Photo Courtesy: JioHotstar

శివన్నారాయణ ఇంటికొచ్చి వార్నింగ్ ఇవ్వడంతో మాలినిపై కోప్పడతాడు దక్షిణామూర్తి. నువ్వు అనవసరంగా కాంచన ఇంటికి వెళ్లావని సీరియస్ అవుతాడు. కాంచన కుటుంబం పేదరికంలో ఉండటం చూసి తట్టుకోలేక చెక్ ఇచ్చాను, అయినా బాబాయి బలం కుటుంబం, దానిని తగ్గించాల్సిందేనని చెబుతుంది. మరోసారి ఇలాంటివి చేసేటప్పుడు నాతో చెప్పి చేయమని అంటాడు దక్షిణామూర్తి. ఆఫీస్‌లో సూరజ్ తనను అదేపనిగా చూస్తుండటంతో కోప్పడుతుంది జ్యోత్స్న. నాకు సైట్ కొట్టడానికి నీకు సిగ్గులేదా? అని నిలదీస్తుంది. నేను నీకు సైట్ కొడుతున్నానని నీకెలా తెలుసని సూరజ్ అడగ్గా.. నువ్వు చూస్తున్నప్పుడు నేను చూశానని అంటుంది.

Advertisement

ఇంతలో దీప రావడంతో ఇద్దరూ సైలెంట్ అయిపోతారు. జ్యోత్స్నకి పారు ఫోన్ చేసి అర్జెంట్‌గా ఒకచోటికి వెళ్లాలని, వచ్చేటప్పుడు ఫోన్ అక్కడే వదిలేసి రమ్మని చెబుతుంది. పారు ఏదో ప్లాన్ చేసినట్లుగా ఉందని అనుకుని ఆమె చెప్పినట్లే చేస్తుంది జ్యోత్స్న. దాంతో ఆమెను మాలిని ఇంటికి తీసుకెళ్తుంది పారు. మాలినిని చూడగానే తాత చెప్పింది మరిచిపోయావా? నన్నెందుకు ఇక్కడికి తీసుకొచ్చావని గ్రానీ మీద ఫైర్ అవుతుంది జ్యోత్స్న. నీలో మీ తాత లక్షణాలు కానీ, మీ కుటుంబంలో ఎవరి లక్షణాలు కనిపించడం లేదని మాలిని చెప్పడంతో జ్యోత్స్న, పారులు షాక్ అవుతారు. నువ్వు అడిగితే నా ఆస్తిలో సగం రాసిస్తానని మాలిని ఆఫర్ ఇవ్వడంతో జ్యోత్స్న, పారులు ఉలిక్కిపడతారు. జ్యోత్స్న కనిపించకపోవడం, పారు ఫోన్ స్విచ్ఛాఫ్ రావడంతో శివన్నారాయణ, కార్తీక్‌లు కంగారుపడతారు. ఇదంతా గత ఎపిసోడ్‌లో హైలైట్‌గా జరిగింది. మరి జూలై 25వ తేదీ 732వ ఎపిసోడ్‌లో ఏం జరిగిందంటే?

Advertisement

Photo Courtesy: JioHotstar

నా ఆస్తిలో సగం వాటా ఇస్తానని మాలిని చెప్పడంతో .. నువ్వంటే నీ మేనత్తకి ఎంత ప్రేమో చూశావా అని అంటుంది పారు. నాకు ఎవరి ప్రేమలు అవసరం లేదు, నేను వెళ్తానని అంటుంది జ్యోత్స్న. నీకేం కావాలన్నా.. ఏం కావాలన్నా ఈ మేనత్త మాలిని ఉందని మరిచిపోవద్దని చెబుతుంది. మీరు నా యోగక్షేమాల గురించి ఆలోచించాల్సిన అవసరం లేదని కోపంగా వెళ్లిపోతుంది జ్యోత్స్న. ఇంతలో మాలిని ఉంగరం కిందపడటంతో కిందకి వంగి తీస్తుంది పారు. ఆ దెబ్బకి ఆమె మెడ నొప్పి తగ్గిపోతుంది. ఈ ఉంగరాన్ని నీ దగ్గరే ఉంచుకో.. అడగ్గానే నా మేనకోడల్ని నా ఇంటికి తీసుకొచ్చావు, నా గుర్తుగా ఈ ఉంగరాన్ని నీ దగ్గరే పెట్టుకోమని చెబుతుంది మాలిని. మన మధ్య స్నేహం ఇలాగే ఉండాలని అంటుంది. జ్యోత్స్న మనసులో ఉన్న అబ్బాయి ఎవరు అని మాలిని అడగ్గా.. దాని శత్రువు మొగుడు అని పారు చెప్పడంతో మాలిని షాక్ అవుతుంది. నీతో ఆడుకోవడానికి నాకో అవకాశం దొరికింది శివన్నారాయణ అనుకుని సంతోషపడుతుంది.

Advertisement

భర్త కోసం కాంచన ఎదురుచూస్తూ ఉంటుంది. భోజనం నీకేనా నాకు లేదా అని శ్రీధర్ అడగ్గా.. భర్తను చూడగానే కుర్చీలోంచి లేవబోతుంది కాంచన. నువ్వు లేవలేవు.. నన్ను చూసి నిన్ను నువ్వే మరిచిపోయావంటే నా కోసం ఎంత ఎదురుచూస్తున్నావో అర్ధమవుతుందని అంటాడు. ఆపరేషన్ ఎలా జరిగింది? ఎన్ని రోజులు రెస్ట్ తీసుకోవాలి? ఏం తినాలి? ఏం తినకూడదు? డాక్టర్ గారు ఏం చెప్పారంటూ ప్రశ్నల వర్షం కురిపిస్తుంది కాంచన. అవన్నీ కాదు ఆకలి వేస్తోంది భోజనం పెడతావా అని శ్రీధర్ అడగ్గానే ప్లేట్ తీస్తుంది. పక్కన మరో ప్లేట్ పెట్టుకున్నావంటే నేను వస్తానని ముందే తెలుసా అని శ్రీధర్ అడుగుతాడు. నాన్న చెప్పారని చెబుతాడు. ప్లేట్‌లో కాదు.. చేతిలో పెట్టమని అడగటంతో కాంచన ఎమోషనల్ అవుతుంది.