టాలీవుడ్‌లో హిట్ మిషన్‌గా మారిన డైరెక్టర్ అనిల్ రావిపూడి గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. తొలి చిత్రం 'పటాస్' నుంచి మొదలుపెట్టి తాజాగా మెగాస్టార్ చిరంజీవితో 'మన శంకర వరప్రసాద్ గారు 'వరకు ఆయన దర్శకత్వంలో తెరకెక్కిన ప్రతి సినిమా బ్లాక్ బస్టరే. ముఖ్యంగా సీనియర్ హీరోలతో వరుసగా హిట్లు అందుకుంటూ.. తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించారు. తాజాగా డైరెక్టర్ అనిల్ రావిపూడి తన మనసులో చాలా కాలంగా దాచుకున్న కోరికను అభిమానుల ముందే బయటపెట్టారు. తాను ఓ స్టార్ నటుడితో ఓ సినిమా చేయాలని తన డ్రీమ్ ను బయటపెట్టారు. ఇంతకీ ఆ హీరో ఎవరు? ఇంతకీ ఏ జోనర్?
ఇప్పటివరకు స్టార్ హీరోలతో వరుస బ్లాక్‌బస్టర్ సినిమాలు తెరకెక్కించిన డైరెక్టర్ అనిల్ రావిపూడి.. తనకు సీనియర్ నటుడు జగపతిబాబుతో మాత్రం ఇంకా సినిమా చేయలేకపోయానని, త్వరలో ఆయన కోసం ప్రత్యేకమైన పాత్రతో సినిమా చేయాలనేది తన డ్రీమ్ అని వెల్లడించారు.
తాజాగా 'వదల'ప్రీ రిలీజ్ ఈవెంట్ లో ముఖ్య అతిథిగా హాజరైన అనిల్ రావిపూడి పాల్గొన్నారు. ఈ సందర్బంగా డైరెక్టర్ తో యాంకర్ స్రవంతి చొక్కారపు సరదాగా చిట్‌చాట్ నిర్వహించారు. మొదట ప్రస్తుతం తెరకెక్కుతున్న తన మల్టీస్టారర్ సినిమా గురించి అడగగా, "షూటింగ్ ఫుల్ స్పీడ్‌లో కొనసాగుతోంది" అని చెప్పారు.
ఆ తర్వాత "మీరు ఇప్పటివరకు పనిచేసిన హీరోయిన్లలో మరోసారి ఎవరితో పనిచేయాలని అనుకుంటున్నారు?" అని యాంకర్ ప్రశ్నించడంతో అనిల్ నవ్వుతూ, "నన్ను ఇరుకున పెట్టేశారు" అంటూ సమాధానం దాటవేయడానికి ప్రయత్నించారు. అయితే యాంకర్ మళ్లీ సమాధానం చెప్పాలని పట్టుబట్టడంతో అసలు విషయాన్ని వెల్లడించారు. "హీరోయిన్లతో కంటే నాకు జగపతిబాబు గారితో సినిమా చేయాలనే కోరిక ఎక్కువ. నేను దర్శకుడిగా మారినప్పటి నుంచి ఆయనతో కలిసి పనిచేయాలని అనుకుంటున్నాను. 'సరిలేరు నీకెవ్వరు' సినిమాలో ఆయనతో పని చేయాలని భావించాను. కానీ కొన్ని అనివార్య కారణాల వల్ల అది సాధ్యం కాలేదు" అని అనిల్ తెలిపారు. అంతేకాదు, "జగపతిబాబు కోసం చిన్న పాత్ర రాయాలని నాకు లేదు. ఆయన స్థాయికి తగ్గట్టుగా గుర్తుండిపోయే అద్భుతమైన పాత్రను సృష్టించి, ఆ సినిమాను చేయాలనుకుంటున్నాను" అని స్పష్టం చేశారు. ఇక జగపతిబాబు నటించిన పాత్రల్లో తనకు అత్యంత ఇష్టమైన సినిమా 'అంతఃపురం' అని అనిల్ చెప్పారు. "ఆ సినిమాలో ఆయన నటన అద్భుతం. ముఖ్యంగా క్లైమాక్స్‌లో ఆయన బీడీ తాగుతూ కనిపించే సన్నివేశం ఇప్పటికీ నా మదిలో ఉంది. ఆ పాత్రలో ఆయన చూపించిన నటన టాప్ నాచ్. సరైన పాత్ర దొరికితే ఆయన మరో స్థాయిలో నటిస్తారు" అంటూ ప్రశంసలు కురిపించారు. ఈ సందర్భంగా అనిల్ ఓ ఆసక్తికర విషయాన్ని కూడా పంచుకున్నారు. "ఒకసారి జగపతిబాబు గారు ఫోన్ చేసి వెంటనే ఇంటికి రమ్మన్నారు. నేను వెళ్లాక ఆయన దగ్గర అద్భుతమైన కామెడీ స్క్రిప్ట్ ఉంది. ఆ కథపై చాలాసేపు చర్చించాం. కానీ కొన్ని కారణాల వల్ల ఆ సినిమా పట్టాలెక్కలేదు. అవకాశం దొరికితే ఆ కథను మళ్లీ తీసుకొచ్చి తెరకెక్కించాలని ఉంది. అందులో జగపతిబాబుకు ఆయన కామెడీ టైమింగ్‌ను పూర్తిగా బయటపెట్టే పాత్ర ఇస్తాను" అంటూ మాట ఇచ్చారు. మరోసారి యాంకర్ హీరోయిన్ల గురించి ప్రశ్నించగా, "నేను స్క్రిప్ట్‌కు తగ్గట్టే హీరోయిన్‌ను ఎంపిక చేసుకుంటాను. ఫలానా హీరోయిన్‌తోనే సినిమా చేయాలనే ఆలోచన ఉండదు. అయితే అవకాశం వస్తే నయనతార గారితో మరోసారి పనిచేయాలని ఉంది" అని అనిల్ సమాధానం ఇచ్చారు. అనంతరం యాంకర్ జగపతిబాబును ఉద్దేశించి, "మీరు మళ్లీ ఏ దర్శకుడితో పనిచేయాలని అనుకుంటున్నారు?" అని ప్రశ్నించారు. దానికి ముందు అనిల్ చేసిన వ్యాఖ్యలపై స్పందించిన జగపతిబాబు, "అనిల్ రావిపూడి గారు నాతో సినిమా చేయాలని తన కోరికను చెప్పడం చాలా ఆనందంగా ఉంది. అది నాకు పెద్ద ప్రశంస" అన్నారు. ఆ తర్వాత తనకు మళ్లీ మళ్లీ పనిచేయాలనిపించే దర్శకుల్లో రామ్ గోపాల్ వర్మ ఒకరని వెల్లడించారు. అనిల్ రావిపూడి- జగపతి బాబు చేసిన వ్యాఖ్యలు చూస్తుంటే... డైరెక్టర్ అనిల్ ఇప్పటికే జగపతిబాబు కోసం ఓ ప్రత్యేక కథ సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది. మంచి సమయం దొరికిన వెంటనే ఇద్దరి కాంబినేషన్‌లో ఓ కామెడీ ఎంటర్టైనర్ మూవీ తెరకెక్కే అవకాశాలు కనిపిస్తున్నాయి.More Articles