హైపర్ ఆది.. ఈ పేరు తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. తెలుగు బుల్లితెరపై తన పంచ్ డైలాగులు, చురుకైన ప్రాసలతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. జబర్దస్త్ కామెడీ షో ద్వారా కమెడియన్‌గా కెరీర్ ప్రారంభించిన ఆది, ప్రస్తుతం టీవీ షోలతో పాటు సినిమాల్లోనూ వరుస అవకాశాలు అందుకుంటున్నారు. ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక స్థానం సంపాదించుకున్నారు. అలాగే.. మెగాస్టార్ చిరంజీవి, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌లపై తనకున్న అభిమానాన్ని పలు సందర్భాల్లో బహిరంగంగానే వ్యక్తం చేస్తుంటారు. జనసేన సభలు, సినీ వేడుకలు, అభిమానుల సమావేశాల్లో ఆయన చేసే ప్రసంగాలు తరచూ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుంటాయి. తాజాగా హైపర్ ఆది పవర్‌ఫుల్ ప్రసంగం మరోసారి సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇంతకీ ఏమన్నారంటే ?
తాజాగా హైపర్ ఆది చేసిన ఓ స్పీచ్ ఇప్పుడు నెట్టింట విపరీతంగా చక్కర్లు కొడుతోంది. ఈ ప్రసంగంలో ఆయన సినీ పరిశ్రమలోని ఓ దర్శకుడిని పరోక్షంగా ప్రస్తావిస్తూ వ్యాఖ్యలు చేశారు. "ఈ టాలీవుడ్‌లో ఒక డైరెక్టర్ ఉన్నారు. ఆయనపై విమర్శలు చేసే స్థాయి నాకు లేదు. కానీ మెగాస్టార్ చిరంజీవి గారిని, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారిని విమర్శించే స్థాయి కూడా ఆయనకు లేదు. చిన్న పెగ్ వేసినప్పుడు చిరంజీవి గారిని, పెద్ద పెగ్ వేసినప్పుడు పవన్ కళ్యాణ్ గారిని విమర్శిస్తుంటారు. అర్థం లేని విమర్శలకు చప్పట్లు రావు. అర్థం కాని సినిమాలకు కలెక్షన్లు రావు" అంటూ ఘాటు విమర్శలు చేశారు.
అంతేకాదు, చిరంజీవి సేవా కార్యక్రమాలను కూడా ప్రస్తావించారు. "చిరంజీవి గారి బ్లడ్ బ్యాంక్ సేవలను గుర్తించి ప్రభుత్వాలు అవార్డులు ఇచ్చాయి. కానీ అదే చిరంజీవి గారు రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత ఆ బ్లడ్ బ్యాంక్ గురించే తప్పుడు ప్రచారాలు జరిగాయి. అయినా ఆయన ఎవరినీ ద్వేషించలేదు. అన్నింటినీ భరించారు.. క్షమించారు. అదే మెగాస్టార్ గొప్పతనం" అంటూ చిరంజీవిని ప్రశంసించారు. రామ్ చరణ్ సినీ ప్రయాణాన్ని గుర్తు చేస్తూ కూడా హైపర్ ఆది ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. "రామ్ చరణ్ 'చిరుత' సినిమాతో హీరోగా పరిచయమైనప్పుడు చాలా మంది కావాలనే విమర్శించారు. సినిమా హిట్ అయితే దర్శకుడి వల్ల, ఫ్లాప్ అయితే చరణ్ వల్ల అని కామెంట్లు చేశారు. కానీ 'రంగస్థలం' వచ్చిన తర్వాత విమర్శించిన వాళ్లంతా చేతులు ఎత్తి జై కొట్టారు. అప్పటి వరకు మాట్లాడిన వాళ్లంతా మౌనంగా ఉండిపోయారు" అని అన్నారు. ఇక తన ప్రసంగంలో మరింత హైలెట్.. "సచిన్ టెండూల్కర్ కొడుకు సచిన్ కాలేదు. అమితాబ్ బచ్చన్ కొడుకు అమితాబ్ కాలేదు. కానీ చిరంజీవి కొడుకు మాత్రం చిరంజీవి అయ్యాడు. కొణిదెల వెంకట్రావు గారికి చిరంజీవి ఎంత పేరు తీసుకొచ్చారో, చిరంజీవి గారికి రామ్ చరణ్ అంతకంటే ఎక్కువ పేరు తీసుకొచ్చాడు" అంటూ హైపర్ ఆది ప్రశంసించారు. ప్రస్తుతం హైపర్ ఆది వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ముఖ్యంగా మెగా అభిమానులు ఈ వీడియోను పెద్ద ఎత్తున షేర్ చేస్తున్నారు.More Articles