బుల్లితెర ప్రేక్షకులను ఎంతగానో అలరిస్తున్న రియాలిటీ షో బిగ్‌బాస్ తెలుగు మరోసారి సందడి చేసేందుకు సిద్ధమవుతోంది. ఇప్పటికే తొమ్మిది సీజన్లను విజయవంతంగా పూర్తి చేసుకున్న ఈ షో.. ఇప్పుడు ప్రతిష్ఠాత్మకమైన 10వ సీజన్ ‌కు రెడీ అవుతోంది. ఈసారి గేమ్ ఫార్మాట్‌లో మార్పులు, కొత్త తరహా టాస్కులు, స్ట్రాంగ్ కంటెస్టెంట్లతో షోను మరింత ఆసక్తికరంగా తీర్చిదిద్దేందుకు నిర్వాహకులు సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం. ఆగస్టు చివరి వారం లేదా సెప్టెంబర్ మొదటి వారంలో కొత్త సీజన్ ప్రారంభమయ్యే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది. ఇదే సమయంలో బిగ్ బాస్ సీజన్ 8 విజేత, నటుడు నిఖిల్ మలయక్కల్ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.

Advertisement
Advertisement

ఇటీవల ఓ యూట్యూబ్ ఇంటర్వ్యూలో పాల్గొన్న నిఖిల్.. బిగ్‌బాస్ తన జీవితాన్ని ఎలా మార్చిందో, ఆ ఇంట్లో గడిపిన రోజులు ఎలా ఉండేవో, కొత్త కంటెస్టెంట్లు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో వివరంగా చెప్పుకొచ్చారు. ముఖ్యంగా "బిగ్‌బాస్‌లో ఏం చేసినా కొన్నిసార్లు వెన్నుపోటు పొడిచాడనే ముద్ర పడుతుంది" అంటూ షాకింగ్ కామెంట్స్ చేశారు. ఇంతకీ ఏం జరిగిందంటే ? ఇంటర్వ్యూలో మాట్లాడుతూ నిఖిల్.. "బిగ్‌బాస్ నాకు ఒక గొప్ప వేదిక ఇచ్చింది. అంతకుముందు సీరియల్స్, టీవీ షోల ద్వారా గుర్తింపు ఉన్నా.. బిగ్‌బాస్ తర్వాత నా పరిధి పూర్తిగా మారిపోయింది. ఈరోజు నాకు వస్తున్న అవకాశాల్లో బిగ్‌బాస్ పాత్ర చాలా పెద్దది. అయితే ఆ గుర్తింపును నిలబెట్టుకోవడం మాత్రం పూర్తిగా మన చేతుల్లోనే ఉంటుంది'అని చెప్పారు.

Advertisement

కన్నడలో హీరోగా ప్రయత్నించి ఆశించిన స్థాయిలో అవకాశాలు రాకపోవడంతో తెలుగు టెలివిజన్ రంగంలోకి వచ్చిన నిఖిల్.. గోరింటాకు, అమ్మకు తెలియని కోయిలమ్మ, స్రవంతి వంటి సీరియల్స్‌తో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. అనంతరం బిగ్‌బాస్ తెలుగు సీజన్ 8లో పాల్గొని తన ఆటతీరుతో ప్రేక్షకుల అభిమానాన్ని సంపాదించి విజేతగా నిలిచారు. బిగ్‌బాస్ ట్రోఫీ అందుకున్న క్షణాన్ని గుర్తు చేసుకుంటూ నిఖిల్ భావోద్వేగానికి గురయ్యారు. "నా చేతికి ట్రోఫీ వస్తుందని నిజంగా నేను ఊహించలేదు. ఆ క్షణం నాకు మాటలు రాలేదు. ప్రేక్షకులు నాపై ఇంత ప్రేమ చూపిస్తారని అనుకోలేదు. ఎలా స్పందించాలో కూడా అర్థం కాలేదు. నా జీవితంలో అది ఎప్పటికీ మరచిపోలేని రోజు" అని చెప్పారు. ప్రేక్షకుల ప్రేమే తన విజయానికి కారణమని, ఆ ప్రేమకు ఎప్పటికీ రుణపడి ఉంటానని ఆయన తెలిపారు.

