తెలుగులో ఉన్న టాప్ యాంకర్లలో శ్రీముఖి కూడా ఒకరు. అందం, చలాకీతనం, మంచి వాక్చాతుర్యంతో బుల్లితెరను ఏలుతున్నారు ఈ ముద్దుగుమ్మ. సినిమాలు, టీవీ షోలు, ఈవెంట్స్‌తో సత్తా చాటుతున్నారు. అయితే తన తొలి ప్రాధాన్యత మాత్రం టీవీనే అని పలుమార్లు తెలిపారు శ్రీముఖి. ఎలాంటి షో అయినా అలవోకగా చేస్తూ ప్రేక్షకులను అలరిస్తున్నారు రాములమ్మ. ఇటీవల మా ఇంటి బంగారం మూవీతో సత్తా చాటిన శ్రీముఖి తిరిగి తన టీవీ షోలలో బిజీ అయిపోయారు. ప్రతి అమ్మాయికి ఉన్నట్లే ఈ యాంకరమ్మకు కూడా ప్రేమకథ ఉంది. తాజాగా స్టార్ మాలో ప్రసారమవుతున్న ఆదివారం విత్ స్టార్ మా కార్యక్రమంలో ఈ విషయాన్ని ఆమె బయటపెట్టారు. దీనికి సంబంధించిన ప్రోమో వైరల్ అవుతుండగా.. శ్రీముఖి జీవితంలో మొదటగా ఇష్టపడిన ఆ వ్యక్తి ఎవరు? అనేది చూస్తే..

Advertisement
Advertisement

ఆదివారం విత్ స్టార్ మా పరివారం షోలో భాగంగా వారం వారం ఓ ప్రత్యేకమైన థీమ్‌తో బుల్లితెర, వెండితెర సెలబ్రిటీలతో శ్రీముఖి సందడి చేస్తుంటుంది. దీనిలో భాగంగా ఈ వారం ఫ్రెండ్‌షిప్ డే స్పెషల్ పేరుతో ఈ షోను ప్లాన్ చేశారు. ఈ కార్యక్రమానికి సెలబ్రిటీలు తమ ఫ్రెండ్స్‌తో వేదిక మీదకి వచ్చారు. అలాగే చెన్నై లవ్ స్టోరీ మూవీ ప్రమోషన్‌లో భాగంగా హీరో కిరణ్ అబ్బవరం, హీరోయిన్ శ్రీగౌరి ప్రియలు సందడి చేశారు. తెలుగు అమ్మాయిగా ఒక మంచి తెలుగు ప్రేమకథను చేసినందుకు చాలా చాలా ఆనందంగా ఉందని గౌరి చెప్పారు.

Advertisement

మొట్టమొదటిసారి మా పరివారంలో స్టేజ్ మీద ఒక హీరోయిన్ గలగలా తెలుగులో మాట్లాడుతుంటే చాలా బాగుందని శ్రీముఖి కాంప్లిమెంట్ ఇచ్చింది. వచ్చే హీరోయిన్స్ అందరికీ నేను ట్రాన్స్‌లేట్ చేయలేక చచ్చిపోతున్నానని అవినాష్ అనడంతో ముందు నీకు సరిగ్గా రావాలి కదా అని ఎక్స్‌ప్రెస్ హరి పంచ్ వేస్తాడు. ఆ తర్వాత స్క్రీన్ మీద విజయవాడ లవ్‌స్టోరీ అంటూ శేఖర్ మాస్టర్‌ది.. మలక్‌పేట్ లవ్‌స్టోరీ పేరుతో రఘు మాస్టర్‌ది.. మణికొండ లవ్‌స్టోరీ పేరుతో సుప్రీతది... మారేడుపల్లి లవ్‌స్టోరీ పేరుతో యాదమ్మ రాజుది... మైసూర్ లవ్‌స్టోరీ పేరుతో నవ్యస్వామిది.. నిజామాబాద్ లవ్‌స్టోరీ పేరుతో యాంకర్ శ్రీముఖిలకి సంబంధించిన ప్రేమకథల తాలుకా పోస్టర్స్‌ను ప్రదర్శించారు.

Advertisement

ఒక్కొక్కరు తమ ఫస్ట్ లవ్‌స్టోరీలను చెప్పుకుంటూ రాగా.. చివరిలో శ్రీముఖి కూడా ఇండస్ట్రీలో తన ఫస్ట్ లవ్‌స్టోరీని బయటపెట్టారు. నిజామాబాద్ నుంచి నేను హైదరాబాద్‌లో ఇండస్ట్రీకి వచ్చాను. నా ఫస్ట్ ఫిల్మ్ జులాయి. రామోజీ ఫిల్మ్ సిటీలో షూటింగ్ జరుగుతుండగా నా పక్కనే ఒక అబ్బాయి కూర్చొని ఏదో రాసుకుంటున్నాడు. కట్ చేస్తే కొన్ని రోజుల తర్వాత తెలిసింది ఏంటంటే? ఆయనే మా శేఖర్ మాస్టర్ అని శ్రీముఖి చెప్పడంతో అక్కడే ఉన్న శేఖర్ షాక్ అయ్యాడు.

Advertisement

వెంటనే షాక్‌లో నుంచి తేరుకుని అసలు నేనెందుకు అక్కడ రాసుకుంటానని ప్రశ్నించాడు శేఖర్. దేవుడి మీద ఒట్టు.. మీరు ఆరోజు రాసుకున్న మాట వాస్తవం కాకపోయినా కానీ ఇండస్ట్రీలో నా తొలిప్రేమ శేఖర్ మాస్టర్‌తోనే అని శ్రీముఖి చెప్పడంతో అతను సిగ్గుపడిపోయాడు. వెంటనే అవినాష్, ఎక్స్‌ప్రెస్ హరి గోల గోల చేశారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన ప్రోమో వైరల్ అవుతుండగా.. తన ప్రేమకథకు సంబంధించి శ్రీముఖి ఇంకా ఎలాంటి సంగతులు పంచుకున్నారు? తెలియాలంటే ఈ ఆదివారం ప్రసారమయ్యే ఆదివారం విత్ స్టార్ మా పరివారం షో చూసేయాల్సిందే.

Advertisement