సాయాజీ షిండే.. పరిచయం అక్కర్లేని పేరు. ఉత్తరాది నుంచి తెలుగు చిత్ర పరిశ్రమలో అడుగుపెట్టి తన విలక్షణ నటనతో ఇక్కడా గుర్తింపు తెచ్చుకున్నారు. నిన్నగాక మొన్న వచ్చే నటులకు కూడా డబ్బింగ్ చెబుతుండగా.. కెరీర్ తొలినాళ్ల నుంచి అచ్చ తెలుగులో తన డబ్బింగ్ తనే చెప్పుకుంటూ ఎంతో మందికి ఆదర్శంగా నిలిచారు. పవర్‌ఫుల్ విలన్‌గా, నవ్వులు పూయించే కమెడియన్‌గా, ఏడిపించే సహాయ నటుడిగా తన ప్రతిభను చాటుకున్నారు. ఇటీవల ఓ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో తన భార్యతో ప్రేమ, పెళ్లిపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ వివరాల్లోకి వెళితే..
1978లో సాధారణ వాచ్‌మెన్‌గా కెరీర్ ప్రారంభించారు సాయాజీ షిండే. అప్పడు ఆయన జీతం 165 రూపాయలు. ఒక డ్యామ్ నిర్మాణం కోసం వీరి కుటుంబానికి చెందిన భూమిని మహారాష్ట్ర ప్రభుత్వం తీసుకుంది. దీనికి నష్టపరిహారంగా ఇరిగేషన్ శాఖలో ఆయనకు వాచ్‌మెన్ ఉద్యోగం ఇచ్చారు. అయితే ఇందుకు అసలైన పరిహారం మాత్రం దాదాపు 35 ఏళ్ల తర్వాత వచ్చింది. చాలీ చాలనీ జీతంతోనే కుటుంబాన్ని పోషించుకుంటూ వచ్చారు. నటనపై ఆసక్తితో ముంబైకి మకాం మార్చిన ఆయన ఎన్నో అవమానాలు, కష్టాలు పడ్డారు.
1978లోనే నటనలో దిగిన సాయాజీ షిండే మరాఠీ ఇండస్ట్రీలో చిన్నాచితకా పాత్రలు పోషించారు. జుల్వా, ఒన్ రూమ్ కిచెన్, అమాచ్య యా గెహరత్ సినిమాలు ఆయనకు మంచి గుర్తింపు తీసుచ్చాయి. ఈ క్రమంలో మనోజ్ బాజ్‌పేయ్‌తో పరిచయం షిండే కెరీర్‌ను మలుపు తిప్పింది.. సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మకు షిండేను పరిచయం చేశారు చేశారు. ఆర్జీవీ దర్శకత్వంలో వచ్చిన శూల్ మూవీలో కీలకపాత్ర పోషించారు. దాంతో అందరి కళ్లలో పడ్డారు సాయాజీ షిండే. 2003లో మెగాస్టార్ చిరంజీవి హీరోగా వచ్చిన ఠాగూర్‌లో బదిరీ నారాయణ అనే విలన్ పాత్రలో అద్భుతంగా నటించి తెలుగు చిత్ర పరిశ్రమలో అడుగుపెట్టారు. నాటి నుంచి షిండే వెనుదిరిగి చూసుకోలేదు.. ఆంధ్రా వాలా, పోకిరి, సూపర్, లక్ష్మీ, రాఖీ, దుబాయ్ శీను, చిరుత, కృష్ణ, అరుంధతి, కిక్, ఆర్య 2 తదితర చిత్రాలతో తన మార్క్ చూపించారు. తెలుగుతో పాటు మరాఠీ, హిందీ, తమిళ్, కన్నడ, మలయాళం, భోజ్‌పురి తదితర భాషలలోనూ నటించారు. తెరపై విలన్‌గా క్రూరంగా కనిపించే సాయాజీ షిండే.. నిజ జీవితంలో ఎంతో మంచి వ్యక్తి. 2016లో తన తల్లి పేరిట సహ్యాద్రి దేవరాయ్ అనే ఉద్యమాన్ని నాటి లక్షల్లో మొక్కలను నాటారు. కేవలం మొక్కలు నాటడమే కాదు.. రోడ్ల విస్తరణలో నరికివేయడానికి సిద్ధంగా ఉన్న 200కు పైగా భారీ మర్రి చెట్లను సొంత ఖర్చుతో అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం ద్వారా వేరే చోటుకు తరలించి పర్యావరణవేత్తలు, ప్రజల ప్రశంసలు దక్కించుకున్నారు. రెండేళ్ల క్రితం మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల వేళ.. నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (అజిత్ పవార్ గ్రూప్)లో చేరారు. ఆయనకు భార్య అల్కా షిండే, కుమారుడు సిద్ధార్ధ్ షిండే ఉన్నారు. ఇటీవల ఓ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో తన ప్రేమ, పెళ్లి గురించి, ఈ విషయంలో తాను ఎదుర్కొన్న అవమానాల గురించి పంచుకున్నారు సాయాజీ షిండే. ఒకసారి అల్కా బావగారు అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరారు. సాయాజీ కూడా ఏదో సమస్యతో అడ్మిట్ అయ్యారు. అప్పటికే సాయాజీకి అల్కా వీరాభిమాని. ఈ విషయం తెలుసుకున్న అల్కా.. ఆసుపత్రిలో తొలిసారి ఆయనను కలిశారు. పుస్తకాలు ఇచ్చి పుచ్చుకోవడంతో కలిసిన మాటలు ప్రేమకు దారి తీశాయి. అలా 2002లో పెద్దల అంగీకారంతో సాయాజీ షిండే, అల్కా షిండేల వివాహం జరిగింది. అయితే వీరిద్దరి మధ్య దాదాపు 15 ఏళ్ల ఏజ్ గ్యాప్ కారణంగా ఈ జంట ఎన్నో అవమానాలు భరించింది. దాంతో తన క్లోజ్ ఫ్రెండ్సే నన్ను హేళనగా మాట్లాడేవారని.. మీ అమ్మాయా? అని ఆటపట్టించేవారని సాయాజీ ఆవేదన వ్యక్తం చేశారు. అయితే ఈ విషయంలో తనకు భార్య అండగా నిలిచారని.. సాయాజీ తెలిపారు. అలా అన్ని అవమానాలను భరించిన వీరిద్దరూ దాదాపు 25 ఏళ్లుగా అన్యోన్యంగా జీవిస్తున్నారు.More Articles