ప్రముఖ నటుడు కన్నుమూత.. కిడ్నీ వ్యాధితో పోరాడుతూ..
సుదీర్ఘకాలంగా హిందీ బుల్లితెరపై తన ప్రతిభతో ఆకట్టుకొంటున్న నటుడు ఆశీష్ రాయ్ కన్నుమూశారు. చాలా రోజులుగా కిడ్నీ వ్యాధి, ఇతర ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న రాయ్ ముంబైలో తుదిశ్వాస విడిచారు. ఆశీష్ రాయ్ మరణ వార్తను సినీ అండ్ టీవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ ధృవీకరించింది. దశాబ్దకాలంగా నటనారంగంలో ఉన్న ఆశీష్ రాయ్ బనేగి అప్నీ బాత్, ససురాల్ సిమర్ కా, రీమిక్స్, కుచ్ రంగ్ ప్యార్ కే ఐసీ భీ లాంటి సీరియల్స్‌లో నటించారు.
ఆశీష్ రాయ్ సన్నిహితులు పేర్కొన్న ప్రకారం.. ఆయన డయాలిసిస్ కోసం హాస్పిటల్‌కు వెళ్లాల్సింది. కానీ సోమవారం రాత్రి ఆకస్మికంగా మరణించారు. ఆశీష్ రాయ్ మృతితో తీవ్ర విషాదంలో మునిగిపోయాం అని అన్నారు.

కొద్ది సంవత్సరాలుగా ఆరోగ్య సమస్యలతో పోరాడుతున్న ఆశీష్ రాయ్ ఆర్థికంగా కూడా చితికిపోయారు. పలు మార్లు చికిత్స కోసం హాస్పిటల్‌లో చేరారు. లాక్‌డౌన్ కాలంలో ఆయన ఆరోగ్య పరిస్థితి మరింత క్షీణించింది. ఇప్పటికే ఆర్థిక సమస్యలతో బాధపడుతున్న ఆయన లాక్‌డౌన్‌లో ఆదాయం లేకపోవడంతో ఆయన పరిస్థితి క్లిష్టంగా మారింది అని సన్నిహితులు తెలిపారు.
ఇటీవల ఆశీష్ రాయ్ మీడియాతో మాట్లాడుతూ.. నా ఆరోగ్యం రోజు రోజుకు క్షీణిస్తున్నది. పొదుపు చేసిన 2 లక్షల రూపాయలు హాస్పిటల్‌లో చేరిన రెండు రోజులకే ఖర్చు అయ్యాయి అంటూ ఆవేదన చెందారు.


Click it and Unblock the Notifications











