Photo Courtesy: JioHotstar
మాలిని, శివన్నారాయణలపై గెలిచి ఇంటికొచ్చిన దీప, కార్తీక్‌లను కాంచన మెచ్చుకుంటుంది. దీపకి దిష్టి తీయాలని, అందరి కళ్లూ నా కోడలి మీదే ఉంటాయని అంటుంది. అందరూ ఏమో కానీ పారు దిష్టి మాత్రం గట్టిగానే తగులుతుంది.. తాత మీద అసలే పీకల దాకా కోపం. అందుకే పురిటిలోనే అని చెప్పబోతూ కార్తీక్ ఆగిపోతాడు. పురిటిలోనే జ్యోత్స్నను తన మనవరాలిగా పెంచడం మొదలుపెట్టిందని చెబుతాడు. జ్యోత్స్న కాలికి దెబ్బ తగలగానే మా కంటే ఎక్కువగా రియాక్ట్ అయ్యావు ఎందుకు అని సూరజ్‌ని నిలదీస్తుంది సుమిత్ర. ఆ టైంలో నేను అవేవీ ఆలోచించలేదు.. తనకి రక్తం కారుతోండటంతో వెంటనే కట్టు కట్టానని చెబుతాడు సూరజ్. ఎక్కువగా చనువు తీసుకోనుంటే క్షమించమని అంటాడు. నేనే నీకు థ్యాంక్స్ చెప్పాలి.. అసలు మీ తల్లిదండ్రులు ఎవరు? మీ కుటుంబం ఎక్కడుంటుందని సుమిత్ర అడుగుతుంది. సూరజ్ కంగారు పడుతుండగా ఇంతలో పారు పిలవడంతో సుమిత్ర వెళ్లిపోతుంది.
ఉదయాన్నే కాంచన ఇంటికి మాలిని రావడంతో దీప, కాంచనలు షాక్ అవుతారు. మీ జీవితాల్ని శివన్నారాయణ గారు ఇలాంటి ఇంటిలో పడేశాడు.. మీరు నాతో కలిసిపోతే మీ జీవితాలు మారిపోతాయని పండ్లు, బ్లాంక్ చెక్ ఇస్తుంది. దాంతో కార్తీక్ రగిలిపోతాడు.. తల్లి మాట విని సైలెంట్ అయిపోతాడు. అత్త అంత తేలికగా వదిలిపెట్టదు.. ఏదో ఒకటి చేస్తుందని కార్తీక్‌కి నచ్చచెబుతుంది దీప. ఇంతలో ఇంట్లో నుంచి శివన్నారాయణ మాటలు వినిపించడంతో ఇద్దరూ లోపలికి వెళ్తారు. ఆ చెక్, పండ్ల బుట్ట తీసుకుని పదా అని సూరజ్‌తో కలిసి దక్షిణామూర్తి ఇంటికి వెళ్తాడు శివన్నారాయణ. ఇదంతా గత ఎపిసోడ్‌లో హైలైట్‌గా జరిగింది. మరి జూలై 23వ తేదీ 730వ ఎపిసోడ్‌లో ఏం జరిగిందంటే?
Photo Courtesy: JioHotstar దక్షిణామూర్తి ఇంటికి కోపంగా వెళ్తాడు శివన్నారాయణ. పాత మిత్రుడిని చూడగానే దక్షిణామూర్తి సంతోషిస్తాడు. నా ఇంటకి రాను అన్నావు.. నేను అడ్రస్ ఇవ్వకపోయినా వెతుక్కుంటూ వచ్చావు. నా గుమ్మం తొక్కినవాడిని నా బంధువు అనుకుంటాను, విస్తరి వేసి కడుపు నిండా భోజనం పెట్టి పంపిస్తానని చెప్పి మాలినిని పిలుస్తాడు దక్షిణామూర్తి. ఇంటికి శివన్నారాయణ, కార్తీక్, సూరజ్ రావడంతో మాలిని షాక్ అవుతుంది. వీటిని చూడగానే నీకు ఎందుకు వచ్చామో అర్ధం కావడం లేదా అని మండిపడతాడు శివన్నారాయణ. నేను వచ్చింది మా తాత కోసం ఈ ఇంటితో కానీ, ఈ ఇంటితో మనిషితో కానీ నాకు సంబంధాలు లేవని అంటాడు కార్తీక్. శివన్నారాయణ అంశ కాంచన కడుపులో పురుడు పోసుకుంది. నీ మాట తీరు నాకు బాగా నచ్చిందని అంటాడు