Advertisement

సీజన్ 10లో పాల్గొనే కంటెస్టెంట్లకు నిఖిల్ విలువైన సూచనలు చేశారు. "చాలామంది బిగ్‌బాస్ అంటే కేవలం టాస్కులు గెలవడమే అనుకుంటారు. కానీ అది పూర్తిగా నిజం కాదు. అక్కడ ఫిజికల్ టాస్కులతో పాటు మెంటల్ స్ట్రెంగ్త్ కూడా చాలా ముఖ్యం. బిగ్‌బాస్ అనేది ఒక ఎమోషనల్ రోలర్ కోస్టర్. తర్వాత ఏం జరుగుతుందో మనకు తెలియదు. ప్రతి రోజు కొత్త పరిస్థితులు ఎదురవుతాయి. వాటిని ఎలా ఎదుర్కొంటామన్నదే ముఖ్యమైనది" అని చెప్పారు. "ప్రేక్షకులు కేవలం టాస్కుల్లో మీరు ఎలా ఆడారనేది మాత్రమే చూడరు. మీరు ఇతరులతో ఎలా మాట్లాడుతున్నారు? ఎలా ప్రవర్తిస్తున్నారు? కోపం వచ్చినప్పుడు ఎలా రియాక్ట్ అవుతున్నారు? స్నేహాన్ని ఎలా కొనసాగిస్తున్నారు? అన్నింటినీ గమనిస్తారు" అని నిఖిల్ చెప్పారు.

Advertisement

"టాస్కుల్లో గెలిచినా, ప్రవర్తన బాగోలేకపోతే ప్రేక్షకులు వెంటనే తీర్పు ఇస్తారు. అలాగే టాస్కుల్లో ఓడిపోయినా మంచి మనసుతో ఉంటే ప్రేక్షకులు ఆదరిస్తారు. అందుకే బిగ్‌బాస్‌లో వ్యక్తిత్వం కూడా విజయానికి కీలకం" అని ఆయన అభిప్రాయపడ్డారు. ఇటీవల బిగ్‌బాస్‌లో కావాలనే గొడవలు పెడితే, అరుస్తే, హంగామా చేస్తేనే ఎక్కువ స్క్రీన్ స్పేస్ వస్తుందని కొందరు భావిస్తున్నారని నిఖిల్ అన్నారు. "అది పూర్తిగా అపోహ. మొదటి రెండు మూడు రోజులు కెమెరాలు గుర్తుంటాయి. కానీ తర్వాత కెమెరాలు ఉన్నాయనే విషయమే మర్చిపోతారు. అక్కడ పరిస్థితులు సహజంగా ఎలా ఉంటాయో అలా ప్రవర్తించడం ప్రారంభిస్తారు. ప్రేక్షకులు కూడా అదే నిజాయితీని ఇష్టపడతారు" అని చెప్పారు.

Advertisement

ఇంటర్వ్యూలో ఎక్కువగా వైరల్ అవుతున్న వ్యాఖ్య ఇదే. "బిగ్‌బాస్ ఇంట్లో అందరితో ఒకే రకమైన బంధం ఉండదు. సహజంగానే కొందరితో ఎక్కువగా మాట్లాడతాం. మన సమస్యలు, బాధలు, ఆలోచనలు మనకు దగ్గరైన వ్యక్తితోనే పంచుకుంటాం. బయట కూడా అలాగే చేస్తాం కదా. కానీ బిగ్‌బాస్ ఇంట్లో మాత్రం దాన్నే కొందరు 'వెన్నుపోటు'గా చూపించే ప్రయత్నం చేస్తారు" అని నిఖిల్ చెప్పారు. "ఒకరితో స్నేహంగా ఉండి, ఇంకొకరితో అంతగా కలవకపోతే వెంటనే వెన్నుపోటు పొడిచాడని ముద్ర వేస్తారు. కానీ నిజానికి అది సహజమైన మానవ సంబంధం మాత్రమే. మనకు కంఫర్ట్‌గా అనిపించే వ్యక్తితోనే ఎక్కువ మాట్లాడతాం. అది తప్పు కాదు" అని ఆయన వివరించారు.

సీజన్ 10 కంటెస్టెంట్లకు చివరిగా నిఖిల్ ఒక ముఖ్యమైన సలహా ఇచ్చారు. "బిగ్‌బాస్‌లోకి వెళ్లాక ఎవరో ఒకరిని అనుకరించడానికి ప్రయత్నించొద్దు. ఇతరుల కోసం మీ వ్యక్తిత్వాన్ని మార్చుకోవద్దు. గెలవాలనే ఒత్తిడితో నటించొద్దు. మీరు ఎలా ఉంటారో అలాగే ఉండండి. నిజాయితీగా ఆడండి. ప్రేక్షకులు అదే ఇష్టపడతారు" అని చెప్పారు. గత సీజన్లను ఉదాహరణగా ప్రస్తావిస్తూ నిఖిల్.. "ప్రతి సీజన్‌లో టాస్కుల్లో గెలిచిన వారే విజేతలు కాలేదు. కొన్నిసార్లు మంచి ప్రవర్తన, నిజాయితీ, ఇతరుల పట్ల గౌరవం, సహనం వంటి లక్షణాలే ప్రేక్షకులను ఎక్కువగా ఆకట్టుకుంటాయి. చివరికి విజేతను నిర్ణయించేది ప్రేక్షకులే. అందుకే బిగ్‌బాస్‌లో ట్రోఫీ గెలవాలంటే ముందుగా ప్రజల మనసు గెలవాలి" అని వ్యాఖ్యానించారు.