ఓటీటీ దిగ్గజం నెట్‌ఫ్లిక్స్‌‌ వేదికగా హిందీలో ప్రసారమవుతున్న మెగా రియాలిటీ షో లాకప్ 2 సంచలనాలకు వేదికగా మారుతోంది. ఈ షోకు కంటెస్టెంట్స్‌గా వచ్చిన సెలబ్రిటీలు ఒక్కొక్కరు బాంబులు పేలుస్తున్నారు. మేం ఎవరికీ తక్కువ కాదంటూ ఒకరిని మించి ఒకరు సంచలన వ్యాఖ్యలు చేస్తున్నారు. ఫరా ఖాన్ - రితేశ్ దేశ్‌ముఖ్‌లు హోస్ట్‌లుగా వ్యవహరిస్తున్న ఈ మెగా రియాలిటీ షో ఆగస్ట్ 9తో ముగియనుంది. ఎండింగ్ స్టేజ్‌కు చేరుకోవడంతో లాకప్ సీజన్ 2 ఇంట్రెస్టింగ్‌గా మారుతోంది.

Advertisement
Advertisement

సంచలనాలే కాదు.. ఆత్మీయ కలయికలు, కన్నీటిగాథలు కూడా లాకప్ 2 హౌస్‌లో చోటు చేసుకుంటూ ప్రేక్షకులను కంటతడి పెట్టిస్తున్నాయి. తాజాగా సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్, నటి అపూర్వ ముఖిజా.. మరో డిజిటల్ క్రియేటర్ సూఫీ మోతీవాలాల సంభాషణ అందరినీ కదిలించింది. చాలారోజుల తర్వాత ఒకే వేదికపై కలుసుకున్న ఈ మిత్రులు.. మనసు విప్పి మాట్లాడుకోవడంతో పాటు సూఫీ లేకపోతే తాను చనిపోయేదానిని అని అపూర్వ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ వివరాల్లోకి వెళితే..

కంటెంట్ క్రియేటర్స్‌గా ఉన్న అపూర్వ ముఖిజా ఇన్‌ఫార్మర్ కేటగిరీలో వారం పాటు ఉండేందుకు లాకప్ 2 హౌస్‌లోకి ప్రవేశించారు. ఆమెకు సూఫీ మోతివాలాకు పడదని ఖచ్చితంగా గొడవ జరగడం ఖాయమని కంటెస్టెంట్స్, ప్రేక్షకులు భావించారు. కానీ అందుకు పూర్తి విరుద్ధంగా జరిగింది. వారిద్దరూ గతంలో తమ మధ్య చోటు చేసుకున్న విభేదాలను పరిష్కరించుకుని తిరిగి ఒక్కటయ్యారు. నీ మీద నాకు ఎలాంటి ద్వేషం లేదని అపూర్వతో సూఫీ చెప్పారు. ఆమె కూడా నిన్ను చాలా మిస్ అయ్యాను.. అమ్మ మీద ఒట్టు అంటూ ఎమోషనల్ అయ్యింది. సూఫీ చాలా కఠినంగా ఉంటాడు.. అలాంటి వ్యక్తితో ఎలా స్నేహం చేశావని ఎవరైనా అడిగితే ఇండియాస్ గాట్ లేటెంట్ వివాదం సమయంలో సూఫీ లేకపోయుంటే నేను ఆత్మహత్య చేసుకునే దానిని అని చెప్పానని అపూర్వ బయటపెట్టింది

Advertisement

బొంబాయిలో నాకంటూ కలవడానికి ఒకరు ఉన్నారని నీ వల్లే అనిపించేది.. నేను కూడా నిన్ను మిస్ అయ్యానని సూఫీ చెప్పుకొచ్చాడు. ఆ క్లిష్ట పరిస్ధితుల్లో నా పక్కన నిలిచిన ఏకైక వ్యక్తివి నువ్వే.. నువ్వు నా ప్రాణాలను కాపాడావు, లేదంటే ఆ వివాదంలో నుంచి బయటపడేదానిని కాదు. మన మధ్య చిన్న చిన్న భేదాభిప్రాయాలు వచ్చాయి. మీకు అవసరమైన సమయంలో తోడుగా నిలవలేకపోయినందుకు క్షమించాలని సూఫీని అపూర్వ కోరడంతో కంటెస్టెంట్స్ అంతా భావోద్వేగానికి గురయ్యారు.

Advertisement

కాగా.. గతేడాది సమయ్ రైనా హోస్ట్‌గా ప్రసారమైన ఇండియాస్ గాట్ లేటెంట్ షో వివాదాస్పదమైన సంగతి తెలిసిందే. ఈ కార్యక్రమానికి కంటెంట్ క్రియేటర్లుగా ఉన్న ఆశిష్ చంచ్లానీ, జస్ప్రీత్ సింగ్, అపూర్వ ముఖిజా, బీర్ బైసెప్స్ హోస్ట్ రణ్‌వీర్ అలహాబాదియా పాల్గొన్నారు. ఈ క్రమంలో ఓ కంటెస్టెంట్‌ను రణ్‌వీర్ అడిగిన అసభ్యకరమైన ప్రశ్న దేశవ్యాప్తంగా కలకలం రేపింది. అతను చేసిన వ్యాఖ్యలతో షోలో ఉన్న వారంతా షాక్ అయ్యారు.

Advertisement

తల్లిదండ్రుల వ్యక్తిగత జీవితంపై రణ్‌వీర్ చేసిన వ్యాఖ్యలపై సోషల్ మీడియాలో ఏకీపారేశారు నెటిజన్లు. అంతేకాదు.. ఇండియాస్ గాట్ లేటెంట్ షోలో పాల్గొన్న అందరిపై చర్యలు తీసుకోవాలని పోలీసులకు ఫిర్యాదులు అందడంతో పాటు ఏకంగా సుప్రీంకోర్టు వరకు వెళ్లింది. అయితే ఈ షోలో పాల్గొన్న అపూర్వ.. తనను రేప్ చేసి చంపేస్తామని, యాసిడ్ పోస్తామని బెదిరింపులు వచ్చాయని అప్పట్లో బయటపెట్టడం కలకల రేపింది. ఈ వివాదం తర్వాత తన సోషల్ మీడియా ఖాతాలను పూర్తిగా షట్ డౌన్ చేసింది. ఎవరో అన్న వ్యాఖ్యలకు తాను నలిగిపోయానని, ప్రజలు తనను టార్గెట్ చేశారని అపూర్వ ఆవేదన వ్యక్తం చేసింది. ఇక కరణ్ జోహార్ హోస్ట్‌గా వచ్చిన ది ట్రైటర్స్ షో సమయంలో అపూర్వ ముఖిజా.. సూఫీ మోతివాలా ఫ్రెండ్స్ అయ్యారు. కానీ ఆ తర్వాత వీరిద్దరి మధ్య విభేదాలు చోటు చేసుకున్నాయి. మళ్లీ ఇన్నాళ్లకు ఈ స్నేహితులు కలిసిపోవడంతో వారి అభిమానులు సంతోషిస్తున్నారు.