దక్షిణామూర్తి. మీరు ఇచ్చిందే మీకు ఇవ్వడానికి వచ్చానని కాలు మీద కాలు వేసుకుని సీరియస్‌గా కూర్చొంటాడు శివన్నారాయణ. గతంలో మన కుటుంబాల మధ్య ఏం జరిగిందనేది ఇప్పుడు అనవసరం, బంధాలు వద్దు అనుకున్నాం, విడిపోయాం. మీరెప్పుడూ ఎదురుపడనంత దూరం వచ్చి నేను వ్యాపారం మొదలుపెట్టాను. ఇప్పుడు నేనేంటో, నా స్థాయి ఏంటో నా చేతిలో ఓడిపోయిన మీకు బాగా తెలుసు. ఏం జరిగిందో, ఏం అనుకున్నారో తెలియదు మళ్లీ నా ఇంటికి వచ్చారు, నా ఆఫీస్‌కి వచ్చారు, నా రెస్టారెంట్ ముందే మీ హోటల్స్ పెట్టారు. పోటీకి వచ్చారు.. పోటీకి దింపారు, ఇష్టం లేకపోయినా నా కోడలి కోసం సరేనని చెప్పాను. అక్కడ కూడా నిజాయితీని గాలికొదిలేసి మీరింకా పాత మనుషుల్లాగే మిగిలిపోయారని చెబుతాడు శివన్నారాయణ. అందుకు మీరు నాకు థ్యాంక్స్ చెప్పాలి.. మీరు నమ్మిన మనుషుల్లో నిజాయితీ లేదని, నా డబ్బుతో నిరూపించానని అంటుంది మాలిని. పోటీ అయిపోయింది ఇక నో జోలికి రారేమో అనుకున్నాను, నా అంచనాని అబద్ధం చేస్తూ ఉదయాన్నే నా కూతురి ఇంటికి నీ కోడలిని పంపించావు. ఫ్రూట్స్ ఇవ్వడం ఏంటీ? బ్లాంక్ చెక్ ఇవ్వడం ఏంటని నిలదీస్తాడు శివన్నారాయణ. కాంచన ఆరోగ్య పరిస్ధితి చూసి జాలేసింది, తోబుట్టువు లాంటి కాంచన కష్టాన్ని తెలుసుకోవడానికి గొంతు విప్పక్కర్లేదని అంటుంది మాలిని. అదే వీధిలో మరో నాలుగైదు పెంకుటిల్లులు ఉన్నాయి.. అక్కడికి కూడా వెళ్లి బ్లాంక్ చెక్ ఇవ్వాల్సిందని మండిపడతాడు శివన్నారాయణ. కాంచన నాకు వరుసకు అక్క అవుతుందని మాలిని చెబుతుంది. వరుస కలిపేంత అధికారం నీకు ఎవరు ఇచ్చారు అని ప్రశ్నిస్తాడు శివన్నారాయణ. కాంచనని నువ్వు అనాథలా ఎందుకు వదిలేశావని ప్రశ్నిస్తుంది మాలిని. మా నాన్న మా అమ్మని అనాథలా వదిలేశాడని నీతో చెప్పిందా? అని ప్రశ్నిస్తాడు కార్తీక్. నీ తల్లికి అన్యాయం జరిగింది, ముందు అది గుర్తించు.. లండన్‌లో చదువుకున్నది మీ మరదలికి డ్రైవర్‌గా పనిచేయడానికా? అని ప్రశ్నిస్తుంది మాలిని. నేను పనిచేస్తున్నది నా వాళ్ల కోసం.. ఇక్కడ ఎవరికి నచ్చినట్లు వాళ్లు బతుకుతున్నారని చెబుతాడు కార్తీక్. మమ్మల్ని వదిలేయండి మాకు మీ మాట సాయం, మీ డబ్బు సాయం నాకు అవసరం లేదని తేల్చేస్తాడు. కాంచన తండ్రి ఇంకా బతికే ఉన్నాడు.. నా కూతురు తీసుకుంటానంటే ఏదైనా ఇవ్వడానికి ఈ తండ్రి సిద్దంగా ఉన్నాడు. కానీ నేను ఎప్పుడో అన్న మాటను పట్టుకుని ఏం ఇచ్చినా తీసుకోవడం లేదు. కన్నతండ్రి ఇస్తేనే తీసుకోదు.. నువ్వు ఇస్తే ఎలా తీసుకుంటుంది? మరోసారి మీ ఇద్దరిలో ఎవరూ నా కూతురు ఇంటికి రావడానికి వీల్లేదని