60 ఏళ్ల వయసులో ప్రియురాలితో చెట్టాపట్టాల్ .. గౌరీతో ఆ ఈవెంట్‌కు అమీర్‌ఖాన్
బాలీవుడ్ సూపర్‌స్టార్ అమీర్‌ఖాన్ 60 ఏళ్ల వయసులో మూడో పెళ్లికి సిద్ధమైన సంగతి తెలిసిందే. బెంగళూరుకు చెందిన ఓ అమ్మాయితో గత కొంతకాలంగా ప్రేమాయణం సాగిస్తున్న ఆయన గురించి బాలీవుడ్ మీడియా కోడై కూస్తోంది. కానీ అమీర్ మాత్రం బయటపడలేదు. అయితే ఇటీవల తన పుట్టినరోజు నాడు తన రిలేషన్ గురించి బయటపెట్టి షాకిచ్చారు బాలీవుడ్ మిస్టర్ ఫర్ఫెక్ట్. అంతేకాదు.. తన ప్రియురాలిని కూడా మీడియా ద్వారా దేశ ప్రజలకు పరిచయం చేశారు అమీర్ ఖాన్. అఫీషియల్‌గా తమ బంధాన్ని బయటపెట్టిన అనంతరం ప్రియురాలితో కలిసి వెకేషన్ కోసం వెళ్లారు అమీర్. ఈ వివరాల్లోకి వెళితే..
1986లో బాలీవుడ్ నటి రీనా దత్తాను పెళ్లాడిన అమీర్‌ఖాన్‌కు ఐరా ఖాన్, జునైద్ ఖాన్ సంతానం. అయితే అనూహ్యంగా ఈ జంట విడాకులు తీసుకుని విడిపోయింది. కొన్నాళ్లు ఒంటరిగానే ఉన్న అమీర్ .. ఈ క్రమంలో లగాన్ చిత్రానికి అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచేసిన కిరణ్ రావుతో ప్రేమలో పడ్డారు. వీరు సరోగసి విధానంలో ఆజాద్ అనే కుమారుడికి జన్మనిచ్చారు. అమీర్‌కు రెండో పెళ్లి కూడా కలిసిరాలేదు.. కొద్దినెలల క్రితం అమీర్- కిరణ్ రావుల వైవాహిక జీవితానికి ఫుల్ స్టాప్ పడింది.

ఈ దశలో అమీర్‌ఖాన్ పలువురు హీరోయిన్‌లతో ప్రేమాయణం సాగిస్తున్నట్లుగా రకరకాల గాసిప్స్ వచ్చాయి. దంగల్ సినిమాలో తన కూతురుగా నటించిన ఫాతిమా సనా షేక్‌తో ఆయన డేటింగ్ చేస్తున్నట్లుగా గాసిప్స్ వైరల్ అయ్యాయి. అవన్నీ గాలి వార్తలేనని తర్వాత తేలింది. ఈ దశలో బెంగళూరుకు చెందిన అమ్మాయిని అమీర్‌ఖాన్ మూడో పెళ్లి చేసుకోబోతున్నట్లుగా వార్తలు రావడంతో బాలీవుడ్ షేక్ అయ్యింది.
ఈ పుకార్లకు తెరదించుతూ తన పుట్టినరోజు సందర్భంగా మీడియా సమావేశం ఏర్పాటు చేసిన అమీర్‌ఖాన్ తన రిలేషన్‌ను బయటపెట్టారు. తన స్నేహితురాలు గౌరీ స్ప్రాట్‌తో డేటింగ్ చేస్తున్నట్లు వివరిస్తూ లైవ్‌లో మీడియాకు పరిచయం చేశారు. ప్రముఖ స్టైలిస్ట్ రీటా స్ప్రాట్ కుమార్తె గౌరీ స్ప్రాట్ ... వీరి కుటుంబానికి ముంబై, బెంగళూరులలో సెలూన్స్ ఉన్నాయి. ఎంతో మంది సెలబ్రెటీలు వీరి కస్టమర్లే. అమీర్‌ఖాన్ ప్రొడక్షన్స్ సంస్థలో పనిచేస్తున్న గౌరీ స్ప్రాట్‌కు ఆయనతో దాదాపు 25 ఏళ్ల అనుబంధం ఉంది. కిరణ్ రావుతో విడాకుల తర్వాత వీరి మధ్య ప్రేమ చిగురించినట్లుగా బీ టౌన్ మీడియా కథనాలు ప్రసారం చేసింది. గౌరీ బెంగళూరులో ఉండటంతో తాను తరచుగా అక్కడికి వెళ్తుంటానని అందుకే ఇన్నాళ్లు తమ బంధం గురించి ఎక్కడా తెలియలేదని అమీర్‌ఖాన్ పేర్కొన్నారు.
తమ బంధాన్ని అధికారికంగా బయటపెట్టిన అమీర్‌ఖాన్.. కాబోయే భార్యతో కలిసి పబ్లిక్‌గానే చెట్టాపట్టాలేసుకుని తిరుగుతున్నారు. తాజాగా చైనాలోని ప్రఖ్యాత మకావు ఇంటర్నేషనల్ కామెడీ ఫెస్టివల్‌కు గౌరీ స్ప్రాట్‌తో కలిసి హాజరయ్యారు. ప్రియురాలి చేతిలో చెయ్యేసి ఫోటోలకు ఫోజులిచ్చారు. ప్రస్తుతం అమీర్‌ఖాన్ - గౌరీ స్ప్రాట్‌ల ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ప్రస్తుతం అమీర్ .. సూపర్‌స్టార్ రజనీకాంత్ నటిస్తున్న కూలీ చిత్రంలో గెస్ట్ రోల్ ద్వారా సౌత్ ఇండస్ట్రీలో అడుగుపెట్టనున్నారు. ఇది కాక మరో హిందీలో రెండు సినిమాలకు అమీర్‌ఖాన్ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.


Click it and Unblock the Notifications











