Gundeninda Gudigantalu Weekly Roundup: గుండె నిండా గుడిగంటలు ప్రస్తుతం రసవత్తరంగా నడుస్తోంది. స్టార్ మాలో ప్రసారం అవుతున్న ఈ సీరియల్ కు ప్రస్తుతం మంచి ఆదరణ దక్కుతోంది. ఈ సందర్భంగాజూలై 13వ తేదీ నుంచి జూలై 17వ తేదీ వరకు 725 నుంచి 729వ ఎపిసోడ్స్ వరకు ఏం జరిగిందనే వివరాల్లోకి వెళితే..
సోమవారం ఎపిసోడ్‌లో భావోద్వేగాలు, కామెడీ, కుటుంబ గొడవలతో కథ ఆసక్తికరంగా సాగింది. విద్య తన ప్రేమ విషయంపై మీనా సలహా తీసుకుంది. వెంటనే ప్రేమను చెప్పకుండా కొంత సమయం వేచి చూడాలని నిర్ణయించింది. మరోవైపు కంటిచూపు లేక ఇబ్బంది పడుతున్న మనోజ్‌ను బాలు సరదాగా ఆటపట్టించాడు. అతడి కోసం పెట్టిన పాలను తాగేసి నవ్వులు పూయించాడు. మనోజ్ తల్లి ప్రభావతిని పొగిడినట్లు నటించి, ఆమె వెళ్లిపోయిందనుకుని వెక్కిరించాడు. అది విన్న ప్రభావతి తీవ్రంగా బాధపడింది.
Jio Hotstar ఇదే సమయంలో రోహిణి చెప్పిన క్లయింట్ స్థానంలో ఓ బిచ్చగాడు రావడంతో మనోజ్ అతడిని గౌరవంగా కూర్చోబెట్టి 'జీరో ఇన్వెస్ట్‌మెంట్ బిజినెస్' గురించి అడగడం హాస్యంగా సాగింది. ఆ తర్వాత బాలు మనోజ్‌తో దేవుడి ముందు తన తప్పులన్నీ ఒప్పించి క్షమాపణ చెప్పించాడు. అనంతరం నర్స్‌తో కంటి కట్లు విప్పించగా మనోజ్‌కు మళ్లీ చూపు వచ్చింది. దీంతో కుటుంబ సభ్యులంతా ఆనందించారు. అయితే ఆ సంతోషం ఎక్కువసేపు నిలవలేదు. శృతి తల్లి శోభ ఇంటికి వచ్చి ప్రభావతితో వాగ్వాదానికి దిగింది. బ్లాంక్ చెక్ ఇచ్చి అవమానించే ప్రయత్నం చేసింది. దీనికి బాలు, మీనా, రోహిణి గట్టిగా ఎదురు నిలిచారు. శోభ ఎంట్రీతో ఇంట్లో మరోసారి ఉద్రిక్త పరిస్థితులు నెలకొనగా, కథ కొత్త మలుపు తిరిగింది. మంగళవారం ఎపిసోడ్‌లో కుటుంబ గౌరవం, ఆత్మగౌరవం, ప్రేమ కథలు, కామెడీతో కథ ఆసక్తికరంగా సాగింది. శోభ మరోసారి ప్రభావతి ఇంటికి వచ్చి రవి-శృతి విషయంపై గొడవ చేసింది. మీనా, బాలు కష్టాన్ని తక్కువ చేసి మాట్లాడింది. దీంతో మీనా గట్టిగా ఎదురు చెప్పింది. బ్లాంక్ చెక్ ఇచ్చి అవమానించాలని చూసిన శోభకు బాలు గట్టి షాక్ ఇచ్చాడు. మొదట రూ.500 అని రాసి, చివరకు రూ.50 కోట్ల వరకు మొత్తం పెంచి, అందరి ముందే చెక్కును చించి పారేశాడు. "డబ్బుతో మా ఆత్మగౌరవాన్ని కొనలేరు" అంటూ ఘాటుగా సమాధానం ఇచ్చాడు. శోభ వెళ్లిన తర్వాత సత్యం బాలను అభినందించాడు. కుటుంబ పరువును కాపాడావని ప్రశంసించాడు. మనోజ్ అసూయతో ప్రశ్నించగా, బాలు ఆత్మగౌరవమే ముఖ్యమని మరోసారి స్పష్టం చేశాడు. మరోవైపు గుడిలో అరుణ్, సుమతి మధ్య ప్రేమకథ ముందుకు సాగింది. అరుణ్ ప్రేమను వ్యక్తం చేయగా, సుమతి