టాలీవుడ్‌లో మరోసారి నటుడు ప్రకాశ్ రాజ్, నిర్మాత బండ్ల గణేశ్ మధ్య ట్విట్ల యుద్దం జరుగుతోంది. రాజకీయ, సామాజిక అంశాలపై తరచూ వారిద్దరూ తన అభిప్రాయాలను సోషల్ మీడియా ద్వారా వ్యక్తం చేస్తున్నారు. తాజాగా ప్రకాశ్ రాజ్ వీడియోకు బండ్ల గణేశ్ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. ఇద్దరూ ఒకరిపై ఒకరు నేరుగా పేర్లు ప్రస్తావిస్తూ షాకింగ్ కామెంట్స్ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అభిమానులు, నెటిజన్లు కూడా రెండు వర్గాలుగా విడిపోయి తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు.

Advertisement
Advertisement

ప్రకాశ్ రాజ్ వీడియోతో మొదలైన చర్చ
ఇటీవల సోషల్ మీడియాలో తనపై వస్తున్న విమర్శలు, తప్పుడు ప్రచారాలపై స్పందిస్తూ ప్రకాశ్ రాజ్ తన ఎక్స్ (ట్విట్టర్) ఖాతాలో ఓ వీడియోను విడుదల చేశారు. "ప్రశ్నించే గొంతుల మీద తప్పుడు ప్రచారం చేస్తున్న వాళ్లకి నా సమాధానం" అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు.

వీడియోలో ప్రకాశ్ రాజ్ మాట్లాడుతూ.. తాను మౌనంగా లేనని, అన్నీ గమనిస్తున్నానని చెప్పారు. కొందరు ప్రజాప్రతినిధులు, జనసైనికులు, యూట్యూబర్లు, సోషల్ మీడియా వేదికల ద్వారా తనపై అసత్య ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. "దిగజారండి... దిగజారండి... దిగజారుతూనే ఉండండి. మీరు ఎంత అరిచినా, ఎన్ని కథలు చెప్పినా నాలాంటి ప్రశ్నించే గొంతును ఆపలేరు" అంటూ ప్రకాశ్ రాజ్ సంచలన వ్యాఖ్యలు చేశారు.

Advertisement

ఈ వీడియో రాజకీయ, సినీ వర్గాల్లో చర్చకు దారితీసింది. ముఖ్యంగా ఇటీవల అరెస్టైన యూట్యూబర్ రావణ్ వ్యవహారంపై ప్రకాశ్ రాజ్ గతంలో చేసిన వ్యాఖ్యల నేపథ్యంలోనే ఈ వీడియో వచ్చినట్లు పలువురు భావిస్తున్నారు. ఈ క్రమంలో ప్రకాశ్ రాజ్ వీడియోపై నిర్మాత బండ్ల గణేశ్ తనదైన శైలిలో స్పందించారు.

ప్రకాశ్ రాజ్ మాట్లాడే విధానాన్ని విమర్శిస్తూ.. "ఎవరితోనో ట్వీట్ రాయించుకుని వచ్చి పోస్ట్ చేయడం కాదు. సినిమాల్లో రాసిచ్చిన డైలాగ్‌లా మాట్లాడటం కాదు. ప్రజలతో మాట్లాడే మాట హృదయం నుంచి రావాలి. అప్పుడే ప్రజలు నమ్ముతారు. ప్రజల మనసు గెలవాలంటే స్క్రిప్ట్ కాదు... నిజాయితీ కావాలి" అంటూ వ్యాఖ్యానించారు. అంతటితో ఆగకుండా.. "పైసా కొట్టు... డైలాగ్ పట్టు! ప్రకాశ్ రాయ్ అలియాస్ ప్రకాశ్ రాజ్" అంటూ వ్యంగ్యంగా ట్వీట్ చేశారు.

Advertisement

ఆ తర్వాత బండ్ల గణేశ్ మరో ట్వీట్ చేస్తూ "నీకు స్క్రిప్ట్ ఎవరు ఇస్తే వాళ్లకే అనుగుణంగా డైలాగులు చెబుతావు. అకౌంట్‌లో డబ్బులు పడితే నీ స్టాండ్ కూడా మారిపోతుంది. అందుకే చాలామంది నిన్ను 'ఎనీ టైం మనీ'అంటున్నారు.

తెలుగు ప్రజలు అమాయకులు కాదు. ఎవరు నిజాయితీగా మాట్లాడుతున్నారు, ఎవరు అజెండాతో మాట్లాడుతున్నారు అనేది వారికి బాగా తెలుసు. కాబట్టి నీ పని నువ్వు చూసుకో. తెలుగు ప్రజలకు నీ సర్టిఫికెట్లు అవసరం లేదు" అంటూ ఘాటుగా స్పందించారు. ఈ ట్వీట్ కూడా సోషల్ మీడియాలో పెద్ద చర్చకు దారితీసింది. కొందరు బండ్ల గణేశ్ వ్యాఖ్యలకు మద్దతు తెలుపుతుండగా, మరికొందరు ప్రకాశ్ రాజ్‌కు మద్దతుగా పోస్టులు చేస్తున్నారు.

Advertisement

ఈ వ్యవహారంపై సోషల్ మీడియాలో మిశ్రమ స్పందనలు కనిపిస్తున్నాయి. ఒక వర్గం ప్రకాశ్ రాజ్ ఎప్పటిలాగే తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారని అంటుండగా, మరో వర్గం బండ్ల గణేశ్ ఇచ్చిన కౌంటర్ సరైనదేనని అభిప్రాయపడుతోంది. ఈ ట్విట్ల యుద్ధం ఇప్పట్లో ముగుస్తుందా? లేక మరింత ముదురుతుందా? అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.