కిరణ్ అబ్బవరం హీరోగా నటించిన 'చెన్నై లవ్ స్టోరీ' ప్రీ-రిలీజ్ ఈవెంట్‌లో ముఖ్య అతిథిగా మెగాస్టార్ చిరంజీవి పాల్గొన్నారు. సినిమా గురించి మాట్లాడటంతో పాటు తన సినీ ప్రయాణం గురించి మాట్లాడారు. చిరంజీవి మాట్లాడుతూ.. 'చెన్నై లవ్ స్టోరీ' అనే టైటిల్ వినగానే తనకు గత జ్ఞాపకాలన్నీ గుర్తొచ్చాయని అన్నారు. అయితే అది ప్రేమ కథ కాదని, చెన్నై నగరంతో తనకున్న అనుబంధమే నిజమైన లవ్ స్టోరీ అని చెప్పారు. నటుడిగా ఎదగాలనే కలతో చెన్నై వీధుల్లో తిరిగిన రోజులు, అదే నగరంలో స్టార్‌గా ఎదిగిన క్షణాలు ఇప్పటికీ తన మదిలో సజీవంగా ఉన్నాయని తెలిపారు. ఆ నగరమే తనకు జీవితం ఇచ్చిందని, అందుకే చెన్నైకి తన హృదయంలో ప్రత్యేక స్థానం ఉందన్నారు.
ఈ కార్యక్రమానికి రావడానికి ప్రధాన కారణం ఇక్కడ ఉన్న అభిమానులేనని చిరంజీవి తెలిపారు. నిర్మాత ఎస్‌కేఎన్, సాయి రాజేష్, దర్శకుడు రవి వర్మ, సంగీత దర్శకుడు మణిశర్మతో పాటు పలువురు తనపై చూపించిన ప్రేమ, అభిమానమే ఈ వేదికపైకి తీసుకొచ్చిందని చెప్పారు. తనను ఆహ్వానించిన ప్రతి ఒక్కరికీ సభాముఖంగా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేశారు. "నాకు అభిమానులు అంటే చాలా ఇష్టం. కానీ నా అభిమానులు జీవితంలో పైకి వచ్చి గొప్ప స్థాయికి చేరుకుంటే వారిని నా ప్రాణప్రదంగా చూసుకుంటాను. కేవలం నాపై ప్రేమ చూపించడం మాత్రమే కాదు.. నన్ను స్ఫూర్తిగా తీసుకుని వారి తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు, సమాజం గర్వపడే స్థాయికి ఎదిగితే అదే మీరు నాకు ఇచ్చే నిజమైన బహుమతి, నిజమైన ప్రేమ" అని చిరంజీవి అన్నారు.
అలాంటి అభిమానులను చూస్తే తనకు ఎంతో గర్వంగా ఉంటుందని, వారిని చూస్తూ పరవశించిపోతానని చిరంజీవి చెప్పారు. ఈ వేదికపై కూడా అలాంటి అభిమానులను చూడటం తనకు ఎంతో ఆనందాన్ని ఇచ్చిందని పేర్కొన్నారు. కేవలం ఒక ఈవెంట్‌కు వచ్చి శుభాకాంక్షలు చెప్పి వెళ్లిపోవడం కోసం తాను రాలేదని, అభిమానులతో కలిసి వారి ఆనందాన్ని పంచుకోవాలని, వారి ఎనర్జీని ఆస్వాదించాలని వచ్చానని తెలిపారు. "అభిమానం చూపించి ఇంటికి వెళ్లిపోవడం మాత్రమే కాదు. మీలో ప్రతి ఒక్కరూ ఈరోజు విజయవంతంగా నిలిచిన వారి ప్రయాణాన్ని స్ఫూర్తిగా తీసుకోవాలి. మీ జీవితంలో కూడా అదే విధంగా ఎదగడానికి ప్రయత్నించాలి" అని చిరంజీవి సూచించారు. ఎస్‌కేఎన్ ప్రయాణాన్ని ఉదాహరణగా చెబుతూ.. ఒక సాధారణ ఫ్యాన్‌బాయ్‌గా సినీ పరిశ్రమలోకి వచ్చి, జర్నలిస్ట్‌గా, పీఆర్‌గా పనిచేసి, తర్వాత