కొంత సమయం కావాలని చెప్పింది. అదే సమయంలో మురళికి కూడా అరుణ్ ధైర్యం చెప్పడంతో విద్యకు ప్రేమను చెప్పేందుకు ప్రయత్నించాడు. విద్య కూడా తొందరపడొద్దని చెప్పి పరోక్షంగా గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇక సుందరి పెళ్లి ఏర్పాట్లలో బాలు, మీనా, రోహిణి బడ్జెట్ లెక్కలు వేస్తూ కనిపించారు. మీనాక్షి పట్టుచీరల డిమాండ్‌తో కామెడీ పండింది. చివర్లో శోభ ఫోన్‌తో ప్రభావతి మళ్లీ ఇంట్లో అందరినీ సమావేశానికి పిలవడంతో, శృతి ఉద్యోగం అంశంపై మరో పెద్ద వివాదానికి తెరలేచింది. తదుపరి ఎపిసోడ్‌పై ఆసక్తి పెరిగింది. బుధవారం ఎపిసోడ్‌లో కుటుంబంలో ఆత్మగౌరవం, డబ్బు అంశంపై పెద్ద చర్చ జరిగింది. శోభ ఇచ్చిన బ్లాంక్ చెక్‌ను బాలు చించి వేయడంతో ఇంట్లో వాదనలు మొదలయ్యాయి. శృతి డబ్బు తీసుకోవడంలో తప్పేముందని ప్రశ్నిస్తుంది. కానీ రవి, బాలు మాత్రం ఆత్మగౌరవం కోసం ఆ సహాయాన్ని తిరస్కరించామని చెబుతారు. మనోజ్, రోహిణి మాత్రం డబ్బు తీసుకుని ఎదగాలని వాదిస్తారు. బాలు వారికి గట్టి కౌంటర్ ఇస్తాడు. మనోజ్ తీసుకున్న 40 లక్షల రూపాయలు, రవికి రావాల్సిన వాటా గురించి ప్రశ్నించడంతో అతడు మౌనంగా వెళ్లిపోతాడు. మీనా కూడా రోహిణికి అదే విషయంపై సమాధానం చెబుతుంది. ఇక మీనా జీవితంలో భారీ అవకాశం వస్తుంది. ఓ ఈవెంట్ మేనేజర్ రూ.10 లక్షల విలువైన డెకరేషన్ కాంట్రాక్ట్ ఇస్తాడు. అడ్వాన్స్‌గా రూ.1 లక్ష కూడా అందజేస్తాడు. చదువు రాకపోయినా తొందరపెట్టి అగ్రిమెంట్‌పై సంతకం చేయిస్తాడు. అయితే ఇదంతా చింతామణి పన్నిన కుట్ర అని ప్రేక్షకులకు తెలుస్తుంది. ఇంటికి వచ్చిన మీనా ఈ శుభవార్తను బాలుతో పంచుకుంటుంది. బాలు ఆనందంతో ఆమెను ఎత్తుకుని తిప్పుతాడు. కుటుంబ సభ్యులు అభినందిస్తారు. మనోజ్ మాత్రం వెటకారం చేయగా, బాలు తన చికిత్స కోసం ఖర్చు చేసిన రూ.2 లక్షలు తిరిగి ఇవ్వాలని నిలదీస్తాడు. చివరగా బాలుకు కూడా రూ.90 వేల విలువైన లాంగ్ ట్రిప్ ఆర్డర్ వస్తుంది. కస్టమర్లతో ఇంగ్లీష్‌లో మాట్లాడి అందరినీ ఆశ్చర్యపరుస్తాడు. మరోవైపు చింతామణి కుట్రతో మీనా జీవితంలో కొత్త సమస్యకు బీజం పడుతుంది. గురువారం ఎపిసోడ్‌లో వరుస ట్విస్టులు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. బాలు జీవితంలో కొత్త మలుపు తిరిగింది. నార్త్ ఇండియా కస్టమర్లతో అతడు ఇంగ్లీష్‌లో మాట్లాడి అందరినీ ఆశ్చర్యపరిచాడు. బాలు టాలెంట్ చూసి మీనా గర్వపడుతుంది. "మీరు చదువు పూర్తి చేసి ఉంటే పెద్ద ఆఫీసర్ అయ్యేవారు" అని చెబుతుంది. దానికి బాలు, "అలా అయితే నీలాంటి భార్య నాకు దక్కేది