S Janaki: భారతీయ సంగీత ప్రపంచంలో ఒక సువర్ణ అధ్యాయం ముగిసింది. 'నైటింగేల్ ఆఫ్ సౌత్ ఇండియా'గా, 'జానకమ్మ'గా కీర్తి పొందిన వెటరన్ ప్లేబ్యాక్ సింగర్ ఎస్.జానకి తన 88వ ఏట తుదిశ్వాస విడిచారు. శనివారం (జూలై 11) మైసూర్ లో కన్నుమూశారు. ఏడు దశాబ్దాలుగా తన మధురమైన గాత్రంతో కోట్లాది మంది సంగీతాభిమానులను అలరించారు. తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం మాత్రమే కాదు.. అనేక భారతీయ, విదేశీ భాషల్లో కూడా వేలాది పాటలు పాడి అరుదైన రికార్డు సృష్టించారు. ఆమె సంగీత ప్రస్థానం గురించి చాలా మందికి తెలిసినా.. ఆమె వ్యక్తిగత జీవితానికి సంబంధించిన కొన్ని ఆసక్తికర విషయాలు మాత్రం చాలామందికి తెలియవు. ఆమె జీవితంలోని అలాంటి 5 ఇంటెస్ట్రింగ్ ఫ్యాక్ట్స్ తెలుసుకుందాం.
25 భాషల్లో 48 వేల పాటలు
ఆంధ్రప్రదేశ్‌లో జన్మించిన జానకమ్మ.. మొదట తెలుగు సినీ పరిశ్రమలో నేపథ్య గాయనిగా తన కెరీర్‌ను ప్రారంభించారు. 1957లో వచ్చిన అవకాశాలతో ఆమె సినీ సంగీత ప్రపంచంలో అడుగుపెట్టారు. అనంతరం తమిళ చిత్రసీమలోకి ప్రవేశించి 'కొంజుమ్ సలంగై' సినిమాలోని 'సింగారవేలనే దేవా' పాటతో అక్కడ కూడా తన ప్రత్యేక గుర్తింపును సంపాదించారు. ఆ తర్వాత మలయాళం, కన్నడ, ఒడియా, హిందీతో పాటు మొత్తం 25 భాషల్లో 48 వేలకుపైగా పాటలు పాడారు. భారతీయ సంగీత చరిత్రలోనే అత్యంత ఎక్కువ పాటలు పాడిన గాయనుల్లో ఒకరిగా నిలిచారు. ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యంతో కలిసి ఆమె ఎన్నో యుగళ గీతాలు పాడారు.
భర్త మరణం తర్వాత రంగుల చీరలకు దూరం ఆరోగ్య సమస్యలతో వేల పాటలు పద్మభూషణ్‌ను తిరస్కరించిన గాయని రిటైర్మెంట్ ప్రకటించి.. అభిమానుల కోరికపై మళ్లీ పాట గానకోకిలగా చిరస్థాయిగా నిలిచిన జానకమ్మ
ఎస్. జానకి జీవితంలో ఆమె భర్త వి. రాంప్రసాద్ పాత్ర ఎంతో కీలకమైనది. ఆయన ఆమె ప్రతి రికార్డింగ్‌కు తోడుగా ఉండేవారు. గాన జీవితంలో ఆమెకు అండగా నిలిచిన వ్యక్తి కూడా ఆయనే. అయితే 1997లో రాంప్రసాద్ మరణించడం జానకి జీవితంలో పెద్ద విషాదంగా మారింది. భర్త మరణించిన తర్వాత రంగురంగుల చీరలు, బంగారు జరీ అంచులు ఉన్న చీరలు ధరించడం పూర్తిగా మానేశారు. అప్పటి నుంచి చాలా వరకు సాధారణ రంగుల చీరలతోనే కనిపించడం ఆమె జీవితంలో ఇది సంచలన నిర్ణయం.
