సినిమాల్లోకి అమీర్ ఖాన్ కొడుకు జునైద్... ఆ టెస్ట్ పాసైతేనే అనుమతి!
బాలీవుడ్ మిస్టర్ పర్ఫెక్ట్ అమీర్ ఖాన్ త్వరలో తన కుమారుడు జునైద్‌ను ఇండస్ట్రీకి పరిచయం చేయబోతున్నాడు. ఇటీవల ఓ ప్రెస్ మీట్లో మీడియా ప్రతినిధులు అడిగిన ప్రశ్నకు అమీర్ ఖాన్ స్పందిస్తూ ఈ విషయాన్ని ఖరారు చేశారు.
జునైద్ భవిష్యత్తులో యాక్టర్ అవుతారా? డైరెక్టర్ అవుతారా? అనే ప్రశ్నకు అమీర్ ఖాన్ స్పందిస్తూ... 'జునైద్ యాక్టర్ అవ్వాలనుకుంటున్నాడు' అని సమాధానం ఇచ్చారు. అమీర్ ఖాన్, ఆయన మొదటి భార్య రీనా దత్తా సంతానమే జునైద్. వీరికి ఇరా అనే కూతురు కూడా ఉంది.
సినిమా రంగంలోకి నటుడిగా రావాలని జునైద్ ఆసక్తిగా ఉన్నాడు. నేను అతడి పనితీరు చూసినపుడు సంతృప్తి కలిగింది. సరైన స్క్రిప్టు కోసం వెయిట్ చేస్తున్నాం. అయితే స్క్రీన్ టెస్ట్ పాసైతేనే అతడికి భవిష్యత్ ఉంటుందని నమ్ముతాను. ఆ టెస్టులో పాసవ్వకపోతే యాక్టర్ అవుతాడని అనుకోవడం లేదని అమీర్ ఖాన్ తెలిపారు.

తన బయోపిక్ తీయాల్సి వస్తే అందులో జునైద్ నటించాలని కోరుకుంటానని ఓ ప్రశ్నకు అమీర్ రిప్లై ఇచ్చారు. జునైద్ అయితేనే దానికి బాగా సూటవుతాడని తాను నమ్ముతున్నట్లు ఈ మిస్టర్ పర్‌ఫెక్షనిస్ట్ తేల్చి చెప్పారు.
అమీర్ ఖాన్ సినిమాల విషయానికొస్తే... ఆయన నటించిన చివరి చిత్రం 'థగ్స్ ఆఫ్ హిందూస్థాన్' బాక్సాఫీసు వద్ద పరాజయం పాలైంది. దీని తర్వాత ఏ సినిమాకు అఫీషియల్‌గా కమిట్ కాలేదు. త్వరలో అమీర్ ఖాన్ మహాభారతం చేయబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది.


Click it and Unblock the Notifications











