Gunde Ninda Gudi Gantalu:'గుండె నిండా గుడిగంటలు' మంగళవారం ఎపిసోడ్‌లో కుటుంబ గౌరవం, ప్రేమ, భావోద్వేగాలు, సరదా సన్నివేశాలతో కథ ఆసక్తికరంగా సాగింది. శృతి ఉద్యోగం విషయంలో ప్రభావతి ఇంటికి వచ్చిన శోభ, మీనా-బాలు చేసే పనులను అవమానిస్తూ బ్లాంక్ చెక్ ఇచ్చి వారిని డబ్బుతో కొనాలనుకుంటుంది. అయితే బాలు చెక్‌పై రూ.50 కోట్లు రాసి ఆమె ముందే చించి, "మమ్మల్ని డబ్బుతో కొనలేరు" అంటూ గట్టి సమాధానం ఇవ్వడంతో శోభ షాక్ అవుతుంది. అనంతరం సత్యం తన కుమారుడు బాలను కుటుంబ గౌరవాన్ని కాపాడినందుకు అభినందించగా, మనోజ్ అసూయపడతాడు.

Advertisement

మరోవైపు గుడిలో మురళికి ప్రేమను వ్యక్తం చేయడానికి కానిస్టేబుల్ అరుణ్ ధైర్యం చెప్పడంతో, మురళి విద్యకు ప్రపోజ్ చేయడానికి ప్రయత్నిస్తాడు. అయితే విద్య వెంటనే సమాధానం ఇవ్వకుండా ఓపిక పట్టాలని చెప్పడంతో అతనికి ఆశలు చిగురిస్తాయి. అదే సమయంలో సుమతి కూడా అరుణ్‌కు ముందుగా స్నేహితులుగా ఉండి, తర్వాత తన మనసులోని మాట చెబుతానని హామీ ఇస్తుంది. ఇక సుందరి పెళ్లి ఏర్పాట్లలో బడ్జెట్ లెక్కలు వేస్తూ కుటుంబ సభ్యులు సరదాగా గడుపుతారు. చివర్లో శోభ మరోసారి ప్రభావతికి ఫోన్ చేసి శృతి ఉద్యోగం మాన్పించాలని ఒత్తిడి చేయడంతో, ప్రభావతి కుటుంబ సభ్యులందరినీ పిలిచి ఈ విషయంపై చర్చ ప్రారంభిస్తుంది. బాలు నిజం బయటపెట్టడంతో ఇంట్లో మరోసారి ఉద్రిక్త పరిస్థితులు నెలకొంటాయి. తదుపరి ఎపిసోడ్‌పై ఆసక్తి పెంచుతూ కథ ముగుస్తుంది.

Advertisement

Courtesy: jiohotstar

గుండె నిండా గుడిగంటలు బుధవారం ఎపిసోడ్‌లో శోభ ఇచ్చిన బ్లాంక్ చెక్ వ్యవహారం ఇంట్లో పెద్ద చర్చకు దారితీసింది. డబ్బు కోసం ఆత్మగౌరవాన్ని పక్కన పెట్టాలా? లేక స్వాభిమానంతోనే ముందుకు సాగాలా? అనే అంశంపై కుటుంబ సభ్యుల మధ్య తీవ్ర వాదనలు జరిగాయి. ఒకవైపు బాలు రవి ఆత్మగౌరవాన్ని కాపాడాలని గట్టిగా నిలబడగా, మరోవైపు రోహిణి, మనోజ్ మాత్రం శోభ ఇచ్చే ఆర్థిక సహాయాన్ని తీసుకోవడంలో తప్పేమీ లేదని వాదించారు. దీంతో ఇంట్లో మరోసారి ఉద్రిక్త వాతావరణం నెలకొంది.

