిది ఏకంగా కమ్యూనిటీ గురించి మాట్లాడటంపై ట్రోలింగ్ జరిగింది. దాంతో మొహబూబ్, నబీల్‌ల గ్రాఫ్ దారుణంగా పడిపోయింది. ఈ పరిణామాల నేపథ్యంలో ఈసారి సీజన్‌లో ఇలాంటి వాటికి చోటు ఉండకూడదని బిగ్‌బాస్ నిర్వాహకులు భావిస్తున్నారు.

ఇక భారతదేశంలో కులానికి ప్రతిరంగంతోనూ అవినాభావ సంబంధం ఉంది. కళాకారులను, క్రీడాకారులను కూడా కులం ప్రాతిపదికన వేరు చేసే మనుషులున్న దేశం మనది. బిగ్‌బాస్‌ కూడా ఇందుకు అతీతం కాదు. బిగ్‌బాస్‌కి ఎంపికైన కంటెస్టెంట్స్,విన్నర్‌‌లు మా కులపొడు అంటూ సోషల్ మీడియాలో కొన్ని గ్రూపులు వెనకేసుకొచ్చాయి. వారికి ప్రత్యర్ధిగా ఉన్న కంటెస్టెంట్స్‌పై దుష్ప్రచారం చేసిన ఉదంతాలెన్నో. ఇలాంటి వాటిని దృష్టిలో పెట్టుకుని ఈసారి బిగ్‌బాస్ టీమ్ రూల్ బుక్ మొత్తం మార్చేసింది. కంటెస్టెంట్స్‌కు ఈసారి ఒళ్లు జాగ్రత్తగా పెట్టుకుని మాట్లాడాలని చెబుతున్నారు.

Advertisement

హౌస్‌లో బూతులు మాట్లాడటం, వ్యక్తిగత దూషణలు, మతం, భాష పేరుతో రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయడం చేస్తే 10 లక్షల రూపాయల వరకు జరిమానా విధించనున్నారట. ఈ మొత్తాన్ని కంటెస్టెంట్స్‌కి చెల్లించే పారితోషికం నుంచే కట్ చేస్తారని ఫిలింనగర్ టాక్. మరి ఇందులో ఎంత వరకు నిజముందో తెలియదు గానీ ఇలాంటి రూల్స్ వస్తే కంటెస్టెంట్స్ అప్రమత్తంగా ఉంటారని, తద్వారా బిగ్‌బాస్ బ్రాండ్ ఇమేజ్ నిలబడుతుందని నెటిజన్లు కామెంట్స్ పెడుతున్నారు. సోషల్ మీడియా టాక్ ప్రకారం బిగ్‌బాస్ తెలుగు 10 సీజన్ సెప్టెంబర్ మొదటి వారంలో గ్రాండ్ లాంచ్ అయ్యే అవకాశం ఉంది. ఈసారి 12 నుంచి 14 మంది సెలబ్రిటీలు, 8 మంది కామన్‌మెన్ హౌస్‌లో అడుగుపెడతారని వార్తలు వస్తున్నాయి. బిగ్‌బాస్ పెట్టే రూల్స్, కంటెస్టెంట్స్‌కి సంబంధించి త్వరలోనే క్లారిటీ రానుంది.