సంగీత ప్రపంచంలో ఎస్. జానకి సాధించిన విజయాలు చూసినప్పుడు ఆమె ప్రయాణం చాలా సులభంగా సాగిందని అనిపించవచ్చు. కానీ వాస్తవానికి ఆమె శ్వాసకోశ (Respiratory) సంబంధిత సమస్యలతో కూడా బాధపడేవారు. అలాంటి ఆరోగ్య సమస్యలు ఉన్నప్పటికీ కఠినమైన పాటలను కూడా అద్భుతంగా ఆలపించి సంగీత దర్శకులను, అభిమానులను ఆశ్చర్యపరిచారు. భారతీయ భాషలతో పాటు జర్మన్, జపనీస్, ఇంగ్లిష్, సింహళం వంటి విదేశీ భాషల్లో కూడా పాటలు పాడడం ఆమె ప్రతిభకు నిదర్శనం. అనేక జాతీయ, రాష్ట్ర స్థాయి పురస్కారాలు అందుకున్నారు.
సింగర్ జానకి గారికి 2013లో భారత ప్రభుత్వం పద్మభూషణ్ పురస్కారాన్ని ప్రకటించింది. అయితే.. జానకమ్మ ఆ పురస్కారాన్ని తిరస్కరించడం దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. సాధారణంగా దేశ అత్యున్నత పురస్కారాల్లో ఒకటైన ఈ అవార్డును అందుకోవడానికి కళాకారులు ఆసక్తి చూపుతారు. అయితే జానకి మాత్రం ఈ గుర్తింపు తనకు చాలా ఆలస్యంగా వచ్చిందని పేర్కొంటూ పురస్కారాన్ని స్వీకరించలేదు. దక్షిణాది కళాకారులకు సరైన సమయంలో తగిన గుర్తింపు లభించడం లేదనే అభిప్రాయాన్ని కూడా ఆమె వ్యక్తం చేశారు. ఈ నిర్ణయం అప్పట్లో దేశవ్యాప్తంగా చర్చకు దారితీసింది. అయినప్పటికీ ఆమె తన నిర్ణయాన్ని మార్చుకోలేదు.
48 వేలకుపైగా పాటలు పాడిన తర్వాత 2016లో ఎస్. జానకి సినిమాలు, స్టేజ్ షోలు, సంగీత కార్యక్రమాలకు గుడ్‌బై చెబుతున్నట్లు ప్రకటించారు. దీంతో అభిమానులు, సంగీత దర్శకులు, సినీ ప్రముఖులు ఒక్కసారిగా భావోద్వేగానికి గురయ్యారు. అయితే అభిమానులు, సినీ పరిశ్రమ నుంచి వచ్చిన విజ్ఞప్తుల నేపథ్యంలో ఆమె తన నిర్ణయాన్ని కొంతవరకు మార్చుకున్నారు. 2018లో విడుదలైన తమిళ సినిమా 'పన్నాడి' కోసం 'ఉన్ ఉసురు కాత్తులా' అనే పాటను ఆలపించారు. దీంతో ఆమె రిటైర్మెంట్ నిర్ణయాన్ని పాక్షికంగా వెనక్కి తీసుకున్నట్లు అయింది.
ఎస్. జానకి కేవలం ఒక గొప్ప గాయని మాత్రమే కాదు.. తన గాత్రంతో భావోద్వేగాలను పలికించిన అరుదైన కళాకారిణి. చిన్నారి పాత్ర నుంచి వృద్ధురాలి పాత్ర వరకు.. తెరపై కనిపించే పాత్రకు తగ్గట్టుగా స్వరాన్ని మార్చి పాడగలిగిన ఆమె ప్రతిభ ఇప్పటికీ సంగీత ప్రపంచంలో ప్రత్యేకంగా నిలుస్తోంది. ఏడు దశాబ్దాలకు పైగా సాగిన ఆమె గాన ప్రస్థానం.. 25 భాషల్లో 48 వేలకుపైగా పాటలు.. ఎన్నో జాతీయ, రాష్ట్ర స్థాయి పురస్కారాలు.. కోట్లాది మంది అభిమానుల ప్రేమ.. ఇవన్నీ కలిపి ఎస్. జానకిని భారతీయ సినీ సంగీత చరిత్రలో చిరస్థాయిగా నిలబెట్టాయి. ఆమె భౌతికంగా మనకు దూరమైనా.. ఆమె ఆలపించిన అమర గీతాల ద్వారా ఎప్పటికీ ప్రేక్షకుల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోతారు.More Articles