ప్రభావతి ఇంట్లో జరిగిన గొడవ, శోభ ఇచ్చిన బ్లాంక్ చెక్, బాలు ఆ చెక్కును చించి పారేసిన విషయం గురించి రోహిణి, మీనా కలిసి రవి, శృతికి వివరిస్తారు. ఈ విషయం విన్న శృతి ఆశ్చర్యానికి గురవుతుంది. "మా అమ్మ రెస్టారెంట్ పెట్టుకోవడానికి డబ్బులు ఇస్తానంటే ఎందుకు తీసుకోలేదు? అందులో తప్పేముంది?" అని రవిని ప్రశ్నిస్తుంది. దానికి రవి ప్రశాంతంగా స్పందిస్తూ, "ఈరోజు డబ్బు తీసుకుంటే రేపు అదే విషయాన్ని మన మీద ఆయుధంలా వాడతారు. ఏదో ఒక సందర్భంలో మన ఆత్మగౌరవాన్ని దెబ్బతీసే మాటలు తప్పవు. అందుకే ఆ డబ్బు తీసుకోవడం నాకు ఇష్టం లేదు" అని తన అభిప్రాయాన్ని స్పష్టం చేస్తాడు.

Advertisement

ఈ సమయంలో రోహిణి కూడా తన వాదనను వినిపిస్తుంది. "అందులో తప్పేముంది? శృతి వాళ్ల తల్లిదండ్రుల ఆస్తికి ఆమె ఒక్కతే వారసురాలు. ఈరోజు సహాయం తీసుకున్నా, రేపు ఆస్తి కూడా ఆమెకే వస్తుంది. మరి ఇప్పుడు డబ్బు తీసుకోవడంలో తప్పేంటి?" అని ప్రశ్నిస్తుంది. అయితే బాలు వెంటనే స్పందిస్తూ, "ఇది ఆస్తి గురించి కాదు... ఆత్మగౌరవానికి సంబంధించిన విషయం. పెళ్లి సమయంలో కూడా శృతి తండ్రి మా నాన్నను డబ్బు కోసం అవమానించాడు. రవిని కూడా డబ్బు కోసమే పెళ్లి చేసుకున్నాడని మాటలు అన్నాడు. అలాంటి వాళ్ల దగ్గర నుంచి మళ్లీ డబ్బు తీసుకుంటే రేపు అదే విషయాన్ని పట్టుకుని మనల్ని అవమానిస్తారు. అందుకే ఈ నిర్ణయం" అంటూ గట్టిగా సమాధానం చెబుతాడు.

Advertisement

ఈ చర్చలో మనోజ్ మరోసారి చిచ్చు పెట్టే ప్రయత్నం చేస్తాడు. "బాలు, మీనా మీరు ఇద్దరూ రవి ఎదగడం ఇష్టంలేకే ఇలా మాట్లాడుతున్నారు. మంచి అవకాశం వచ్చినా వద్దంటున్నారు" అంటూ రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తాడు. అయితే బాలు మాత్రం అతడిని అడ్డుకుంటూ, "అనవసరంగా గొడవలు పెట్టకు. ఇది రవి వ్యక్తిత్వానికి, ఆత్మగౌరవానికి సంబంధించిన విషయం. డబ్బు తీసుకోవాలా? వద్దా? అనేది అతడే నిర్ణయించుకోవాలి. మనం అతనిపై మన అభిప్రాయాన్ని రుద్దకూడదు" అని స్పష్టం చేస్తాడు.

ఇంట్లో అందరూ వెళ్లిపోయిన తర్వాత రవి ఒంటరిగా కూర్చుని జరిగిన సంఘటనల గురించి ఆలోచిస్తాడు. ముఖ్యంగా శృతి, "నీ మెంటాలిటీ ఇలాగే ఉంటే మనం జీవితంలో ఎదగలేం. అమ్మ ఇచ్చే డబ్బు తీసుకోవడంలో తప్పు లేదు" అంటూ తన తల్లి వైపు నిలబడిన మాటలు అతనిని తీవ్రంగా కలచివేస్తాయి. ఒకవైపు భార్య అభిప్రాయం, మరోవైపు తన ఆత్మగౌరవం మధ్య రవి తీవ్ర మానసిక సంఘర్షణలో పడతాడు.