కాదు" అని ప్రేమగా చెప్పడంతో ఇద్దరి మధ్య ఎమోషనల్ సీన్ ఆకట్టుకుంది. ఇద్దరికీ రూ.10 లక్షల డెకరేషన్ ఆర్డర్ రావడంతో ఆనందపడతారు. అయితే పెట్టుబడి కోసం మీనా బ్యాంకుకు వెళ్లినా లోన్ నిరాకరిస్తారు. షూరిటీ, ట్రాన్సాక్షన్ హిస్టరీ లేదని మేనేజర్ స్పష్టం చేస్తాడు. దీంతో మీనా నిరాశ చెందుతుంది. అదే సమయంలో ఓ బ్యాంకు ఉద్యోగి ఫైనాన్షియర్ సింగరాజు వద్దకు వెళ్లమని సూచిస్తాడు. శివ కూడా అక్కతో కలిసి వెళ్లాలని నిర్ణయించుకుంటాడు. మరోవైపు లాంగ్ ట్రిప్‌లో ఉన్న బాలు, డబ్బు కోసం రవికి ఫోన్ చేస్తాడు. రవి వెంటనే సహాయం చేస్తానని చెబుతాడు. శృతి కూడా మీనాకు అండగా నిలుస్తుంది. అవసరమైతే డబ్బు సర్దుబాటు చేస్తామని ధైర్యం చెబుతుంది. ఇదిలా ఉండగా చింతామణి తన అసలు ప్లాన్‌ను ప్రభావతికి చెబుతుంది. ఈ ఆర్డర్‌తోనే మీనా బిజినెస్‌ను ముగిస్తానని చెప్పి సంబరపడుతుంది. ప్రభావతి కూడా ఆనందంతో గాల్లో తేలిపోతుంది. మరోవైపు చింతామణి పన్నిన కుట్ర ఏమిటనే ఉత్కంఠతో ఎపిసోడ్ ముగుస్తుంది. శుక్రవారం ఎపిసోడ్‌లో మీనా జీవితంలో భారీ షాక్ ఎదురైంది. పది లక్షల కాంట్రాక్ట్ పూర్తి చేయడానికి ఫైనాన్షియర్ సింగరాజు వద్ద నుంచి 9 లక్షల రూపాయలు అప్పుగా తీసుకుంది. తన కష్టాన్ని గుర్తించిన సింగరాజు డబ్బు ఇచ్చాడు. అయితే అతడే చింతామణి భర్త అని ఫ్యామిలీ ఫొటో చూసి మీనా తెలుసుకుంటుంది. మరోవైపు మీనా చేసిన డెకరేషన్‌ను చూసి అందరూ ప్రశంసిస్తారు. కానీ చింతామణి మాత్రం అసూయతో రగిలిపోతుంది. మీనాను బిజినెస్ నుంచి పూర్తిగా తప్పించాలని ప్లాన్ వేస్తుంది. పని పూర్తయ్యాక మిగిలిన 9 లక్షల రూపాయలు అడగడానికి వెళ్లిన మీనాకు షాక్ తగులుతుంది. ఈవెంట్ మేనేజర్ తాను ఇప్పటికే పది లక్షలు ఇచ్చానని చెబుతాడు. అగ్రిమెంట్‌లో కూడా అలాగే సంతకం ఉందని చూపిస్తాడు. తాను మోసపోయానని మీనా గ్రహించి కన్నీళ్లు పెట్టుకుంటుంది. ఇదంతా చూసి చింతామణి ఆనందపడుతుంది. ప్రభావతికి ఫోన్ చేసి జరిగిన విషయం చెబుతుంది. దీంతో ప్రభావతి కూడా సంబరపడుతూ ఇంట్లో పండుగ చేసుకోవాలని నిర్ణయిస్తుంది. అటు శ్రుతికి మాత్రం ప్రభావతి ప్రవర్తనపై అనుమానం వస్తుంది. బాలు, మీనాకు ఏదో కష్టం వచ్చి ఉంటుందని భావిస్తుంది. చివరగా మీనా ఫంక్షన్ హాల్ ఓనర్‌ను కలిసి తనకు జరిగిన అన్యాయం చెబుతుంది. కానీ మేనేజర్ అబద్ధాలు చెప్పి తప్పించుకునే ప్రయత్నం చేస్తాడు. అంతేకాదు, మీనా భర్త గురించి కూడా అవమానకరంగా మాట్లాడటంతో మీనా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తుంది. అక్కడితో ఎపిసోడ్ ముగుస్తుంది.More Articles