Jana Nayagan: తమిళ స్టార్ హీరో, తమిళనాడు ముఖ్యమంత్రి దళపతి విజయ్ నటించిన భారీ పొలిటికల్ యాక్షన్ ఎంటర్‌టైనర్ 'జన నాయగన్'. (తెలుగులో 'జన నాయకుడు'). ఈ సినిమా జూలై 23న ప్రపంచవ్యాప్తంగా విడుదలకు సిద్ధమవుతోంది. ఈ సినిమా తెలుగు ప్రమోషన్స్‌లో భాగంగా దర్శకుడు అనిల్ రావిపూడి ప్రత్యేకంగా పాల్గొన్నారు. ఎందుకంటే.. ఈ సినిమా నందమూరి బాలకృష్ణ నటించిన బ్లాక్‌బస్టర్ 'భగవంత్ కేసరి' లోని కొన్ని ప్రధాన అంశాల ఆధారంగా కొత్త కథతో రూపొందింది. ఈ సందర్భంగా విజయ్‌తో తనకున్న అనుబంధం, 'జన నాయగన్' ఎలా రూపుదిద్దుకుందో అనిల్ రావిపూడి ఆసక్తికర విషయాలు వెల్లడించారు. ఇంతకీ ఏమన్నారంటే?

Advertisement
Advertisement

అనిల్ రావిపూడి మాట్లాడుతూ.. సినిమా గురించి చెప్పే ముందు విజయ్‌ను తొలిసారి ఎలా కలిశానో చెబితే ఈ ప్రాజెక్ట్ ఎలా మొదలైందో అందరికీ అర్థమవుతుందని అన్నారు. 'వారీసు' సినిమా షూటింగ్ సమయంలోనే తొలిసారి విజయ్‌ను కలిసినట్లు చెప్పారు. దర్శకుడు వంశీ పైడిపల్లి స్వయంగా తనను విజయ్‌కు పరిచయం చేశారని గుర్తు చేసుకున్నారు. అప్పటికే విజయ్ గురించి ఎంతో విన్నానని, ఆయనను ప్రత్యక్షంగా కలవడం చాలా ప్రత్యేక అనుభూతిగా అనిపించిందని తెలిపారు.

మొదటి పరిచయంలోనే విజయ్ వ్యక్తిత్వం తనను ఎంతగానో ఆకట్టుకుందని అనిల్ చెప్పారు. అంత పెద్ద స్టార్ అయినా, ఎలాంటి స్టార్ హంగులు లేకుండా చాలా సాధారణంగా మాట్లాడారని తెలిపారు. ఇప్పుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా ఆయనలో అదే సింప్లిసిటీ కనిపిస్తోందని అన్నారు. విజయ్ చాలా గ్రౌండెడ్ పర్సన్ అని, ఎదుటివారిని ఎంతో గౌరవంగా పలకరించే వ్యక్తి అని ప్రశంసించారు. ఆ రోజు జరిగిన ఆ చిన్న పరిచయం ఇప్పటికీ తనకు గుర్తుండిపోయే మధుర జ్ఞాపకమని చెప్పారు.

Advertisement

ఆ తర్వాత కొంతకాలానికి మరో ఆసక్తికర సంఘటన జరిగిందని అనిల్ వెల్లడించారు. ఒకరోజు తాను తన పనుల్లో బిజీగా ఉండగా అకస్మాత్తుగా కేవీఎన్ ప్రొడక్షన్స్ నుంచి ఫోన్ వచ్చిందన్నారు. "విజయ్ సర్ వెంటనే మిమ్మల్ని కలవాలని కోరుతున్నారు.. వీలైనంత త్వరగా రండి" అని చెప్పడంతో ఒక్కసారిగా ఆశ్చర్యపోయానని తెలిపారు. ఎందుకు పిలుస్తున్నారో కూడా తెలియకుండానే ఉన్న పనులన్నీ పక్కనపెట్టి వెంటనే షూటింగ్ లొకేషన్‌కు వెళ్లిపోయానని చెప్పారు. షూటింగ్ స్పాట్‌లో విజయ్ తనను క్యారవాన్‌లోకి పిలిచారని, దాదాపు పావుగంట పాటు ఇద్దరం మాత్రమే మాట్లాడుకున్నామని అనిల్ తెలిపారు. మొదట ఆయన ఎందుకు పిలిచారో తనకు అర్థం కాలేదని చెప్పారు. అయితే తర్వాత విజయ్ చెప్పిన మాటలు తన జీవితంలో ఎప్పటికీ మర్చిపోలేనివని పేర్కొన్నారు.

Advertisement

విజయ్ అప్పటికే 'భగవంత్ కేసరి' సినిమా చూసినట్లు చెప్పారని అనిల్ వెల్లడించారు. సినిమా తనకు చాలా బాగా నచ్చిందని, ముఖ్యంగా కొన్ని ఎమోషనల్ ఎపిసోడ్స్, తండ్రి-కూతురు భావోద్వేగాలు, మహిళల కోసం చెప్పిన సందేశం తనను బాగా ఆకట్టుకున్నాయని విజయ్ చెప్పారన్నారు. "చాలా అద్భుతంగా తీశారు.. కొన్ని సన్నివేశాలు మైండ్ బ్లోయింగ్‌గా ఉన్నాయి. అందుకే మిమ్మల్ని ప్రత్యేకంగా పిలిచి అభినందించాలని అనుకున్నాను" అని విజయ్ చెప్పినట్లు అనిల్ గుర్తు చేసుకున్నారు.