Advertisement

ఇదే సమయంలో బాలు, మనోజ్ ఇద్దరూ దాబాపై మాట్లాడుకుంటారు. మనోజ్, "ఎంతోమంది అత్తమామల సహాయంతో జీవితంలో ఎదిగారు. విలువలు, ఆత్మగౌరవం అంటూ కూర్చుంటే అవకాశాలు కోల్పోతారు" అంటూ రవికి డబ్బు తీసుకోవాలని సూచిస్తాడు. కానీ బాలు మాత్రం, "ఈరోజు డబ్బు తీసుకుంటే రేపు అదే డబ్బు గురించి మాటలు వినాల్సి వస్తుంది. అప్పుడు జీవితం కుక్కలు చింపిన విస్తరిగా మారుతుంది. డబ్బుకంటే మనిషి వ్యక్తిత్వం గొప్పది" అంటూ గట్టిగా హెచ్చరిస్తాడు.

ఈ క్రమంలో మనోజ్, "నువ్వు కూడా ఇంకా ఈఎంఐలు కడుతూనే ఉన్నావు. ఎదగలేదు. ఇంకొకరిని కూడా ఎదగనివ్వడం లేదు" అని వ్యంగ్యంగా మాట్లాడుతాడు. దానికి బాలు ఒక్కసారిగా, "నువ్వు నాన్న దగ్గర తీసుకున్న 40 లక్షలు ముందు తిరిగి ఇవ్వు. అందులో మా వాటా తర్వాత చూసుకుందాం. ముందుగా రవికి రావాల్సిన 15 లక్షలు ఇచ్చేయ్" అంటూ నిలదీయడంతో మనోజ్ దగ్గర సమాధానం ఉండదు. వెంటనే మాట మార్చి అక్కడి నుంచి వెళ్లిపోతాడు.

Advertisement

మరోవైపు రోహిణి, మీనా, శృతి మధ్య కూడా ఇదే అంశంపై చర్చ జరుగుతుంది. రోహిణి, "రవి చాలా ఫూలిష్‌గా ఆలోచిస్తున్నాడు" అని అనగానే మీనా అభ్యంతరం వ్యక్తం చేస్తుంది. "ఇది మూర్ఖత్వం కాదు... ఆత్మగౌరవం. ఈరోజు డబ్బు తీసుకుని రేపు అవమానం ఎదురైతే రవి ఒక్క క్షణం కూడా అక్కడ ఉండడు. అప్పుడు మీ ఇద్దరి జీవితం రోడ్డున పడే పరిస్థితి వస్తుంది. నేను డబ్బు తీసుకోవద్దని చెప్పడం లేదు. కానీ నిర్ణయం పూర్తిగా రవిదే" అంటూ శృతికి అర్థమయ్యేలా వివరిస్తుంది.

అయినా రోహిణి, "మీనా మీ ఇద్దరూ ఎదగకుండా చేయాలనే ఇలా మాట్లాడుతోంది" అంటూ మరోసారి శృతిని రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తుంది. దీంతో మీనా కూడా ఏమాత్రం వెనక్కి తగ్గకుండా, "మీరు కూడా మామయ్య దగ్గర నుంచి 30 లక్షలు తీసుకున్నారు కదా. అందులో రవికి రావాల్సిన వాటా ముందుగా ఇవ్వండి. ఆ తర్వాత ఈ విషయంపై మాట్లాడండి" అంటూ గట్టి కౌంటర్ ఇస్తుంది. ఆ మాటలకు రోహిణి ఒక్కసారిగా నోరు మూసుకుని అక్కడి నుంచి వెళ్లిపోతుంది. చివరగా మీనా శృతిని ప్రశాంతంగా ఉద్దేశించి, "మీ ఇద్దరి జీవితానికి సంబంధించిన నిర్ణయం మీరే తీసుకోవాలి. కానీ డబ్బు కారణంగా మీ ఇద్దరి మధ్య దూరం పెరగకుండా చూసుకో. రవి ఆత్మగౌరవాన్ని కూడా అర్థం చేసుకో" అంటూ విలువైన సలహా ఇస్తుంది.