మండిపడతాడు శివన్నారాయణ. నా కూతురు, ఆమె భర్త గురించి మాట్లాడటానికి నువ్వు ఎవరు? మనం కలవడం ఇదే ఆఖరిసారి కావాలని అనుకుంటున్నాను అంటాడు శివన్నారాయణ. నీకు దమ్ముంటే వీడిని కొని చూపించు అని సూరజ్ మీద చేయ్యేసి సవాల్ చేస్తాడు. కార్తీక్, సూరజ్‌లే ఈ శివన్నారాయణ ల్యాండ్ మార్క్స్ అంటాడు. వీళ్లని దాటితే మరో ఇద్దరు ఉన్నారు.. నా మనవరాళ్లు జ్యోత్స్న, దీప.. వాళ్లని దాటితే మరో ఇద్దరు ఉన్నారు నా కోడలు సుమిత్ర, నా కూతురు కాంచన. వాళ్లని దాటితే మరో ఇద్దరు ఉన్నారు.. నా కొడుకు దశరథ, నా అల్లుడు శ్రీధర్... ఇది నా కుటుంబం, ఇది నా బలం. అవమానించడానికి వచ్చి అవమానం పడొద్దని చెబుతాడు శివన్నారాయణ. ఇచ్చింది నాకు ఇవ్వడం అలవాటు లేదని మాలిని ముందు రూపాయి పెట్టి కౌంటర్ ఇస్తాడు శివన్నారాయణ. మరోసారి మీరు నాకు ఎదురుపడొద్దని చెబుతాడు. మాలిని తన ఇంటికి వచ్చినట్లు కాంచన చెప్పడంతో సుమిత్ర షాక్ అవుతుంది. ఈ విషయాన్ని నేను మా నాన్నకి చెప్పాను.. మా నాన్న కార్తీక్‌ని తీసుకుని వాళ్లింటికి వెళ్లాడని అంటుంది కాంచన. అత్త మంచి పని చేసింది, మనం ఇలా భయపడుతూ ఉంటేనే ఆ మనుషులు మనింటి వరకు వస్తున్నారు. ఒకసారి మనం కూడా ఆ ఇంటికి వెళ్తేనే కదా మనం ఏంటో తెలిసేదని చెబుతుంది జ్యోత్స్న. ప్రాణ స్నేహితులు కాస్తా ప్రాణ శత్రువులు అయ్యారు.. దక్షిణామూర్తి ఇంట్లో శివన్నారాయణ గారు శివతాండవం ఆడి ఉంటారని అంటుంది పారిజాతం. ఇంతలో శివన్నారాయణ వచ్చి అక్కడేం జరిగిందో చెబుతాడు. వాళ్ల జీవిత లక్ష్యం నా మీద గెలవడం కాదు.. నన్ను నాశనం చేయాలి, దాని కోసం ఎక్కడి వరకైనా వెళ్తారు. మన చుట్టూ ఉన్న వాళ్లనే మన మీద ఆయుధంగా వాడుతుంది మాలిని.. అందుకే జాగ్రత్తగా ఉండాలి. చెఫ్ లాంటి వారిని కొనగలవు.. కానీ అమ్ముడుపోనీ సూరజ్ లాంటి వాడు కూడా ఉంటాడని చెప్పడానికి అతనిని తీసుకెళ్లాను. మాలిని కానీ, దక్షిణామూర్తి కానీ ఇక్కడితో ఆగతారు.. మనల్ని ట్రాప్ చేయడానికి ఏదో రకంగా ప్రయత్నిస్తారు. ఈ ఇంట్లో బలహీనంగా ఉండేది నువ్వే జాగ్రత్తగా ఉండమని పారిజాతానికి చెబుతాడు శివన్నారాయణ. మీ వరకు వస్తే సమాధానం గట్టిగా చెప్పాలని అంటాడు సూరజ్. శ్రీధర్ వస్తున్నాడు అతనితో ఈ విషయాలు చెప్పొద్దని కాంచనకి చెబుతాడు. నీ విషయంలో నేను తప్పు చేశానని మాలిని అన్నది.. అది నిజమని నువ్వు నమ్ముతున్నావా అని కాంచనని అడుగుతాడు శివన్నారాయణ. మా అమ్మకి అన్యాయం చేశావని నువ్వు అనుకుంటున్నావా అని కార్తీక్ అడగ్గా.. ఔను అని సమాధానం చెబుతాడు శివన్నారాయణ. ఇంతటితో ఎపిసోడ్ ముగుస్తుంది.More Articles