తెలుగు సినీ పరిశ్రమలో విషాదం చోటుచేసుకుంది. క్యారెక్టర్ ఆర్టిస్టుగా ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న సీనియర్ నటి పావలా శ్యామల ఇకలేరు. వందలాది సినిమాల్లో నటించి ప్రేక్షకులను నవ్వించిన ఆమె.. చివరి రోజుల్లో తీవ్ర అనారోగ్యం, ఆర్థిక ఇబ్బందులతో పోరాడుతూ కన్నుమూశారు. హైదరాబాద్‌లోని ఉస్మానియా ఆస్పత్రిలో చికిత్స పొందుతూ సోమవారం అర్థరాత్రి తర్వాత తుదిశ్వాస విడిచారు. ఆమె మృతి వార్త తెలిసిన వెంటనే సినీ పరిశ్రమలో విషాద ఛాయలు అలుముకున్నాయి. అభిమానులు, సినీ ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా సంతాపం వ్యక్తం చేస్తున్నారు.
వైద్యుల సమాచారం ప్రకారం.. సోమవారం అర్థరాత్రి 1.52 గంటల సమయంలో పావలా శ్యామలకు తీవ్ర గుండెపోటు వచ్చింది. వెంటనే వైద్యులు చికిత్స అందించినా ఫలితం లేకపోయింది. గుండెపోటు తీవ్రత ఎక్కువగా ఉండటంతో ఆమె ప్రాణాలు నిలబెట్టలేకపోయామని ,ఆమె మరణించినట్టు అధికారికంగా ప్రకటించారు. అనంతరం ఆమె మృతదేహాన్ని ఉస్మానియా ఆస్పత్రి మార్చురీకి తరలించారు. కూతురి దీనస్థితి, పావలా శ్యామల గత కొన్నేళ్లుగా తీవ్ర ఆర్థిక ఇబ్బందులు, వృద్ధాప్య సమస్యలతో జీవన పోరాటం సాగిస్తున్నారు.
పావలా శ్యామల గత కొన్నేళ్లుగా అనేక ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. హై బీపీ, గుండె సంబంధిత వ్యాధులు, కరోనా ఆర్టరీ డిసీజ్ (CAD), పార్కిన్సన్స్ వంటి సమస్యలు ఆమెను తీవ్రంగా ఇబ్బంది పెట్టాయి. వయసు పెరగడంతో ఆరోగ్యం మరింత క్షీణించింది. తరచూ ఆస్పత్రుల చుట్టూ తిరగాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఆరోగ్య సమస్యలతో పాటు ఆమె తీవ్రమైన ఆర్థిక ఇబ్బందులు కూడా ఎదుర్కొన్నారు. ఒకప్పుడు వందల సినిమాల్లో నటించి ప్రేక్షకులను అలరించిన నటి.. చివరి రోజుల్లో కనీస వైద్య ఖర్చుల కోసం కూడా ఇబ్బందులు పడటం ఎంతో మందిని కలచివేసింది. పలువురు సినీ ప్రముఖులు, నటులు, దర్శకులు, అభిమానులు తమ వంతు ఆర్థిక సహాయం అందిస్తూ ఆమెకు అండగా నిలిచారు. అయినప్పటికీ ఆరోగ్యం మాత్రం క్రమంగా క్షీణించింది. పావలా శ్యామలతో పాటు ఆమె కుమార్తె మాధవి కూడా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నారు. తల్లి, కూతురు ఇద్దరూ చికిత్స కోసం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. కొద్ది నెలల క్రితం ఇద్దరినీ హైదరాబాద్‌లోని ఎర్రగడ్డ ప్రభుత్వ ఛాతీ ఆస్పత్రి ఆవరణలో గుర్తుతెలియని వ్యక్తులు వదిలివెళ్లిన ఘటన రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. వారిని గమనించిన ఆస్పత్రి సిబ్బంది వెంటనే అధికారులకు సమాచారం ఇచ్చారు. ఆ తర్వాత వైద్యుల సూచన మేరకు ఇద్దరినీ ఉస్మానియా ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. కొంతకాలం అక్కడే ఉన్న పావలా శ్యామల.. మళ్లీ ఎర్రగడ్డ ఛాతీ ఆస్పత్రికి వెళ్లారు. అనంతరం పోలీసులు జోక్యం చేసుకుని వారిని నగరంలోని ఆశ్రయ కేంద్రానికి తరలించినట్లు సమాచారం. కానీ ఆమె ఆరోగ్యం మాత్రం రోజురోజుకూ మరింత విషమించింది. గత వారం గుండె సంబంధిత సమస్యలు మళ్లీ తీవ్రంగా మారడంతో పావలా శ్యామలను మరోసారి ఉస్మానియా ఆస్పత్రిలో చేర్చారు. ఇదే సమయంలో ఆమె కుమార్తె మాధవిని కూడా ఉస్మానియా ఆస్పత్రిలో ఇన్‌పేషెంట్‌గా చేర్చి వైద్యం అందించారు. పావలా శ్యామల 1951లో పల్నాడు జిల్లా అమరావతిలో జన్మించారు. మొదట నాటక రంగంలో తన ప్రయాణాన్ని ప్రారంభించారు. "పావలా" అనే నాటకంలో ఆమె నటనకు మంచి గుర్తింపు రావడంతో.. అసలు పేరు శ్యామల అయినప్పటికీ అందరూ "పావలా శ్యామల"గా పిలవడం మొదలుపెట్టారు. ఆ పేరు జీవితాంతం ఆమెకు గుర్తింపుగా నిలిచిపోయింది. నాటక రంగంలో మంచి పేరు తెచ్చుకున్న తర్వాత సినిమాల్లో అవకాశాలు వచ్చాయి. 1985లో బాలకృష్ణ హీరోగా నటించిన 'బాబాయ్ అబ్బాయి' సినిమాతో వెండితెరకు పరిచయమయ్యారు. ఆ తర్వాత వెనుదిరిగి చూడలేదు. క్యారెక్టర్ ఆర్టిస్టుగా, కామెడీ నటిగా వందలాది చిత్రాల్లో నటించి ప్రేక్షకుల ప్రశంసలు అందుకున్నారు. మొగుడు పెళ్లాలు, స్వర్ణ కమలం, కర్తవ్యం, దండోరా, సుస్వాగతం, మనసంతా నువ్వే, అల్లరి రాముడు, ఇంద్ర, వర్షం, నువ్వొస్తానంటే నేనొద్దంటానా, ఠాగూర్, ఖడ్గం, ఈశ్వర్, బాబు బంగారం, దృశ్యం, మత్తు వదలరా వంటి ఎన్నో చిత్రాల్లో ఆమె నటించారు. పావలా శ్యామల ప్రత్యేకత ఆమె సహజ నటన. చిన్న పాత్ర అయినా తన హావభావాలతో గుర్తుండిపోయేలా చేసేవారు. దాదాపు నాలుగు దశాబ్దాల సినీ ప్రయాణంలో అనేక మంది స్టార్ హీరోలు, దర్శకులతో కలిసి పనిచేశారు. ఆమె మరణంపై పలువురు సినీ ప్రముఖులు ఆమె కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నారు.More Articles