లెజెండరీ సింగర్ ఎస్ జానకి అనారోగ్యంతో జూలై 11న కన్నుమూసిన సంగతి తెలిసిందే. ఆమె మరణం సినీ సంగీత ప్రపంచాన్ని విషాదంలోకి నెట్టింది. ఇటీవల దిగ్గజ గాయనీ ఆశా భోస్లే మరణం నుంచి సంగీత అభిమానులు తేరుకోకముందే జానకి కూడా దూరం కావడంతో ప్రజలు, సినీ, సంగీత ప్రముఖులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. సినీ సంగీతానికి ఆమె అందించిన సేవలను గుర్తుచేసుకుంటున్నారు.
ఎస్ జానకి గాత్రం సంగీతం ప్రియులకు అమృతంలా తోస్తుంది. హృదయాన్ని మత్తులో ఓలలాడించే మెలోడీలు, గుండెను మెలిపెట్టే విషాద గీతాలు, హుషారెత్తించే పాటలు ఆమె గానంలో జాలువారాయి. మాధుర్యమైన పాటలే కలకాలం నిలుస్తాయని జానకి గట్టి నమ్మేవారు. సాహిత్యంలోని పదాల సొగసు చెక్కు చెదరకుండా, భావం నేరుగా మనసు హత్తుకునేలా పాటలు పాడటంలో జానకిది అందెవేసిన చేయి. పెద్దగా ఆడని సినిమాలు కూడా జానకి గాత్రంతో గుర్తింపు తెచ్చుకున్న సందర్భాలు ఎన్నో ఉన్నాయి.
సాధారణంగా కొందరు మిమిక్రీ కళాకారులు బయట చిన్నారుల నుంచి పెద్దవాళ్లు, ఇతర ప్రముఖుల గొంతులను అద్భుతంగా అనుకరిస్తూ అలరిస్తుంటారు. అలాంటిది నేపథ్య గానంలో అసలు ఊహించగలమా? కానీ దీనిని జానకీ ఆచరణలో చేసి చూపించి అందరినీ ముక్కున వేలేసుకునేలా చేశారు. గానంలో కమ్మదనంతో పాటు అనుకరణ అనేది జానకమ్మ శైలిగా సినీ సంగీత ప్రపంచంలో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. ఆరేళ్ల చిన్నారి నుంచి అరవై ఏళ్ల వృద్ధురాలి వరకు ఆయా పాత్రలను తన గాత్రంతోనే జానకమ్మ ఆవిష్కరించారు. సప్తపది సినిమాలో గోవుళ్లు తెల్లన.. గోధూళి తెల్లన.. గోపయ్య నల్లన అనే వర్ణ వివక్షణతను ప్రశ్నిస్తూ రాసిన గేయాన్ని ఎస్పీ బాలసుబ్రహ్మణ్యంతో కలిసి రసరంజకంగా పాడారు. ఈ గీతంలో జానకి రెండు గొంతులు వినిపిస్తాయి. ఒకటి పదేళ్ల బాలుడిదైతే, మరొకటి మూడేళ్ల వయసుగల బాబుది. మూడేళ్ల బాబుకు మాటలు రావు కాబట్టి.. అతను వచ్చిరాని మాటలతో పాటలు పాడతాడు. కొంచెం పెద్ద బాబు గొంతుకు శ్రుతి, లయ కలగలిపి పాడారు. ఈ రెండు గొంతుల్లో వైవిధ్యాన్ని చూపించి.. పాడింది ఒకరా? ఇద్దరా అన్న భావనను జానకమ్మ కలిగించారు. అలా నేపథ్య గానంలో మిమిక్రీ చేసిన అరుదైన ఘనతను ఆమె సొంతం చేసుకున్నారు. ఇదే కాదు.. 1985లో వచ్చిన శ్రీవారి శోభనం అనే సినిమాలో వేటూరి రాసిన అలక పానుపు ఎక్కనేల చిలిపి గోరింక అనే పాట కూడా ఇదే కోవలోకి వస్తుంది. రమేశ్ నాయుడు సంగీతం అందించిన ఈ పాటలోనూ రెండు గొంతులతో మేజిక్ చేశారు జానకి. తొలుత పడుచు పిల్లలా పాడుతూ.. ఆ తర్వాత ముసలి అవ్వ మాదిరిగా గొంతు మారుస్తు పాడి తనకు సాటి లేరని నిరూపించుకున్నారు ఈ స్వర సామ్రాజ్ఞి. జానకమ్మ ఆల్బమ్ చెక్ చేస్తే ఇలాంటి ఎన్నో ప్రయోగాలు, వైవిధ్యం కనిపిస్తాయి. పాటను అందరిలా పాడకుండా తనకే సొంతమైన హంగులద్ది దానిని మరింత ప్రత్యకంగా మార్చారు ఈ లెజెండరీ సింగర్. ఆమె పాటలు పాడే విధానం గురించి రాయడానికి పదాలు లేవు. ఏ శృతిలోనైనా పాడగిలిగే విలక్షణ జానకమ్మ సొంతం. వైరుధ్యం, వైవిధ్యం కలగలిసి ఉండటం నేపథ్య గానంలో చాలా అరుదు. ఇలాంటి లక్షణాలతోనే ఆమె సినీ సంగీత ప్రపంచాన్ని శాసించారు. అలాంటి జానకమ్మ సంగీత ప్రియులను శోక సంద్రంలో వదిలేసి తిరిగిరాని లోకాలకు తరలిపోయారు.More Articles