నిర్మాతగా ఎదిగారని కొనియాడారు. అలాగే సాయి రాజేష్ తన ప్రతిభతో దర్శకుడిగా, నిర్మాతగా ఎదిగి జాతీయ అవార్డులు అందుకున్నారని ప్రశంసించారు. ఇలాంటి ప్రయాణాలే అభిమానులకు ఆదర్శంగా నిలవాలని చిరంజీవి అన్నారు. "కలలు కనండి.. కానీ రాత్రి కాదు.. పగలు కనండి" అని చిరంజీవి చెప్పారు. ఆ కలలను కళ్లముందు ఉంచుకుని వాటిని నిజం చేసుకునేందుకు కష్టపడాలని సూచించారు. కంఫర్ట్ జోన్‌ను వదిలి బయటకు వస్తేనే విజయాలు వస్తాయని, అవమానాలు, కష్టాలు, అపజయాలు అన్నీ జీవితంలో మెట్లలాంటివేనని అన్నారు. వాటిని అవకాశాలుగా మార్చుకుని ముందుకు సాగితే ఎవ్వరైనా విజయం సాధించగలరని పేర్కొన్నారు. "మనకు రాలేదంటే అదృష్టం లేదని అనుకోవడం తప్పు. అది కేవలం తప్పించుకునే కారణం మాత్రమే. మనపై మనకు నమ్మకం ఉండాలి. నేను కూడా ఎన్టీఆర్, ఏఎన్నార్, కృష్ణ, శోభన్ బాబు, కృష్ణంరాజు వంటి దిగ్గజాల మధ్యకే వచ్చాను. అయినా నాకు ఓ ప్రత్యేక స్థానం సంపాదించుకోవాలనే నమ్మకంతో ముందుకు వచ్చాను. అదే నన్ను ఈ స్థాయికి తీసుకొచ్చింది" అని చిరంజీవి తన సినీ ప్రయాణాన్ని గుర్తు చేసుకున్నారు. హీరో కిరణ్ అబ్బవరం గురించి కూడా చిరంజీవి ప్రత్యేకంగా మాట్లాడారు. పక్కింటి అబ్బాయిలా కనిపించే సాధారణ యువకుడైన కిరణ్.. తన కలల కోసం కష్టపడి హీరోగా ఎదిగాడని అన్నారు. తన సినిమాలు చూస్తూ పెరిగిన కిరణ్, ఒకరోజు తాను కూడా హీరో కావాలని కలగన్నాడని, ఆ కలను నిజం చేసుకున్నాడని ప్రశంసించారు. 'చెన్నై లవ్ స్టోరీ'తో మరో విజయాన్ని అందుకోవాలని ఆయన ఆకాంక్షించారు. కొత్తవాళ్లు ఇండస్ట్రీకి రావాలని కోరుకున్నారు. హీరోయిన్ గౌరీ ప్రియను కూడా అభినందించిన చిరంజీవి.. ఆమె తెలుగమ్మాయిగా అన్ని భాషల్లో రాణించాలని ఆశీర్వదించారు. అలాగే సంగీత దర్శకుడు మణిశర్మపై కూడా ప్రశంసలు కురిపించారు. తన కెరీర్‌లో ఎన్నో సూపర్ హిట్ పాటలతో తనకు అండగా నిలిచిన మణిశర్మకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు. "నా డ్యాన్స్‌కు ప్రాణం పోసింది మణిశర్మ సంగీతమే" అంటూ ఆయనతో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. చివరగా యువతకు మరోసారి పిలుపునిస్తూ.. "సినిమా ఇండస్ట్రీకే రావాల్సిన అవసరం లేదు. మీకు నచ్చిన రంగంలో రాణించండి. తల్లిదండ్రులు గర్వపడే స్థాయికి చేరుకోండి. ఈ ఒక్క జీవితాన్ని సార్థకం చేసుకోండి" అంటూ చిరంజీవి అన్నారు. ప్రస్తుతం చిరంజీవి కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.More Articles