Advertisement

విజయ్ లాంటి స్టార్ హీరో నుంచి అలాంటి ప్రశంసలు రావడం తనకు ఎంతో సంతోషాన్ని కలిగించిందని అనిల్ చెప్పారు. ఆ క్షణంలో తన ఆనందాన్ని మాటల్లో చెప్పలేనని అన్నారు. క్యారవాన్ నుంచి బయటకు వచ్చిన వెంటనే ఆ విషయాన్ని సూపర్ స్టార్ మహేష్ బాబుకు ఫోన్ చేసి చెప్పానని వెల్లడించారు. "ఆ రోజు నాకు వచ్చిన ఆనందానికి హద్దులు లేవు. ఒక స్టార్ హీరో తనంతట తానే పిలిచి అభినందించడం ఏ దర్శకుడికైనా జీవితాంతం గుర్తుండిపోయే విషయం" అని చెప్పారు.

Advertisement

అనంతరం 'జన నాయగన్' ఎలా రూపుదిద్దుకుందో కూడా అనిల్ వివరించారు. చాలామంది భావిస్తున్నట్లు ఇది పూర్తి స్థాయి రీమేక్ కాదని స్పష్టం చేశారు. 'భగవంత్ కేసరి'లోని మొత్తం కథను తీసుకోలేదని, కేవలం కొన్ని ప్రధాన భావోద్వేగ అంశాలు మాత్రమే ఉపయోగించారని చెప్పారు. ముఖ్యంగా మహిళలకు బాగా కనెక్ట్ అయ్యే ఎమోషనల్ సన్నివేశాలు, భయాన్ని జయించే కాన్సెప్ట్ వంటి కోర్ ఎలిమెంట్స్‌ను మాత్రమే తీసుకున్నారని తెలిపారు.

ఆ అంశాల ఆధారంగా దర్శకుడు హెచ్. వినోద్ పూర్తిగా కొత్త కథను సిద్ధం చేశారని అనిల్ చెప్పారు. విజయ్ ఇమేజ్, ఆయన రాజకీయ ప్రయాణం, అభిమానుల అంచనాలను దృష్టిలో పెట్టుకుని కథను పూర్తిగా కొత్త కోణంలో రూపొందించారని వెల్లడించారు. అందుకే దీనిని సాధారణ రీమేక్‌గా కాకుండా కొత్త వెర్షన్‌గా చూడాలని సూచించారు. సినిమాలో ఒక్క సన్నివేశం తీసుకున్నా కూడా కాపీరైట్ నిబంధనలు వర్తిస్తాయని అనిల్ గుర్తు చేశారు. అందుకే కేవీఎన్ ప్రొడక్షన్స్ అధికారికంగా తమను సంప్రదించి రీమేక్ హక్కులు తీసుకున్నారని తెలిపారు. ఇది పూర్తిగా చట్టబద్ధంగా, ప్రొఫెషనల్‌గా జరిగిన ప్రక్రియ అని చెప్పారు.

"వాళ్లు మా దగ్గరకు వచ్చినప్పుడు నేను అసలు ఎలాంటి సందేహం పెట్టుకోలేదు. విజయ్ గారు ఒకసారి నన్ను పిలిచి చేసిన ప్రశంసలు నాకు ఇంకా గుర్తున్నాయి. అందుకే వాళ్లు హక్కులు అడిగిన వెంటనే ఇచ్చేయండి అన్నాను. వాళ్లు మొత్తం సినిమా తీసుకుంటారా, పది శాతం మాత్రమే తీసుకుంటారా అనేది వాళ్ల ఇష్టం. కథను ఎలా మార్చుకోవాలనుకుంటారో అది కూడా వాళ్ల నిర్ణయమే" అని అనిల్ వెల్లడించారు.

అలాగే కేవీఎన్ ప్రొడక్షన్స్ తనకు కథలో చేసిన మార్పుల గురించి కూడా వివరించిందన్నారు. ముఖ్యంగా బాబీ డియోల్ పాత్రను పూర్తిగా కొత్తగా డిజైన్ చేశారని చెప్పారు. ఒరిజినల్ 'భగవంత్ కేసరి' లో విలన్ పాత్రకు హీరోతో సంబంధం ఉండదని, కానీ 'జన నాయకుడు'లో మాత్రం ఆ పాత్రను విజయ్ పాత్రతో మరింత అనుసంధానం చేసేలా కథను మార్చారని వెల్లడించారు. అందుకే 'జన నాయకుడు' ప్రేక్షకులకు కొత్త అనుభూతిని ఇస్తుందని, ఇది కేవలం రీమేక్ కాదు.. విజయ్ కోసం ప్రత్యేకంగా మలిచిన కొత్త వెర్షన్ అని ఆయన స్పష్టం చేశారు.