Drug Case: 252 కోట్ల డ్రగ్స్ స్కామ్.. టాప్ హీరోయిన్ సోదరుడికి నోటీసులు!
సినిమా పరిశ్రమలో మరోసారి డ్రగ్స్ మాఫియా వ్యవహారం కలకలం రేపింది. దావూద్ ఇబ్రహీం ముఠాకు చెందిన కీలక వ్యక్తులు బాలీవుడ్‌లో రేవ్ పార్టీలు నిర్వహించారనే ఆరోపణలు సంచలనం రేపాయి. ఈ వార్తల నేపథ్యంలో డ్రగ్స్ పార్టీలు, రేవ్ పార్టీల గురించి నిగ్గు తేల్చేందుకు ముంబై పోలీసులు సినీ తారలపై కొరడా ఝులించేందుకు సిద్దమవుతున్నారు. ఈ క్రమంలో తాజాగా ఇద్దరు బాలీవుడ్ సెలబ్రిటీలకు ముంబైకి చెందిన యాంటీ నార్కోటిక్స్ సెల్ (ANC) సమన్లు జారీ చేశారు. ఈ స్కామ్ ఏమిటి? ఎన్ని కోట్ల మేర కుంభకోణం జరిగింది? ఎవరెవరి పేర్లు ఈ వ్యవహారంలో వినిపిస్తున్నాయి అనే వివరాల్లోకి వెళితే..
జాతీయ మీడియా కథనాల ప్రకారం.. ఇటీవల ముంబై పోలీసుల జరిపిన మెరుపు దాడుల్లో మహ్మద్ సలీమ్, మహ్మద్ సుహైల్ షేక్ అనే ఇద్దరు డ్రగ్స్ సప్లయర్లను అరెస్ట్ చేశారు. వారిని విచారించగా సంచలన విషయాలు బయటపెట్టారు. తాము నిర్వహించిన విలాసవంతమైన డ్రగ్స్ పార్టీలకు బాలీవుడ్ సినీ తారలు హాజరయ్యారు. గతంలో పలువురు సినీ హీరోలు, హీరోయిన్లు పాల్గొన్న పార్టీలకు డ్రగ్స్ సప్లై చేశామని చెప్పినట్టు సమాచారం.

బాలీవుడ్‌లో నిర్వహించిన డ్రగ్స్ పార్టీలకు నోరా ఫతేహి, శ్రద్దాకపూర్, ఆమె సోదరుడు సిద్దాంత్ కపూర్, సోషల్ మీడియా ఇన్‌ప్లూయెన్సర్ ఓరీ, దర్శక ద్వయం అబ్బాస్ మస్తాన్, ర్యాపర్ లోక, ఇటీవల దుండగుల కాల్పుల్లో మరణించిన సల్మాన్ స్నేహితుడు బాబా సిద్దిఖీ కుమారుడు జీషన్ సిద్దిఖీ, దావూద్ మేనల్లుడు కూడా హాజరైనట్టు సమాచారం. దాదాపు 252 కోట్ల రూపాయల విలువైన డ్రగ్స్ అక్రమ రవాణా చేసినట్టు తాజా దర్యాప్తులో బయటకు రావడం సంచలనంగా మారింది.
ముంబైలో వెలుగులోకి వచ్చిన భారీ డ్రగ్స్ దందాపై వాస్తవాలు వెలుగులోకి తెచ్చేందుకు పోలీసులు రంగంలోకి దిగారు. ఈ కేసును అన్ని కోణాల్లో విచారించేందుకు నోటీసులు జారీ చేశారు. తాజాగా ఓరీ, శ్రద్దా కపూర్ సోదరుడు సిద్దాంత్ కపూర్‌ను విచారణకు హాజరు కావాలంటూ సమన్లు జారీ చేశారు. ఇటీవల మరికొందరికి నోటీసులు జారీ చేయగా.. వారు గైర్హాజరు అయ్యారు. అయితే వారిని నవంబర్ 26 తేదీన గానీ, ఆ లోపుగానీ హాజరు కావాలని సమన్లలో పేర్కొన్నట్టు సమాచారం.
అయితే ఓరీ, సిద్దాంత్ కపూర్‌కు ఈ కేసులో స్పష్టమైన ఆదేశాలను ముంబై ఏఎన్‌సీ పోలీసులు జారీ చేశారు. ఈ కేసులో స్టేట్‌మెంట్ రికార్డు చేయాల్సి ఉంది. కాబట్టి ఘాట్‌కోపర్‌లోని ఏఎన్‌సీ ముందు విచారణకు హాజరుకావాలి. లేని యెడల తీవ్రమైన పరిణామాలు ఉంటాయి అని సమన్లలో పేర్కొన్నట్టు తెలిసింది. అయితే ఓరీ, సిద్దాంత్ కపూర్ ఈ విచారణకు హాజరవుతారా? లేదా తప్పించుకొంటారా? అనేది వేచి చూడాల్సిందే.
పీటీఐ కథనం ప్రకారం.. దావూద్ ఇబ్రహీం అనుచరులు నిర్వహిస్తున్న డ్రగ్స్ దందా సుమారుగా 252 కోట్ల రూపాయలు అని తేలింది. ముంబై పోలీసులు తెలిపిన ప్రకారం.. సలీమ్ షేక్ అనే వ్యక్తి ముంబై, విదేశాల్లో ప్రముఖులు, బిజినెస్ సెలబ్రిటీలు, సినీ తారలతో కలిపి పార్టీలు నిర్వహించారు. ఆ పార్టీల్లో నోరా ఫతేహి, శ్రద్దాకపూర్, ఓరీ లాంటి ప్రముఖులు పాల్గొన్నారు. ఈ దందాలో పెద్ద ఎత్తున్న డ్రగ్ ట్రాఫికింగ్, హవాలా, మనీలాండరింగ్ జరిగింది అని పేర్కొన్నారు. అయితే ఈ పార్టీలకు హాజరు కాలేదు. ఈ కేసుతో నాకు సంబంధం లేదని నోరా ఫతేహి ఓ ప్రకటనను విడుదల చేసింది.


Click it and Unblock the Notifications











